వికారాబాద్, జూలై 1 : మండలంలోని మైలార్‌దేవరంపల్లి పాఠశాల విద్యార్థుల నిమిత్తం వచ్చిన నిధులు (గ్రాంట్స్) రూ. 1,07,190 ప్రధానోపాధ్యాయుడు స్వాహా చేసినట్లు పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్, కమిటీ సభ్యులు పై అధికారులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం మండల ఎంఈవో మైలార్‌దేవరంపల్లి పాఠశాలకొచ్చి విచారించారు.
విద్యార్థులకు కరాటే శిక్షణ ఇప్పించేందుకు 15,000, టెన్త్ విద్యార్థుల స్నాక్స్ కోసం రూ. 9,690, ఆట వస్తువుల కొరకు రూ. 25,000, బడిబాట కార్యక్రమంలో రూ. వెయ్యి, పాఠశాల నిర్వహణ కోసం రూ. 50,000 ఇతర ఖర్చుల నిమిత్తం మొత్తం రూ.1,07,190 మంజూరైనట్లు తెలిపారు. అయితే ఆ నిధులను ఎక్కడా ఖర్చు చేయకుండా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గోవిందు స్వాహా చేశారని పాఠశాల ఎస్ఎం సీ చైర్మన్, కమిటీ సభ్యులు, విద్యార్థులు తల్లిదండ్రులు ఆరోపించారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పాఠశాల గ్రాంట్స్ నుంచి రూ.50,000 వరకు డ్రా చేసినట్లు తెలిసింది. ఆ డబ్బుల నుంచి విద్యార్థులకు స్నాక్స్, కరాటే శిక్షణకు టీచర్, ఆట వస్తువులు వంటి పనులను చేపట్టలేదు. మిగతా డబ్బులకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నాం. వాటి వివరాలు తెలియగానే ఆ నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తాం.
-ఎంఈవో
పాఠశాలకు వచ్చిన గ్రాంట్స్‌ను దుర్వినియోగం చేయలేదు. ఆ మొత్తం తన దగ్గరే ఉన్నాయి. పాఠశాల ప్రారంభం కాగానే పనులను చేపట్టుదామని ఉంచా. తనపై ఆరోపణలు చేయొద్దు. ఆ నిధులను తప్పకుండా పాఠశాల అభివృద్ధికే వినియోగిస్తా.
– గోవిందు పాఠశాల హెడ్మాస్టర్