పరిగి, నవంబర్ 27: కొత్తగా ఏర్పడిన గ్రామపంచాయతీ అయిదేళ్లలోనే రాష్ట్ర స్థాయిలో ఉత్తమ జీపీగా ఎదిగింది. సర్పంచ్ల పదవీకాలం ముగిసిన తర్వాత ప్రత్యేకాధికారుల పాలన, ప్రజాపాలనలో నిర్వహణ కరువై పలు వ్యవస్థలు అధ్వానంగా మారాయి. పాలకుల వల్లే అధికారులు సైతం సరైన పర్యవేక్షణ చేయకపోవడంతో పంచాయతీలో పారిశుధ్యం పడకేసింది. వివరాల్లోకి వెళితే.. పరిగి మండల పరిధిలోని రాఘవాపూర్ 2018లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొత్త పంచాయతీగా ఏర్పడింది. 750 మంది జనాభా గల ఈ ఊర్లో 600 పైచిలుకు ఓటర్లు ఉన్నారు.
రాఘవాపూర్ సర్పంచ్‌గా ఎన్నికైన యువకుడు నల్క జగన్, పాలకవర్గం గ్రామాభివృద్ధికి అంకితభావంతో పనిచేయడం, అప్పటి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో గ్రామం అభివృద్ధి చెందింది. సీసీ రోడ్లు, మురికికాలువల నిర్మాణం, స్టేజీ నుంచిగా గ్రామం వరకు వెడల్పుగా సీసీ రోడ్డు వేసి మధ్యలో డివైడర్, అందులో మొక్కలు నాటారు. పల్లె ప్రకృతివనం, ప్రతిరోజూ పారిశుధ్య పనులు చేయించడం, శుభ్రమైన పరిసరాలు, రోజూ ఇంటింటి నుంచి చెత్త సేకరణ తదితర పనుల నిర్వహణకు 2022-23 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ పంచాయతీగా ఎంపికైంది. ఇదంతా గతం.
ప్రజాపాలనలో గాలికొదిలేసిన నిర్వహణ..
గత పాలకవర్గం హయాంలో చేపట్టిన అభివృద్ధి పనుల నిర్వహణను గాలికి వదిలేయడంతో ప్రజాపాలనలో రాఘవాపూర్ గ్రామం అనేక సమస్యలతో సతమతమవుతున్నది. ప్రధానంగా పల్లె ప్రకృతివనం ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండేది. నేటి పాలనలో పల్లె ప్రకృతి వనం పూర్తిగా నిర్లక్ష్యానికి గురై చెత్తా చెదారంతో నిండిపోయింది. ఇంటింటి నుంచి చెత్త సేకరణ రెండు రోజులకోసారి దీంతో చెత్తను రోడ్ల పక్కన పారబోయడం కొనసాగుతుంది.
మురికికాలువల్లో పేరుకుపోయిన సిల్ట్‌ను తొలగించకపోవడంతో కంపు కొడుతున్నాయి. మురికికాలువ చివరన గతంలో సామూహిక ఇంకుడుగుంత నిర్మాణం చేపట్టగా ప్రసుతం అక్కడ మురికినీరు నిలిచి దుర్గంధం వెదజల్లుతున్నది. గతంలో విశాలమైన సీసీ రోడ్డు వేయించి డివైడర్ ఏర్పాటుచేసి, మధ్యలో మొక్కలు నాటితే ప్రజాపాలనలో వాటిని పట్టించుకునేవారు లేక మొక్కలు ఎండిపోయాయి. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు సరైన నిర్వహణ లేక ఎండిపోయాయి. అన్నీ వెరసి రాఘవాపూర్ గతమెంతో ఘనకీర్తి, నేడు అధోగతి అనే విధంగా తయారైందని గ్రామస్తులు వాపోతున్నారు.
కనీస నిర్వహణ లేదు..
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొత్తగా ఏర్పడిన రాఘవాపూర్ గ్రామపంచాయతీని అభివృద్ధిలో అగ్రగామిగా నిలపడంతోపాటు పచ్చదనం, పరిశుభ్రతలో ఆదర్శంగా చేసి రాష్ట్ర స్థాయి అవార్డును సాధించాం. నేడు గ్రామంలో ఉన్న అభివృద్ధి పనులు, పల్లె ప్రకృతివనం, గ్రామంలోని రోడ్లు శుభ్రంగా ఉంచడంలో సైతం విఫలమయ్యారు. అభివృద్ధి పనుల నిర్వహణలోపం వల్ల ఎక్కడ చూసినా చెత్తాచెదారం దర్శనమిస్తున్నది. పల్లె ప్రకృతివనం నిర్వహణ కరువైంది. చెత్త సేకరణ గాడి తప్పింది.
– నల్క జగన్, మాజీ సర్పంచ్, రాఘవాపూర్