ప్రభుత్వ విజయ డెయిరీలో పాలు పోస్తున్నా.. సకాలంలో బిల్లులు రాక జిల్లా రైతులు అప్పుల పాలవుతున్నారు. వ్యవసాయ రంగం ఆగమైనా.. పాడి పరిశ్రమ ఆదుకుంటుందన్న నమ్మకంతో ఆ రంగాన్ని ఎంచుకున్న రైతులకు ఆగస్టు 15 నుంచి నిలిచిన బిల్లులతో నిర్వహణ కష్టతరంగా మారింది. బిల్లులు చెల్లించాలంటూ రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నా కాంగ్రెస్ సర్కారు పట్టించుకోకపోవడంతో అన్నదాతలు మండిపడుతున్నారు.
-రంగారెడ్డి, సెప్టెంబర్ 24(నమస్తే తెలంగాణ)
జిల్లాలో రూ.14 కోట్లకు పైగా బకాయిలు..
కాంగ్రెస్ పాలనలో పాడి రైతులు పరేషాన్ అవుతున్నారు. పదిహేను రోజులకు ఒకసారి ఇవ్వాల్సిన పాల బిల్లులను సక్రమంగా చెల్లించడం లేదు. నెలల తరబడిగా చెల్లించకపోవడంతో బకాయిలు పేరుకుపోతున్నాయి. జిల్లాలో 350 వరకు పాల సేకరణ కేంద్రాలున్నాయి. ఆరు వేల మంది పాడి రైతులు ప్రతిరోజూ లక్షా 10 వేల లీటర్ల ఆవు పాలను విజయ డెయిరీ కేంద్రాలకు సరఫరా చేస్తున్నారు. పాల నాణ్యతను బట్టి లీటరుకు కనిష్ఠంగా రూ.40, గరిష్ఠంగా రూ.44 వరకు చెల్లిస్తున్నారు. అయితే ఆగస్టు 15 నుంచి బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. దీంతో రూ. 14 కోట్లకు పైగా విజయ డెయిరీ బాకీ పడింది.
ఒక్కో రైతుకూ రూ.20 వేల నుంచి రూ.50వేల వరకు పాల బిల్లులను చెల్లించాల్సి ఉన్నది. ఫలితంగా పాడినే నమ్ముకుని జీవిస్తున్న రైతు కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. బిల్లులు చెల్లించాలంటూ రైతులు రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నా బిల్లులను విడుదల చేయకపోవడంతో రైతులు మండిపడుతున్నారు. పాల కొనుగోళ్లకు తగ్గట్టుగా విక్రయాలు లేకపోవడం..అధిక ధర చెల్లించి పాలను కొనకపోవడంతోనే బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరుగుతున్నదని అధికారులు చెబుతున్నారు.
పశు పోషణకు ఇబ్బందులు..
రైతులకు పశు పోషణ కష్టతరంగా మారింది. మంచి పాల దిగుబడి కోసం జెర్సీ ఆవులను రైతులు ప్రైవేట్‌గా అప్పులు తెచ్చి కొనుగోలు చేస్తున్నారు. పాలను అమ్మ గా వచ్చే ఆదాయంలో సగం పశువుల పోషణకే సరిపోతున్నది. పల్లి చెక్క, మక్క పిండి, తవుడు తదితర వాటిని అందించడంతోపాటు పశువుల చికిత్సకు పెద్ద మొ త్తంలో రైతులకు ఖర్చు అవుతున్నది. ఓ పక్క జెర్సీ ఆవుల మెయింటెనెన్స్ అధికం గా ఉండడం..మరోవైపు తెచ్చిన అప్పులకు వడ్డీలు చెల్లించడం రైతులకు తలకు మించిన భారంగా మారుతున్నది. దీనికితోడు సకాలంలో పాల బిల్లులు రాకపోవడంతో రైతులు ఆర్థికంగా చితికిపోతున్నారు. ఇప్పటికైనా పెండింగ్ బకాయిలను చెల్లించి ఆదుకోవాలని జిల్లాలోని పాడి రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
మార్పు అంటే ఇదేనా..
కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే పాలనలో మార్పు వస్తదన్నరు. మార్పు అంటే మా బతుకులను ఆగం చేయడమేనా ?.. కేసీఆర్ హయాంలో సంతోషంగా ఉన్నాం. కాంగ్రెస్ వచ్చిన నాటి నుంచి పాల బిల్లులు ఎనుకాముందు అన్నట్లుగా ఎప్పుడిస్తరో తెలుస్తలేదు. 15 రోజులకు ఒకసారి ఇవ్వాల్సిన బిల్లులు.. రెండు నెలలు దాటినా ఇవ్వకపోవడంతో ఆర్థికంగా నలిగిపోతున్నాం. ప్రభుత్వం మీద నమ్మకం పోయి ప్రైవేటు డెయిరీలో పాలు పోస్తున్నా.
