రంగారెడ్డి, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పోస్టు గత ఆరునెలలుగా ఖాళీగా ఉన్నది. లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన భూపాల్‌రెడ్డి సస్పెన్షన్‌కు గురైన తర్వాత ఆ పోస్టులో ఇప్పటి వరకు ఎవరినీ నియమించలేదు. దీంతో రెవెన్యూ పరమైన సమస్యల పరిష్కారంలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. ఈ సమస్యలపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అదనపు బాధ్యతలు తీసుకున్నారు. భూ సమస్యల్లో అత్యంత కీలకమైన సమస్యలకు సత్వర పరిష్కారం లభించడంలేదు. అలాగే, రెవెన్యూ పరమైన కేసులూ వాయిదా పడుతున్నాయని జిల్లావాసులు వాపోతున్నారు. ప్రస్తుతం ఒకే అదనపు కలెక్టర్ ఉండడం వల్ల లోకల్ బాడీ సమస్యలతో పాటు రెవెన్యూ పరమైన సమస్యలనూ ఆమెనే చూడాల్సి వస్తున్నది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి జిల్లా రెవెన్యూకు సంబంధించిన అదనపు కలెక్టర్‌ను నియమించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
కేసుల పరిష్కారంలోనూ..
జిల్లాలో రెవెన్యూపరమైన సమస్యలు పెద్ద మొత్తంలో ఉన్నాయి. సమస్యలపై జాయింట్ కలెక్టర్ వద్ద ప్రతి శనివారం ఈ కేసులపై విచారణ కొనసాగుతున్నది. రెవెన్యూపరమైన జేసీ లేకపోవడం వల్ల ఈ కేసుల బాధ్యతను లోకల్‌బాడీ చూసే అదనపు కలెక్టర్‌కే కేటాయించారు. ఈ కేసులకు సంబంధించి పూర్తి వివరాలు అదనపు కలెక్టర్ వద్ద లేకపోవడం వల్ల కేసులు వాయిదా పడుతున్నట్లు జిల్లావాసులు వాపోతున్నారు. నూతనంగా వచ్చిన కలెక్టర్ నారాయణరెడ్డి పెండింగ్‌లో ఉన్న రెవెన్యూ సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయా తహసీల్దార్లు, ఆర్డీవోల లాగిన్లలో ఉన్న సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పంపించాలని ఆదేశాలు జారీ చేశారు. తహసీల్దార్లు, ఆర్డీవోల స్థాయిలో ఉన్న సమస్యలను ఇప్పటికే జాయింట్ కలెక్టర్ రెవెన్యూ దృష్టికి పంపించారు. ఆ కేసుల భారం కూడా అదనపు కలెక్టర్ చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.