ఔటర్ రింగు రోడ్డు (oRR) 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేసే ప్రక్రియను పురపాలక శాఖ వేగవంతం చేసింది. త్వరలో శివారు ప్రాంతాలు అధికారికంగా జీహెచ్ఎంసీలో విలీనం కానున్నాయి. విలీనం అయిన వెంటనే ప్రస్తుత కమిషనర్‌ను కొనసాగిస్తూనే జీహెచ్ఎంసీకి ముఖ్య కార్యదర్శి హోదా ఉన్న సీనియర్ అధికారిని చీఫ్ కమిషనర్‌గా నియమించే అవకాశాలు ఉన్నాయని చర్చ జరుగుతున్నది. జీహెచ్ఎంసీ ప్రస్తుత విస్తీర్ణం 625 చదరపు కిలోమీటర్ల నుంచి ఏకంగా 2,735 చదరపు కిలోమీటర్లకు పైగా పెరగనున్న నేపథ్యంలో విలీన మున్సిపాలిటీల జనాభా, ఆస్తులు, ఉద్యోగులు, పాలన స్వరూపంపై అధ్యయనం చేస్తున్నారు. గడిచిన నాలుగు రోజులుగా సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్, పారిశుధ్య విభాగం అధికారులతో వరుస సమీక్షలు జరుగుతున్నాయి. అయితే విలీనం సందర్భంగా కొన్ని మున్సిపాలిటీల్లో పెండింగ్ ఫైళ్లు చకచకా కదులుతున్నాయి.
సిటీబ్యూరో, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ) ; జీహెచ్ఎంసీలో అక్రమ నిర్మాణాలకు ఓసీలు, అక్రమంగా అనుమతుల మంజూరుతోపాటు వివిధ కారణాలతో పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను క్లియరెన్స్ చేసే పనిలో మున్పిపాలిటీల అధికారులు పోటీ పడుతున్నట్లు తెలుస్తున్నది. జీహెచ్ఎంసీలో ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీలను విలీనం చేయాలని గత నెల 25న జరిగిన కేబినెట్ సమావేశంలో ఆమోదించడం..వెంటనే జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలోనూ ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లోని పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లల్లో పెండింగ్ ఫైళ్లకు రెక్కలొచ్చాయి. విలీన ప్రక్రియ పూర్తయితే మున్సిపల్ అధికారుల పవర్‌కు కోత పడే అవకాశమున్నది. విలీనం తర్వాత నిర్మాణాల అనుమతులు ఎన్వోసీల జారీ వంటి ప్రక్రియ జీహెచ్ఎంసీ పరిధిలోనే జరుగుతాయి. దీంతో అనేక మంది అక్రమ నిర్మాణదారులు, నకిలీ ఎన్వోసీలు ఇప్పుడే తీసుకునేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నట్లు మున్సిపాలిటీ ఉద్యోగుల్లో జోరుగా చర్చ జరుగుతున్నది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఉద్దేశంతో కొందరు అధికారులూ డబ్బులు తీసుకుని అడ్డగోలుగా పెండింగ్ ఫైళ్లను క్లియర్ చేసేందుకు యత్నిస్తున్నట్లు సమాచారం.
పెద్ద ఎత్తున ఎన్వోసీలు జారీ..
విలీనం కానున్న మున్సిపాలిటీలతోపాటు నగరపాలక సంస్థలో వివిధ అనుమతుల కోసం పలువురు దరఖాస్తు చేసుకున్నారు. ముఖ్యంగా చెరువులు, కుంటల పరిసరాల్లో భవన నిర్మాణాలు, విల్లాలు అపార్ట్మెంట్ల నిర్మాణానికి ఎన్వోసీల అవసరం తప్పనిసరి. ఇరిగేషన్ అధికారులతో క్లియరెన్స్ తీసుకుని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లల్లో ఎన్వోసీలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లల్లో ఎన్వోసీలు కూడా పెద్ద ఎత్తున పెండింగ్‌లో ఉన్నాయి. పెండింగ్‌లో ఉన్న ఎన్వోసీలను వెంటనే క్లియర్ చేయించుకునే పనిలో ఉన్నారు. ముఖ్యంగా శివారు మున్సిపాలిటీల్లో చెరువులు, కుంటలు, వాగులు పెద్ద ఎత్తున ఆక్రమించుకుని నిర్మాణాలు చేపడుతున్నారు. అలాగే, ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోనూ చెరువులు, కుంటల్లో నిర్మాణాల కోసం పెట్టుకున్న పెద్ద ఎత్తున దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటన్నింటినీ అధికారులు త్వరగా క్లియర్ చేస్తున్నట్లు తెలుస్తున్నది. టౌన్‌ప్లానింగ్ అధికారులు కూడా అక్రమ నిర్మాణాలకు అనుమతులిచ్చే పనిలో బిజీబిజీగా ఉన్నట్లు.. గడిచిన ఐదు రోజుల వ్యవధిలో జారీ చేసిన ఎన్వోసీలు, అనుమతులపై ప్రభుత్వం విచారణ జరిపాలన్న డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఇంటి అనుమతులకు సంబంధించిన ఫైళ్లు వేగంగా కదులుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా ప్రభుత్వ భూముల్లో నిర్మించిన అక్రమ నిర్మాణాలకు ఇంటి నంబర్లు ఇచ్చేలా సిద్ధమవుతున్నట్లు ప్రచారం సాగుతున్నది. ప్రస్తుతం జీహెచ్ఎంసీలో పరిధిలో విలీన పక్రియ పూర్తయ్యే వరకు అనేక అక్రమాలకు అవకాశం ఉన్న క్రమంలో ఉన్నతాధికారులు దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.