జిల్లాలోని కాంగ్రెస్ పార్టీలో మార్కెట్ కమిటీ పాలకవర్గాల ఫైట్ తీవ్రస్థాయిలో జరుగుతున్నది. చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్ల పదవుల కోసం పార్టీ నేతల్లో తీవ్రమైన పోటీ నెలకొన్నది. మరోవైపు పాలకవర్గాల ఎంపిక కూడా ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది. కొన్నిచోట్ల కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి, పాత వారికి మధ్య పోటీ ఉండగా.. పాత వారు నామినేటెడ్ పోస్టులను తమకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో జిల్లాలోని తొమ్మిది మార్కెట్ కమిటీల్లో ఇప్పటివరకు రెండు చోట్ల మాత్రమే పాలక వర్గాలను నియమించగా.. మరో ఏడు చోట్ల పెండింగ్‌లో ఉన్నాయి. పెండింగ్‌లో ఉన్న వాటిలో ఒకటి రెండింటిపైనే ఏకాభిప్రాయం కుదిరినట్లు సమాచారం.
– రంగారెడ్డి, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ)
రెండు పాలకవర్గాలు మాత్రమే..
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 11 నెలల్లో ..జిల్లాలోని చేవెళ్ల, గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీలకు మాత్రమే పాలకవర్గాలను నియమించింది. మిగతా వాటిలో శంకర్పల్లి, నార్సింగి రెండింటిపైనే ఏకాభిప్రాయం కుదిరింది. ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ పాలకవర్గ చైర్మన్‌గా.. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గురునాథ్‌రెడ్డి పేరు దాదాపుగా ఖరారైనా మంఖాల దాసు అనూహ్యంగా తెరపైకి వచ్చి చైర్మన్ పదవి తనకు ఇవ్వాలనడంతో చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికకు బ్రేక్ పడింది. అలాగే, వైస్ చైర్మన్, డైరెక్టర్ల ఎంపికలోనూ నాయకుల మధ్య తీవ్ర పోటీ ఉన్నది. ఆమనగల్లు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం యాట గీత, శ్రీనివాస్‌గౌడ్ పోటీపడుతున్నప్పటికీ గీత వైపే కాంగ్రెస్ అధిష్ఠానం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. అదేవిధంగా మహేశ్వరం మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని ఎస్టీలకు కేటాయించగా.. రాజూనాయక్, కృష్ణానాయక్, పాండూనాయక్లు పోటీపడుతున్నారు. వీరిలో ఎవరిని ఎంపిక చేయాలో పార్టీ ఇన్చార్జి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డికి తలనొప్పిగా మారింది.
శంకర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్‌గా జనార్దన్‌రెడ్డి, నార్సింగి చైర్మన్‌గా వేణుగౌడ్లపై ఏకాభిప్రాయం కుదిరింది. అలాగే, సర్దార్నగర్మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య వెంకట్‌రెడ్డి పేరును, ఆ పార్టీ ఇన్చార్జి భీంభరత్ సురేందర్‌రెడ్డి పేరును సూచించారు. దీంతో ఎమ్మెల్యే యాదయ్య, భీంభరత్ ఎవరికివారుగా తమ అనుచరులకు ఇప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. షాద్‌నగర్ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్‌గా సీనియర్ నాయకుడు కృష్ణారెడ్డి సతీమణి సులోచన పేరు దాదాపుగా ఖరారైనట్లు సమాచారం. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న పాలకవర్గాల ఎంపిక ఎమ్మెల్యేలు, ఇన్చార్జిలకు కత్తిమీద సాములా మారింది.
కొత్త.. పాతల మధ్య పోరు..
జిల్లాలోని మార్కెట్ కమిటీ పాలకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీలోకి కొత్తగా వచ్చిన నాయకులు, పాత నాయకులకు మధ్య పోరు తీవ్రంగా జరుగుతున్నది. కొన్నేండ్లుగా పార్టీలో ఉంటున్నామని.. వైస్ చైర్మన్, డైరెక్టర్ల పదవులు తమకే ఇవ్వాలని పాత నా యకులు పట్టుబడుతున్నారు. ఆయా ఎమ్మెల్యేలతో పార్టీలోకి వచ్చిన కొత్తవారు కూడా తమకు ప్రాధాన్యమివ్వాలని కోరుతున్నారు. కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేవెళ్ల, రాజేంద్రనగర్ ఎమ్మెల్యేలతోపాటు పలు సెగ్మెంట్లకు చెందిన బీఆర్ఎస్కు చెందిన అనేక మంది నాయకులు కూడా కాంగ్రెస్‌లో చేరారు. ఆయా సెగ్మెంట్లలో ఎమ్మెల్యేలను నమ్ముకుని వచ్చిన అనేక మంది డైరెక్టర్ల పదవి కోసం పోటీ పడుతున్నారు. కాగా, పార్టీ అధికారంలోకి వచ్చి 11 నెలలు దాటినా సెగ్మెంట్లలో మార్కెట్ కమిటీ పాలకవర్గాలను నియమించకపోవటంపై క్యాడర్లో అసంతృప్తి నెలకొంది. వారిని బుజ్జగించే పనిలో ఎమ్మెల్యేలు, ఇన్చార్జీలు ఉన్నారు.