వికారాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : తుది విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి బుధవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరుగనున్నది. మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తైన వెంటనే ఉపసర్పంచ్ ఎన్నిక కూడా జరుగుతుంది. జిల్లా ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పరిగి నియోజకవర్గంలోని అన్ని గ్రామపంచాయతీలకు బ్యాలెట్ బాక్సులతోపాటు సరిపోను బ్యాలెట్ పేపర్లను సమకూర్చారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది మంగళవారం సాయంత్రమే ఆయా గ్రామపంచాయతీల్లోని పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద భారీ పోలీస్ బందోబస్తుతో భద్రతను కట్టుదిట్టం చేశారు.
తుది విడతలో పరిగి, పూడూరు, కులకచర్ల, దోమ, చౌడాపూర్ మండలాల్లో 157 గ్రామపంచాయతీలు, 1340 వార్డులుండగా.. 18 గ్రామపంచాయతీలు, 306 వార్డుల్లో ఎన్నిక ఏకగ్రీవం కాగా, 139 గ్రామపంచాయతీలు, 1034 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. 400 మంది సర్పంచ్, 2588 మంది వార్డు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 1,67,114 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో పురుషులు 83,208., మహిళలు 83,899., ఇతరులు ఏడుగురు ఉన్నారు. 1470 మంది ప్రిసైడింగ్ అధికారులు, 1726 మంది ఓపీవోలు, ఇద్దరు సభ్యులతో కూడిన బృందాలు 988, ముగ్గురితో కూడిన 214 బృందాలు., ఇతర పోలింగ్ సిబ్బంది విధుల్లో పాల్గొననున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద 800 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.
షాబాద్, డిసెంబర్ 16 : రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా మూడో విడతకు సంబంధించి ఇబ్రహీంపట్నం, కందుకూరు రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 174 సర్పంచ్ స్థానాలకు.. 10 గ్రామపంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఒక గ్రామ పంచాయతీకి సంబంధించి కోర్టులో కేసు ఉండటంతో 11 గ్రామపంచాయతీలను మినహాయించి, మిగిలిన 163 జీపీల్లో ఎన్నికలు నిర్వహణకు అధికారులు చర్యలు చేపట్టారు. సర్పంచ్ స్థానాలకు 559 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 1598 వార్డు స్థానాలకు.. 142 వార్డులు ఏకగ్రీవం కాగా.. మిగిలిన 1448 వార్డులకు ఎన్నికలు జరగనుండగా, 4091 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. పోలింగ్ సిబ్బందికి సామగ్రి పంపిణీ చేయడంతో ఆయా గ్రామాల పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు.
జిల్లాలో పలు మండలాల్లో జరిగే ఎన్నికల కోసం 1969 మంది పీవోలు, 2809 మంది ఓపీవోలను ప్రభుత్వం నియమించింది. జోనల్ అధికారులు 55, ఏఫ్ఎస్టీలు 21, ఎస్ఎస్టీలు 21, ఆర్వో ఫేస్-2, స్టేజ్-2 కలిపి 193, మండల స్థాయి పర్యవేక్షణ అధికారులు 21, ఎంసీసీ బృందం 22, వ్యయ బృందాలు(ఏఈవోలు)21 మందిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎన్నికల్లో ఎలాంటి ఘర్షణలు జరుగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.