ఐదెకరాల్లో స్టేడియం ఏర్పాటు
రేపు శంకుస్థాపన చేయనున్న మంత్రి కేటీఆర్
ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 7 : ఇబ్రహీంపట్నం ప్రాంత ప్రజలు, యువకుల చిరకాల వాంఛ అయిన స్టేడియం ఎట్టకేలకు ప్రారంభం కానుంది. ఇబ్రహీంపట్నానికి ఇప్పటి వరకు ఆటస్థలం లేకపోవటం వల్ల క్రీడాకారులు, యువకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో ఈ ప్రాంతంలో ఆటస్థలాలు ఏర్పాటు చేయాలని ఎప్పటినుంచో కోరుతున్నారు. ఇందుకోసం ఇబ్రహీంపట్నం సమీపంలోని వినోభానగర్‌లో స్టేడియం కోసం స్థలం తీసుకున్నప్పటికీ అక్కడ స్టేడియం ఏర్పాటుకు క్రీడాకారులు, యువత మొగ్గు చూపలేదు. దీంతో స్టేడియం ఏర్పాటు కలగానే మిగిలింది. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ప్రత్యేక చొరువ తీసుకుని ఇబ్రహీంపట్నం సమీపంలోని నాగార్జునసాగర్ రహదారి పక్కన దేవేంద్రనగర్‌లోని ప్రభుత్వ భూమి ఐదెకరాల్లో స్టేడియం ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఈ స్థలం ఇప్పటికే ఎలాంటి పట్టాలు లేకుండా కొంతమంది ఆధీనంలో ఉండగా వారినుంచి భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఈ భూమిలో ఆటస్థలం ఏర్పాటు చేయటానికి రెవెన్యూ అధికారుల అనుమతి తీసుకున్నారు. ఇక్కడ ఆటస్థలం ఏర్పాటు చేయటం కోసం ప్రభుత్వం నుంచి ఎమ్మెల్యే రూ.3 కోట్ల నిధులను కూడా మంజూరు చేయించారు. బుధవారం మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ స్టేడియం పూర్తయితే ఇక్కడే కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, టెన్నిస్ లాంటి అన్ని రకాల ఆటలు ఆడుకునేందుకు వీలుగా ఈ స్టేడియంను తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి తెలిపారు.