పూడూరు, నవంబర్ 18 : మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ గురుకుల పాఠశాల ప్రారంభం నుంచి సరైన అధ్యాపకులులేక పాఠ్యాంశాలు పూర్తికాకపోవడంతో ఇంటర్మీడియట్ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. అధ్యాపకులను నియమించాలని ఉన్నతాధికారులను పలుమార్లు కోరినా ఎలాంటి స్పందనలేదని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ గురుకులంలో ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండియర్లలో బైపీసీ, ఎంపీసీ కోర్సులు మాత్రమే ఉన్నాయి. ఈ కోర్సుల్లో మొదట్లో 82 మంది అడ్మిషన్ అవగా.. సరైన అధ్యాపకులు లేరని 12 మంది విద్యార్థినులు సర్టిఫికెట్లు తీసుకుని వెళ్లారు. ప్రస్తుతం ఫస్టియర్లో 52 మంది, సెకండియర్లో 26 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. ప్రారంభం నుంచి తెలుగు, బాటనీ, జువాలజీ సబ్జెక్ట్ల అధ్యాపకులు మాత్రమే ఉండగా..
ఇతర సబ్జెక్ట్ల అధ్యాపకులు మొదటి నుంచి లేరని.. వారిని వెంటనే నియమించాలని సోమవారం విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు గురుకులం ఎదుట ఆందోళనకు దిగారు. రెండు నెలలైతే ఫైనల్ పరీక్షలు వస్తాయని.. తమకు సబ్జెక్టులు బోధించేవారు లేనప్పుడు ఎలా పరీక్షలు రాస్తామని విద్యార్థినులు రోదిస్తూ తమ ఆవేదనను వ్యక్తం చేశారు. అధ్యాపకులను నియమించాలంటూ విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్న విషయాన్ని ప్రిన్సిపాల్ ఫాతిమా జీసీడీవో శ్రీదేవికి ఫోన్ ద్వారా సమాచారమిచ్చారు. మంగళవారం గురుకులాన్ని సందర్శించి సమస్యలను పరిష్కరిస్తామని జీసీడీవో తెలిపినట్లు ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. కేజీబీవీని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు అక్బర్, కార్యదర్శి సతీశ్ సందర్శించి విద్యార్థినుల సమస్యలను తెలుసుకున్నారు. వెంటనే అన్ని సబ్జెక్టుల లెక్చరర్లను నియమించాలని వారు డిమాండ్ చేశారు.