వికారాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ) : దళిత కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన దళితబంధు పథకంపై ఇంకా సం దిగ్ధం కొనసాగుతూనే ఉన్నది. ఈ పథకంతో పేద దళిత కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకున్నాయి. అయితే కాం గ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితబంధు పథకాన్ని పూర్తిగా రద్దు చేద్దామనే ఆలోచనతో రెండో విడతకు విడుదలైన నిధులను ఇతర పథకాలకు మళ్లించేందుకు యత్నించగా..రెండో విడతకు ఎంపికైన లబ్ధిదారులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు తెలపడంతో వెనక్కి తగ్గి న రేవంత్ ప్రభుత్వం ఇప్పటివరకూ ఈ పథకంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
కాగా, లబ్ధిదారుల నిరసనలతో తలొగ్గిన సర్కార్ యాదాద్రి భువనగిరి జిల్లాలో రెండో విడత దళితబంధు పథకాన్ని అమలు చేయగా.. బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా అవుతుందని స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు నిలిపివేయించడంతో అక్కడితో ఆగిపోయింది. తదనంతరం ఏడాది దాటినా ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ పథకాన్ని అమలు చేస్తే బీఆర్ఎస్ పార్టీకి మైలేజ్ వస్తుందన్న ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఆయా జిల్లాల్లో దళితబంధు రెండో విడతకు విడుదలైన నిధులపై ఇంకా స్టేటస్ కోను అనుసరిస్తుండడంతో.. గత ఏడాదిన్నరగా రూ.60 కోట్ల నిధులు నిరుపయోగంగా ఆయా జిల్లాల బ్యాంకు ఖాతాల్లోనే మూలుగుతున్నాయి. రేవంత్ సర్కార్ రాజకీయ దురుద్దేశంతోనే పేద దళిత కుటుంబాలకు అన్యాయం చేస్తున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇంకా కొనసాగుతున్న సందిగ్ధం…
దళిత కుటుంబాల్లో వెలుగులు నింపిన దళితబంధు పథకంపై నీలినీడలు కమ్ముకున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసి దళిత కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేసిన ఈ పథకం ప్రస్తుతం కొనసాగిస్తుందా..? లేదా అన్నదానిపై ఇంకా సందిగ్ధత కొనసాగుతున్నది. సంబంధిత అధికారులకు రెండో విడత ఎంపికైన లబ్ధిదారులకు ఆర్థిక సాయం చేయొద్దని (స్టేటస్ కో) ప్రభుత్వం ఆదేశించడంతో గతేడాదిన్నరగా మంజూరైన నిధులు అలా గే బ్యాంకు ఖాతాల్లో ఉన్నాయి. కాగా, ప్రభుత్వం స్పం దించి రెండో విడత నిధులను మంజూరు చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
మరోవైపు మొదటి విడతలో ఎంపికైన వారు నచ్చిన వ్యాపారాలు చేసుకునేందుకు ఎలాంటి షరతులు లేకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.10 లక్షలు అందజేయడంతో లబ్ధిదారుల కుటుంబాల్లో వెలుగులు నిండాయి. కాగా, దళితబంధు రెండో విడత ప్రక్రియను షురూ చేసే సమయంలోనే అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రావడంతో లబ్ధిదారుల ఎంపికతోనే ఆగిపోయింది. మొదటి విడతలో జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో 358 మంది లబ్ధిదారులను ఎంపిక చేయగా.. రూ.35.80 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. 358 యూ నిట్లకు అధికారులు గ్రౌండింగ్ చేశారు. వికారాబాద్ సెగ్మెంట్లో 100 మంది, తాండూరులో 100, పరిగిలో 80, కొడంగల్ నియోజకవర్గంలో 60, చేవెళ్ల నియోజకవర్గంలో 18 మందికి యూనిట్లను గ్రౌండింగ్ చేశారు.