కొడంగల్, జూలై 6 : రైతుభరోసా కోసం ఎదురు చూస్తున్న రైతులకు అధికారుల నిర్లక్ష్యం శాపంగా మారింది. క్షేత్రస్థాయిలో వ్యవసాయాధికారులు ఎటువంటి పర్యవేక్షణ చేయకుండానే ఇష్టానుసారంగా కార్యాలయంలో కూర్చొనే రైతుభరోసాకు రైతులను ఎంపిక చేస్తున్నారని.. తద్వారా తాము పెట్టుబడి సాయాన్ని పొందలేకపోతున్నామని పలువురు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం ఇలాకాలోనే అధికారుల నిర్లక్ష్యంతో పలువురు అన్నదా తలు రైతుభరోసా పొందకపోవడం చాలా దారుణమని పేర్కొంటున్నారు.
వేయి ఎకరాలకు రాని రైతుభరోసా
మండలంలోని అంగడిరైచూర్ గ్రామంలోని 130 మంది రైతులకు సంబంధించిన 160 ఎకరాలు, మున్సిపల్ పరిధిలో 441 మంది రైతులకు చెందిన 750 ఎకరాలు, పర్సాపూర్‌లో ఆరుగురికి, రావులపల్లిలో 76 మందికి, రుద్రారంలో 21 మందికి, టేకల్‌కోడ్‌లో ఏడుగురి బ్యాంకు ఖాతాల్లో రైతుభరోసా పెట్టుబడి సాయం జమ కాలేదు.
ఈ విషయమై సంబంధిత ఏఈవోను వివరణ కోరగా.. కొడంగల్ మండలంలోని 5000 ఎకరాలకు సంబంధించిన భూము ల మ్యాపుల్లేవని, కంప్యూటర్లో రైతుల భూవివరాలు నమోదు కాకపోవడంతో అందులో గుర్తుకున్న రైతుల పేర్లను మాత్రమే నమోదు చేసినట్లు చెప్పారు.
ఏడీఏ శంకర్రాథోడ్ను వివరణ కోరగా.. పెట్టుబడి సాయం అందని రైతుల పొలా లు బీడు భూములుగా కంప్యూటర్లో నమోదై ఉన్నట్లు పేర్కొన్నారు.
సిబ్బంది పొరపాటే..
చాలామంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతుభరోసా పెట్టుబడి సాయం జమ కాలేకపోవడం వాస్తవమే. కొంతమంది అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ తప్పిదం జరిగింది. మరోసారి ఇటువంటి పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకొంటా.
– మోహన్‌రెడ్డి, జిల్లా వ్యసాయాధికారి, వికారాబాద్