వికారాబాద్/నవాబుపేట, సెప్టెంబర్ 30 : ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నిక ల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించి కేసీఆర్‌కు కానుకగా ఇద్దామని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం నవాబుపేటలోని లింగంపల్లి ఫంక్షన్ హాల్లో పార్టీ మండలాధ్యక్షుడు దయాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. దీనికి సబితారెడ్డితోపాటు పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ హాజరయ్యారు.
కాగా, సభా వేదికపై చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కోసం కుర్చీ, కండువాను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సబితారెడ్డి మాట్లాడుతూ.. 22 నెలల పాలనలో కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలు ఎన్నో ఉన్నాయన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల కార్డులను భద్రంగా ఉంచుకొని.. ఓట్ల కోసం వచ్చిన కాంగ్రెస్ నాయకులకు చూపించి ప్రశ్నించాలన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా.. కేసీఆర్ అప్పులు చేశారని అబద్ధాలు చెబుతూ కాంగ్రెస్ పాలకులు కాలం గడుపుతున్నారని మండిపడ్డారు. హామీలను అమలు చేయకుండా మోసం చేసిన కాంగ్రెస్‌కు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటుతో తగిన బుద్ధి చెప్పాలని సూచించారు.
అబద్ధ్దాల కాంగ్రెస్‌కు కర్రు కాల్చి వాతపెట్టాలన్నారు. వికారాబాద్ జిల్లాలో కేసీఆర్ మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఇస్తే.. కాంగ్రెస్ కేవలం 39 శాతమే ఇచ్చి వారిని అగౌరపరిచిందన్నారు. మహిళలను కోటీశ్వరులను చేస్తానని ప్రకటించడమే తప్పా.. వారికి గౌరవం ఇవ్వడంలేదని.. కనీసం బతుకమ్మ చీరలూ ఇవ్వకుండా అవమానపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో ప్రజలు అడగకుండానే రైతుబంధు, కల్యాణలక్ష్మి, మిషన్ భగీరథ నీరు, కేసీఆర్ కిట్లు తదితర పథకాలను తీసుకొచ్చి అమలు చేశారన్నారు.
ఈ సందర్భంగా నవాబుపేట మండలానికి చెందిన ట్రిపులార్ బాధితులు మాజీ మంత్రి సబితారెడ్డికి తమ గోడును వివరించారు. అనంతరం బీజేపీ మండలాధ్యక్షుడు నరేందర్‌రెడ్డి దాదాపు 200 మంది తన అనుచరులతో కలిసి సబితారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో టీఎస్ఈడబ్ల్యూఐడీసీ మాజీ చైర్మన్ నాగేందర్‌గౌడ్, వికారాబాద్ మాజీ జడ్పీ వైస్ చైర్మన్ విజయ్‌కుమార్, మండల గౌరవాధ్యక్షుడు భరత్‌రెడ్డి, మాజీ సుభాన్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ విజయ్‌కుమార్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్లు పురుషోత్తం, శాంతికుమార్, మాజీ వైస్ ఎంపీపీ బందయ్యగౌడ్, ప్రధాన కార్యదర్శి మహేశ్వర్‌రెడ్డి, ప్రచార కార్యదర్శి వెంకట్‌రెడ్డి, మైనార్టీ మండల అధ్యక్షుడు ఫిర్దోస్ఖాన్, రైతు సంఘం అధ్యక్షుడు జగన్‌రెడ్డి, నాయకులు సుభాన్‌రెడ్డి, మాణిక్‌రెడ్డి పాల్గొన్నారు.
తెలంగాణను అగ్రగామిగా నిలిపిన కేసీఆర్
బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ గురించి చెబితే రామాయణం.. వింటే మహాభారతం అంత చరిత్ర అవుతుందన్నారు. రేవంత్‌రెడ్డి తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేద్దామని కలలు కంటున్నారని.. చివరకు ఆయనే కాంగ్రెస్‌లో లేకుండా పోయేటట్లు ఉన్నారని ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డిని పార్టీ అధిష్ఠానం, మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం తిడుతున్నారని.. ప్రజలు తిడుతుంటే తెలుగుభాషలో ఇన్ని తిట్లు ఉన్నాయా అని ఆశ్చర్యం వేస్తున్నదన్నారు. గతంలో ప్రజల కోసం కేసీఆర్ ఎన్నో పథకాలను అమలు చేసి తెలంగాణను అగ్రగామిగా నిలిపారని కొనియాడారు.
స్పీకర్ నియోజకవర్గంలో రోడ్లు బాగాలేక పిల్లను ఇచ్చే పరిస్థితి లేదన్నారు. వర్షాలతో పాడైన రైతుల పంటలను పరిశీలించేందుకు పాలకులకు సమయం లేదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్లోనే ఉన్నానని చెప్పుకొనే చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య కోసం ప్రత్యేకంగా కుర్చీని ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ బాకీ కార్డులను దగ్గర పెట్టుకొని.. ఓట్ల కోసం ఇంటి ముందుకొచ్చే కాంగ్రెస్ నాయకులను నిలదీయాలన్నారు. మహిళలకు 22 నెలల నుంచి రావాల్సిన రూ. 55వేలు, చదువుకున్న మహిళలకు స్కూటీలు, ఉద్యోగాలు, పెళ్లి అయిన వారికి తులం బంగారం ఎక్కడ అని నిలదీయాలన్నారు.
డ్రామాలు ఆడుతున్న ప్రభుత్వం
రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్‌పటేల్ మాట్లాడుతూ.. 6 గ్యారెంటీలు, 420 హామీల్లో ఒక్క ఫ్రీ బస్సు తప్పా ఏ ఒక్క పథకం కూడా పూర్తిగా అమలు కావడంలేదన్నారు. మహిళలకు రూ.2500, రైతు భరోసా రూ.15వేలు ఇవ్వడంలేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై అక్టోబర్ 8న కోర్టు విచారణ ఉంటే… అక్టోబర్ 9న నోటిఫికేషన్ అంటూ ప్రభుత్వం డ్రామాలు ఆడుతున్నదని మండిపడ్డారు. ట్రిపులార్ పేరుతో పేద రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. నవాబుపేటకు అండగా మాజీ మంత్రి సబితారెడ్డి, ఆనంద్ ఉన్నారని.. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకుందామన్నారు.