వికారాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఊటీగా పిలువబడే అనంతగిరి హిల్స్‌కు పర్యాటకుల తాకిడి పెరుగుతున్నది. నిత్యం వేల సంఖ్యలో సందర్శకులు వస్తుంటారు. ఇక వీకెండ్లో అయితే హైదరాబాద్ నుంచి వికారాబాద్ వరకు వాహనాలు క్యూ కడుతాయి. అనంతగిరి హిల్స్ అందాలపై రాష్ట్రవ్యాప్తంగా ఆదరణ పెరిగినప్పటికీ పర్యాటకంగా అభివృద్ధి చేయడాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తున్నది.
కనీస వసతులు లేక పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. కొడంగల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి అనంతగిరి హిల్స్‌పై సవతితల్లి ప్రేమను చూపిస్తున్నారని జిల్లావాసులు ఆరోపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎంపిక చేసిన అనంతగిరి ఎకో టూరిజంపై బడ్జెట్లో ప్రస్తావించినప్పటికీ ప్రత్యేకంగా నిధులు కేటాయించకపోవడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం గతంలోనే కొంతమేర నిధులు కేటాయించగా, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులకు సంబంధించి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు.
ఎన్నికల సమయంలో అనంతగిరిని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని హామీనిచ్చి ఇప్పుడు విస్మరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా నుంచి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తుండడంతోపాటు అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్‌కుమార్ సొంత నియోజకవర్గంలోనే అనంతగిరి హిల్స్ ఉన్నప్పటికీ పట్టించుకోకపోవడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
పెండింగ్‌లోనే టెండర్ల ప్రక్రియ..
అనంతగిరి టూరిజం అభివృద్ధికి సంబంధించి ఎల్అండ్టీ సంస్థ రూపొందించిన మాస్టర్ ప్లాన్‌కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతోపాటు డీపీఆర్‌కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇప్పటికీ ఆరు నెలలు గడిచినా టెండర్ల ప్రక్రియపై ఆలోచన చేయడం లేదు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో స్వదేశ్ దర్శన్‌లో భాగంగా జిల్లాలోని అనంతగిరి హిల్స్‌ను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కేంద్రం ఎంపిక చేసింది. అందుకోసం కేంద్రం నిధులు ఇవ్వనుండగా.. ఇన్ఫ్రాస్ట్రక్చర్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాల్సి ఉన్నది.
పార్లమెంట్ ఎన్నికల అనంతరం స్వదేశ్ దర్శన్‌పై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆసక్తి చూపడం లేదు. హామీలను నమ్మి ఓటేసి గెలిపిస్తే స్థానికంగా గెలిచిన ఎంపీతోపాటు ఎమ్మెల్యేలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాల్సింది పోయి అనంతగిరి హిల్స్ అభివృద్ధిపై ప్రస్తావించకపోవడంపై జిల్లావాసులు మండిపడుతున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో అనంతగిరి ఎకో టూరిజాన్ని ప్రస్తావించారే తప్పా నిధులపై స్పష్టతనివ్వలేదు.
213 ఎకరాల్లో ..
అనంతగిరి ఎకో టూరిజానికి సంబంధించి 213 ఎకరాల్లో టూరిజం అభివృద్ధికిగాను తయారు చేసిన డీపీఆర్‌ను అమోదించారు. అనంతగిరి హిల్స్‌లోని టూరిజం అభివృద్ధికి గుర్తించిన 213 ఎకరాల్లో 177 ఎకరాల్లో ఎకో టూరిజంతోపాటు కన్వెన్షన్ సెంటర్, హోటల్, రిసార్టు, కాటేజెస్, ఆంపీ థియేటర్, పర్యాటకులను ఆకర్షించేందుకుగాను అటవీ ప్రాంతంలో ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్, శారీరక దృఢత్వానికి యోగా, ధ్యాన కేంద్రాలు, స్పా, స్విమ్మింగ్ పూల్, వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్‌లను ఏర్పాటు చేయనున్నారు.
అడవిలోని వివిధ రకాల పక్షులను వీక్షించేందుకు వీలుగా వాచ్ టవర్లను నిర్మించడంతోపాటు రోప్ వే ను కూడా నిర్మించేందుకు ప్లానింగ్ చేశారు. మరో 37 ఎకరాల్లో పార్కింగ్ ఏరియాతోపాటు రోడ్లు, మరుగుదొడ్లు, తాగునీటి వసతికి, గ్రీనరీని ఏర్పాటు చేయనున్నారు. అనంతగిరి హిల్స్‌లోని అనంతపద్మనాభ స్వామి ఆలయం చుట్టూ సుందరీకరణతోపాటు పార్కింగ్, లైటింగ్, ఫంక్షన్ హాల్ నిర్మాణం, వాకింగ్ ట్రాక్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.
అనంతగిరితోపాటు కోట్‌పల్లి, సర్పన్‌పల్లి ప్రాజెక్టులను కూడా టూరిజం స్పాట్‌గా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. కోట్‌పల్లి, సర్పన్‌పల్లి ప్రాజెక్టుల్లో కాటేజ్లతోపాటు రెస్టారెంట్లు, బోటింగ్, స్పీడ్ బోట్స్, వాటర్ స్పోర్ట్స్, ఆంపీ థియేటర్, రిసెప్షన్, ఆర్చ్‌లను ఏర్పాటు చేయనున్నారు. అనంతగిరి హిల్స్‌తోపాటు కోట్‌పల్లి, సర్పన్‌పల్లి ప్రాజెక్టుల్లో టూరిజం అభివృద్ధికిగాను కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు రూ.118 కోట్లను ఖర్చు చేసేందుకు ప్రతిపాదించారు.
పర్యాటకులకు ఇబ్బందులు…
వారాంతపు సెలవుల్లో అనంతగిరి పర్యాటకులతో కిటకిటలాడుతున్నది. అనంతగిరిలోని ప్రసిద్ధ పద్మనాభస్వామిని దర్శించుకోవడంతోపాటు అటవీ ప్రాంతంలో ట్రెక్కింగ్ చేసేందుకుగాను అధిక సంఖ్యలో పర్యాటకులు తరలివస్తున్నారు. కెరెళ్లి వెళ్లే దారిలో నంది విగ్రహం, ఎత్తైన అటవీ ప్రాంతంలో నుంచి వచ్చే వాటర్ ఫాల్స్ వద్ద పర్యాటకులు సేద తీరుతున్నారు. ఇతర రాష్ర్టాల నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తుంటారు. కనీస వసతులు లేక పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు.