నిన్న మొన్నటి వరకు గ్రామపంచాయతీ ఎన్నికలతో సందడిగా ఉంది. ఈ ఎన్నికల సందడి ముగిసి పంచాయతీల్లో సర్పంచ్‌లు పదవీ బాధ్యతలు తీసుకున్న వెంటనే మరో ఎన్నికల సంగ్రామం నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో జిల్లాలో మున్సిపల్ ఎన్నికల సందడి ప్రారంభమైంది. మున్సిపల్ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం తెరలేపడంతో ఒక్కసారిగా పట్టణాల్లో ఎన్నికల సందడి నెలకొన్నది. గత నెలలో పంచాయతీ ఎన్నికలతో వేడెక్కిన గ్రామాలు.. శీతాకాలం, సంక్రాంతి పండుగవేళ పట్టణాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఎన్నికల సంఘం ఆదేశాలతో గత వారం రోజులుగా అధికారులు ఎన్నికల నిర్వహణలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఆశావహులు హుషారుతో ఉన్నారు.
ఇప్పటికే పోలింగ్ కేంద్రాల గుర్తింపు, వార్డులవారీగా ఓటర్ల ముసాయిదా జాబితా తయారు వంటి పనుల్లో అధికార యంత్రాంగం ముందుకు సాగుతున్నది. దీంతో ప్రధాన పార్టీలకు చెందిన ఆశావహులు మున్సిపల్ కార్యాలయంలో వార్డులవారీగా ఓటర్ల జాబితాల రూపకల్పన, మార్పులతో పాటు వార్డుల రిజర్వేషన్లపై ఆరా తీస్తున్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశతో ఉన్న గెలుపు గుర్రాలను తమవైపు తిప్పుకొనేందుకు ప్రధాన పార్టీల నాయకులు వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే గెలుపు గుర్రాలతో ఆయా పార్టీల ప్రధాన నాయకులు టూర్లల్లో బిజీబిజీగా గడుపుతున్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. రంగారెడ్డి జిల్లాలోని ప్రధాన మున్సిపాలిటీలను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నగరపాలక సంస్థలో విలీనం చేయగా.. ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, షాద్‌నగర్, చేవెళ్ల, మొయినాబాద్ మున్సిపాలిటీలు మాత్రమే మిగిలాయి. ఈ మున్సిపాలిటీలను ఎలాగైనా కైవసం చేసుకోవాలని ప్రధాన పార్టీల నాయకులు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు.
– ఇబ్రహీంపట్నం, జనవరి 4
జిల్లాలోని ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, మొయినాబాద్, షాద్‌నగర్, చేవెళ్ల, మున్సిపాలిటీల్లో వార్డులవారీగా ప్రధాన పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. జాబితాలో మార్పులు, చేర్పులపై అధికారులు కసరత్తు చేస్తూ ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నం కాగా, వార్డులవారీగా గెలుపు గుర్రాల ఎంపిక, వర్గాలవారీగా ఓటర్లను ఆకర్షించేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఆయా పార్టీల నాయకులు తలమునకలవుతున్నారు. ఏ వార్డులో ఎవరి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయాలనే దానిపై రెండు, మూడు పేర్లతో అంచనాకు వచ్చి పరిస్థితిని తమకు అనుకూలంగా మలుచుకునే దిశగా పావులు కదుపుతున్నారు. ముఖ్యంగా ఈ మున్సిపాలిటీల పరిధిలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుంచి పోటీలో దిగేందుకు పెద్దఎత్తున యువత ముందుకొస్తుండటం విశేషం.
పార్టీలు మారటానికి సిద్ధమవుతున్న ఆశావహులు
ఈసారి మున్సిపల్ ఎన్నికలను బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఎవరికి వారే అధికార పీఠం దక్కించుకోవాలని చూస్తున్నారు. గతంలో టికెట్ రానివారు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం పార్టీల్లో కొనసాగుతున్న వారికి కౌన్సిలర్‌గా పోటీ చేసేందుకు టికెట్ దక్కకుంటే పార్టీ ఫిరాయించడానికి ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నారు. అభ్యర్థులు బలహీనంగా ఉన్న వార్డులను గుర్తించి, వారి స్థానంలో ప్రత్యర్థి పార్టీలోని వారికి టికెట్లు కట్టబెట్టేందుకు వ్యూహాలు పన్నుతున్నారు. ఇప్పటికే ఆ దిశగా కొన్ని వార్డుల్లో మంతనాలు చేశారు. ఇటీవల జిల్లావ్యాప్తంగా మూడు విడతల్లో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధిక సీట్లు దక్కించుకుంది. అదే హుషారుతో మున్సిపల్ ఎన్నికల్లో కూడా అధిక స్థానాలు గెలిపించుకోవడంతోపాటు చైర్మన్ పదవులను దక్కించుకోవాలనే సంకల్పంతో ఇప్పటికే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి కార్యకర్తలు, నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు.
మెజార్టీ స్థానాల గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ ముందుకు..
మున్సిపాలిటీల్లో అధిక కౌన్సిలర్ స్థానాలు గెలుపొందడంతోపాటు చైర్మన్ పదవులను కూడా కైవసం చేసుకునే దిశగా బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తున్నది. మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డితో పాటు యువ నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి, పలువురు ముఖ్య నేతలు కిందిస్థాయి క్యాడర్‌ను సమాయత్తం చేస్తూ ముందుకు సాగుతున్నారు. కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని, ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని యోచిస్తున్నారు.
పెరగనున్న యువ ఓటర్లు
గత రెండేళ్లుగా మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ప్రక్రియ ఆలస్యం అవుతూ వచ్చింది. చాలామంది కొత్త ఓటర్లు నమోదు చేసుకోవడంతో వారందరికీ ఓటు హక్కు కల్పించారు. దీంతో యువ ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాజకీయ పార్టీలు సైతం తమ గెలుపునకు బాటలు వేసేందుకు తమకు అనుకూలంగా ఉండేవారిని గుర్తిస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన స్థానికుల వివరాలు తెలుసుకుని వారిని ఓటర్లుగా నమోదు చేశారు. తాజాగా పెరిగిన ఓటర్లను వారికి సంబంధించిన వార్డులు, పోలింగ్ కేంద్రాలవారీగా గుర్తించే పనిలో పడ్డారు.