పరిగి, ఆగస్టు 3 : పరిగిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్‌సీ)ను 30 పడకల నుంచి 100 పడకల ఏరియా ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేస్తూ తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించింది. దీంతో పరిగి ప్రాంత ప్రజలకు ఉచితంగా మరిన్ని మెరుగైన వైద్యసేవలు అందనున్నాయి. ఇప్పటికే పరిగి దవాఖానలో డయాలసిస్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. సివిల్ వర్క్స్, వైద్య యంత్ర పరికరాలు, ఇతర వాటి కోసం రూ.26 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో భవనాన్ని నిర్మించనున్నారు. అనంతరం అవసరమైన యంత్ర పరికరాలను ఏర్పాటు చేస్తారు.
పాత ఆస్పత్రి భవనం స్థానంలోనే నూతన భవనాన్ని నిర్మించే అవకాశం ఉన్నది. ప్రస్తుతం పరిగి దవాఖానలో 6 వైద్యుల పోస్టులు ఉండగా అదనంగా 20 వైద్యుల పోస్టులు మంజూరవుతాయి. ప్రధానంగా స్కిన్, ఈఎన్టీ, ఐ స్పెషలిస్ట్, ఆర్థోపెడిక్, జనరల్ సర్జరీ, గైనకాలజిస్ట్ తదితర వైద్యుల నియామకంతో పేద ప్రజలకు మరింత మెరుగైన వైద్య సదుపాయాలు ఈ ఆస్పత్రిలో అందనున్నాయి. పరిగి దవాఖానను 100 పడకల ఏరియా ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేసినందుకు మంత్రి హరీశ్‌రావుకు పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.