ఇబ్రహీంపట్నం, ఆగస్టు 6 : ఖాకీల్లో కూడా స్పందించే గుణం ఉన్నదని నిరూపించుకున్నారు… ఇబ్రహీంపట్నం డివిజన్ పరిధిలోని మాడ్గుల పోలీస్ స్టేషన్‌కు చెందిన సిబ్బంది. ఒంటరి మహిళ అర్ధరాత్రి 100 నంబర్‌కు ఫోన్ చేయగా, సమాచారం అందుకున్న మాడ్గుల పోలీసులు వెంటనే స్పందించి ఆపదలో ఉన్న నిండు గర్భిణిని దవాఖానకు తరలించారు. మానవత్వం చాటుకున్న పోలీసులపై ఇబ్రహీంపట్నం డివిజన్వాసుల నుంచి అభినందనలు వెల్లివెత్తుతున్నాయి.
వివరాల ఇలా ఉన్నాయి.. ఇబ్రహీంపట్నం ఏసీపీ పరిధిలోని మాడ్గుల పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి గుర్తుతెలియని ఓ నిండు గర్భిణి తప్పిపోయి వచ్చి మాడ్గుల పోలీస్ స్టేషన్ పరిధిలో పోలెపల్లి వద్ద ఉండి తనకు పురిటి నొప్పులు వస్తున్నట్లు 100 నంబర్‌కు ఫోన్ చేసింది. వెంటనే ఈ విషయాన్ని 100 నంబర్ సిబ్బంది మాడ్గుల పోలీసులకు చేరవేశారు. అప్పటికే డ్యూటీలో ఉన్న పోలీసులు రాజేందర్, సురేశ్‌లు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
వారు మాడ్గుల రైతు వేదిక వద్దకు వెళ్లగా అక్కడ నిండు గర్భిణి ఇద్దరు పిల్లలతో ఉన్నది. ఆమెకు తెలుగు రాకపోవడంతో ఏమి అడిగినా సమాధానం చెప్పలేదు. దీంతో పోలీసులు అక్కడకు వెళ్లి ఆమెను విచారించగా ఆమె పేరు కమీభాయ్ మహారాష్ట్రలోని చించోలి తాలూకాకు చెందిన వాసిగా తెలిపింది. వారం రోజుల క్రితం ఇంటి నుంచి వచ్చానని తన భర్త పేరు గరీష్ అని తెలిపింది. అలాగే, భర్త ఫోన్ నంబర్ చెప్పగా ఆ నంబర్‌కు పోలీసులు ఫోన్ చేయడంతో తమ గ్రామానికి చెందిన వ్యక్తే అని చెప్పారు. జూలై 29న ఈ మహిళా తప్పిపోయినట్లు చించోలీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
ఈ విషయం ఆధారంగా ఆమె తమ్ముడు హైదరాబాద్‌లో ఉన్నట్లు తెలుసుకుని పోలీసులు అతడికి ఫోన్ చేశారు. మహిళకు అప్పటికే పురిటి నొప్పులు వస్తుండడంతో చుట్టుపక్కల ఉన్న మహిళలను తోడుగా ఉండమని పోలీసులు కోరారు. దీంతో మహిళల సాయంతో పురుడు పోయించారు. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారు. విషయం తెలుసుకున్న సీఐ నర్సింహారావు దవాఖానకు వెళ్లి మహిళ ఆరోగ్య సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. ఇబ్రహీంపట్నం ఏసీపీ కేవీపీ రాజు మాడ్గుల పోలీసులను అభినందించారు.