ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 5 : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 10 గంటల తర్వాత ఇండ్ల నుంచి బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. వామ్మో ఎండలంటూ ఆందోళన చెందుతున్నారు. ఏప్రిల్ ఆరంభంలోనే ఎండ తీవ్రత ఇలా ఉంటే మున్ముందు ఎలా ఉంటుందోనని వాపోతున్నారు. ఓవైపు పెండ్లిళ్ల సీజన్ కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తున్నది.
జాగ్రత్తలు తీసుకోకుండా బయటకు వెళ్లినవారు వడదెబ్బకు గురవుతున్నారు. వృద్ధులు ఇండ్లకే పరిమితమవుతున్నారు. రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా ఇబ్రహీంపట్నం మండలంలోని మంగల్‌పల్లి గ్రామంలో 43.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మండల పరిధిలోని అనేక గ్రామాల్లో ఎండలు దంచికొట్టాయి. ఎండవేడిమి తట్టుకోలేక ప్రజలు శీతల పానీయాల వైపు మొగ్గు చూపుతున్నారు.