జిల్లాలో గత రెండు, మూడు రోజులుగా వాతావరణంలో ఏర్పడిన మార్పుతో పత్తి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నది. ముసురు కురువడం వల్ల చేనుపై ఉన్న పత్తి నల్లబారుతున్నది. మరికొన్ని గ్రామాల్లో మోస్తరు వర్షం కురువడంతో అపార నష్టం సంభవించింది. ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల జిల్లాలోని ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, మాడ్గుల, తలకొండపల్లి, ఆమనగల్లు తదితర ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. తడిసిన పత్తిని కొనుగోలు చేయడానికి సీసీఐ నిరాకరిస్తుండడంతో రెండురోజులుగా పత్తి ట్రాక్టర్లు, లారీలు మిల్లుల వద్దే ఉన్నాయి. దీంతో రైతులు అక్కడే పడిగాపులు కాస్తున్నారు. పల్లెల్లోనూ వ్యాపారులు కొనుగోళ్లను నిలిపివేయడంతో పత్తి రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం స్పందించి తడిసిన పత్తినీ కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.
– రంగారెడ్డి, డిసెంబర్ 4 (నమస్తేతెలంగాణ)
ఒక్క ఇర్వేన్ గ్రామంలో 8వేల ఎకరాల్లో పత్తి సాగు..
మాడ్గుల మండలంలోని ఇర్వేన్ గ్రామం పత్తి సాగుకు ప్రసిద్ధి. గ్రామంలో మొత్తం 8,760ఎకరాలుండగా, 8,405 ఎకరాల్లో పత్తి సాగైంది. కేవలం 360 ఎకరాల్లో వరి, ఇతరత్రా పంటలు సాగు చేశారు. పత్తి పంట ఏరడం మరో రెండుమూడు రోజుల్లో పూర్తవుతుందనుకున్న తరుణంలో ముసురు కురుస్తూ ముంచుతున్నది. తడిసిన పత్తిని కొనుగోలు చేయకపోవడంతో నిల్వ చేసుకుంటున్నారు.
తగ్గిన పత్తి ధర..
జిల్లాలో ఈ ఏడాది 1.40 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. పత్తికి గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలనూ ఏర్పాటు చేసింది. మద్దతు ధర క్వింటాల్‌కు రూ.7,520 ప్రకటించింది. ఈసారి లాభాలు వస్తాయనుకుంటే ముసురు వల్ల పత్తిలో తేమశాతం తగ్గిందని కొనుగోలు చేయడం లేదు. వర్షాలకంటే ముందే గ్రామాల్లో కొందరు రైతులు కేవలం రూ.6200 నుంచి రూ.6300లకే క్వింటాల్ పత్తిని అమ్ముకున్నారు.
సీసీఐ కేంద్రాల్లో తడిసిన పత్తిని కొనుగోలు చేయాలి..
సీసీఐ కేంద్రాలకు తీసుకెళ్లిన పత్తిని వెనక్కి పంపిస్తున్నారు. వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల చేనుపైనే పత్తి తడిసి ముైద్దెంది. ప్రభుత్వం స్పందించి సీసీఐ కేంద్రాల ద్వారా తడిసిన పత్తిని కొనుగోలు చేయాలి.
– పెద్దిరాజు, రైతు, ఇర్విన్