-శేఖర్, పాడిరైతు, విఠ్యాల గ్రామం, ఫరూఖ్‌నగర్ మండలం
ఎలా బతకాలి..
నేను పాడి రైతును. నాకు ఇదే జీవనాధారం. నెలల తరబడి బిల్లులు ఆపితే ఎలా బతకాలి. పశుపోషణతో పాటు కుటుంబం గడువడానికి అప్పులు చేస్తున్నా. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పాల బిల్లు 15 రోజులు కాగానే వచ్చేది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నెలలు గడుస్తున్నా బిల్లు రావడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి.
– వెంకట్‌నాయక్, పాడిరైతు, విఠ్యాల గ్రామం, ఫరూఖ్‌నగర్ మండలం
పాడి రైతులపై ప్రభుత్వం పగ పట్టినట్లు ఉన్నది..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పాల బిల్లులు ఏనాడూ సరైన సమయానికి రాలేదు. ప్రతి రోజూ 15 నుంచి 20 లీటర్ల పాటు విజయ డెయిరీకి పోస్తున్నా. రెండు నెలల నుంచి ఒక్క రూపాయి కూడా రాలే. పశువులకు దాణా, పశువుల వైద్య ఖర్చులు ఎక్కడి నుంచి తీసుకురావాలి, పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నా.. నా పరిస్థితి ఏమిటో ప్రభుత్వమే చెప్పాలి. ప్రస్తుతం లీటరు పాలకు రూ.39 నుంచి రూ.41 వరకు ప్రభుత్వం ఇస్తూ వస్తున్నది. పాల ధరను తగ్గించాలని కాంగ్రెస్ సర్కార్ చూస్తున్నది. ఇలా ఇబ్బందులు పెడితే రైతుల ఆగ్రహానికి రాష్ట్ర ప్రభుత్వం గురికాక తప్పదు.
– గంగిశెట్టి మల్లేశ్, పాడి రైతు, పిట్టలగూడ, నందిగామ
రెండు నెలలుగా..
కడ్తాల్ గ్రామంలోని విజయ డెయిరీ పాల సేకరణ కేంద్రంలో నిత్యం 130 లీటర్ల పాలు పోస్తా. రెండు నెలలకు రూ.3.50 లక్షల బిల్లు పెండింగ్‌లో ఉన్నది. బిల్లు రాక ఇబ్బందులు పడుతున్నా. పశు పోషణ కూడా భారమైంది. దాణా, పశువుల మందుల కోసం అప్పులు చేయాల్సి వస్తున్నది. ప్రభుత్వం బిల్లులు చెల్లించాలి.
– జల్కం మహేశ్, పాడి రైతు, కడ్తాల్ మండలం
పశు పోషణ భారమైంది..
పాల బిల్లు ఇవ్వకపోవడంతో ఇబ్బందులు పడుతున్నా. రోజూ విజయ డెయిరీ పాల సేకరణ కేంద్రంలో 80 లీటర్ల వరకు పాలు పోస్తా. రెండు నెలలకు రూ.2.20 లక్షల బిల్లు బకాయి ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి బిల్లులు సక్కగా వస్తలేవు. ప్రభుత్వం రైతులను చిన్న చూపు చూస్తున్నది. ఆవులకు దాణా, మందులు కొనలేక పశు పోషణ భారమైంది. కుటుంబం గడువడం కూడా కష్టంగా మారింది.
– బాచిరెడ్డి అశోక్‌రెడ్డి, పాడి రైతు, కడ్తాల్ మండలం
రూ.2.50 లక్షల బిల్లు రావాలె..
పాడి పరిశ్రమను నమ్ముకున్నందుకు కష్టాలు పడుతున్నా. రోజూ 90 లీటర్ల పాలు పోస్తా. అరవై రోజులకు రూ.2.50 లక్షల బిల్లు రావాలె. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పదిహేను రోజులకోసారి బిల్లు ఇచ్చేటోళ్లు. కాంగ్రెస్ వచ్చినాక కష్టాలు మొదలైనయ్. పశువులను ఎలా పోషించాలి.. పిల్లల ఫీజులు, ఇంటి ఖర్చులు ఎలా వెళ్లదీయాలి. ప్రభుత్వం ఆలోచించాలి.
– మంకీ మహేశ్, పాడి రైతు, కడ్తాల్ మండలం