కొత్తూరు, డిసెంబర్ 30 : కొత్తగా ఏర్పడిన కొత్తూరు మున్సిపాలిటీకి మహర్దశ పట్టనున్నది. నిధుల వరదతో మున్సిపాలిటీ రూపురేఖలు మారనున్నాయి. అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతుండగా, మరికొన్ని పనులకు నిధులు మంజూరయ్యాయి. సీఎం కేసీఆర్ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని, మంత్రి కేటీఆర్ తీసుకుంటున్న చర్యలు, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ పట్టుదల, మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య, మున్సిపల్ పాలక వర్గం పడుతున్న శ్రమే అద్భుత ఫలితాలను ఇవ్వనున్నది.
రూ. 66.5 కోట్లతో అభివృద్ధి పనులు
కొత్తూరు మున్సిపాలిటీలో 66.5 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు జరుగనున్నాయి. కొన్ని పనులు తుది దశకు చేరుకోగా, మరికొన్ని వేగంగా జరుగుతున్నాయి.
3.5 కోట్లతో మున్సిపల్ బిల్డింగ్
ఇప్పుడున్న మున్సిపల్ కార్యాలయం ఇరుగ్గా ఉండగా, 3.5 కోట్లతో కొత్తగా మున్సిపాలిటీ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు. సకల హంగులతో ఈ భవన నిర్మాణం శరవేగంగా జరుగుతున్నది. త్వరలో దీని నిర్మాణం పూర్తికానున్నది.
రూ. 2 కోట్లతో వెజ్, నాన్‌వెజ్ మార్కెట్
కొత్తూరు మున్సిపాటీలో ఇరుకైన రోడ్లతో కూడుకొని ఉండడంతో రోడ్లపైనే కూరగాయల వ్యాపారం కొనసాగడంతో దీనివల్ల వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఉమ్మడి వెజ్, నాన్‌వెజ్ మార్కెట్ భవన నిర్మాణం అవసరమని మున్సిపల్ పాలకవర్గం భావించింది. దీంతో రూ.2 కోట్లతో సకలహంగులతో వెజ్, నాన్‌వెజ్ మార్కెట్ రూపుదిద్దుకొంటున్నది.
రూ.18కోట్లతో ప్రధాన రహదారి
కొత్తూరు వై జంక్షన్ నుంచి దర్గా రోడ్డు వరకు 100 ఫీట్ల ప్రధాన రహదారిని నిర్మించనున్నారు. ప్రభుత్వం రూ.18 కోట్లను మంజూరు చేసింది. కొత్తూరు పారిశ్రామిక ప్రాంతం కావడం వల్ల భారీ వాహనాలు రోడ్లపై ప్రయాణించేలా 18 కోట్లతో నాణ్యమైన 100 ఫీట్ల రోడ్లను నూతనంగా నిర్మించనున్నారు.
రూ. 32కోట్లతో కుమ్మరిగూడ రోడ్డు
మున్సిపాలిటీ పరిధిలోని కుమ్మరిగూడ నుంచి కొత్తూరుకు వచ్చే రోడ్డు గుంతలమయంగా ఉండటమే కాకుండా ఇరుగ్గా ఉంది. దీనివల్ల కుమ్మరిగూరిగూడ నుంచి కొత్తూరు రావడానికి ప్రజలు తీవ్ర ఇబ్బందుల పడుతున్నారు. దీంతో హెచ్ఆర్డీసీఎల్ నిధుల నుంచి రూ.32కోట్లతో 100 ఫీట్ల రోడ్డును కుమ్మరిగూడ నుంచి కొత్తూరు వరకు నూతనంగా నిర్మించనున్నారు.
అంతర్గత రోడ్లకు రూ.10కోట్లు
మున్సిపాలిటీలోని అంతర్గత రోడ్డు నిర్మాణానికి హెచ్ఎండీఏ నిధుల నుంచి రూ.10కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో మున్సిపాలిటీ పరిధిలోని కొత్తూరు, కుమ్మరిగూడ, తిమ్మాపూర్, స్టేషన్ తిమ్మాపూర్, ఫాతిమాపూర్ల్లో అన్ని రోడ్లు సీసీలుగా మారనున్నాయి.
రూ. కోటితో వైకుంఠధామం
మున్సిపాలిటీ అవసరాలకు సరిపోను వైకుంఠధామం నిర్మించేందుకు ప్రభుత్వం రూ. కోటి రూపాయలను మంజూరు చేసింది. ఇప్పటికే ఉన్న వైకుంఠధామాన్ని మరింత విస్తరించి సకల వసతులను కల్పించనున్నారు.
ఎన్ని నిధులైనా ఇచ్చేందుకు సిద్ధం
ఇతర మున్సిపాలిటీలకు ఆదర్శంగా నిలిచేలా కొత్తూరును అభివృద్ధి పథంలో పయనించేలా చేస్తాం. సీఎం కేసీఆర్, మున్సిపల్ మంత్రి కేటీఆర్ సహకారంతో నిధులు వస్తున్నాయి. నేటి ప్రజల అవసరాలను గుర్తుంచి నిధులు విడుదల చేస్తున్నారు. దీంతో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కొత్తూరు మున్సిపాలిటీ అభివృద్ధికి ఎన్ని నిధులైనా ఇచ్చేందుకు సిద్ధం.
– అంజయ్యయాదవ్, ఎమ్మెల్యే, షాద్‌నగర్
ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ సహకారంతో..
ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ సహకారంతో కొత్తగా ఏర్పడిన కొత్తూరు మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నాం. అన్ని వసతులు కల్పించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తాం. ముఖ్యంగా అంతర్గత, ప్రధాన రహదారుల నిర్మాణానికి పెద్దపీట వేస్తున్నాం. కొత్తూరును ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం.
– బాతుక లావణ్యాదేవేందర్యాదవ్, మున్సిపల్ చైర్పర్సన్, కొత్తూరు
మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట
కొత్తూరు మున్సిపాలిటీలో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నాం. ప్రజలకు ప్రతినిత్యం ప్రజలకు అవసరమైన అన్ని వసతులను కల్పిస్తున్నాం. వెజ్, నాన్‌వెజ్ మార్కెట్, వైకుంఠధామం, అంతర్గత రోడ్ల నిర్మాణం, మున్సిపాలిటీకి నూతన భవన నిర్మాణాలను చేపట్టి అభివృద్ధిలో మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం.
– కొస్గి శ్రీనివాసులు, మూడో వార్డు కౌన్సిలర్, కొత్తూరు