ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 4 వరకు పరీక్షలు కొనసాగనుండగా, ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి. మాస్ కాపీయింగ్‌కు తావులేకుండా ఇంటర్ బోర్డు అధికారులు ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వికారాబాద్ జిల్లాలో 30 పరీక్షా కేంద్రాలు, రంగారెడ్డి జిల్లాలో 182 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మెరుగైన ఫలితాలు సాధించేలా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో నిత్యం ప్రత్యేక తరగతులను నిర్వహించారు.
వికారాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ) : ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగనున్నాయి. సంబంధిత అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి. జిల్లావ్యాప్తంగా 17,888 మంది ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. మరోవైపు మాస్ కాపీయింగ్‌కు తావులేకుండా నిఘా నీడలో ఇంటర్మీడియట్ పరీక్షలను నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. జిల్లాలోని 30 పరీక్షా కేంద్రాల్లోనూ సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే అధికారులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షల నిమిత్తం 30 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉత్తీర్ణతలో జిల్లాను ముందంజలో నిలిపేందుకు జిల్లా ఇంటర్ బోర్డు అధికారులు తగు చర్యలు తీసుకున్నారు.
జిల్లావ్యాప్తంగా 17,888 మంది ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. జనరల్ విద్యార్థులు 15,297 మంది, ఒకేషనల్‌కు సంబంధించి 2591 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. 30 పరీక్షా కేంద్రాలకుగాను.. 10 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో, పరిగి, కొత్తగడిలోని సాంఘిక సంక్షేమ స్కూళ్లు, ఒక మోడల్ స్కూల్, వికారాబాద్ సంఘం లక్ష్మీబాయి స్కూల్‌తోపాటు, మిగతా 15 పరీక్షా కేంద్రాలను ప్రైవేట్ జూనియర్ కాలేజీల్లో ఏర్పాటు చేశారు. ప్రశ్నాపత్రాలను నిల్వ చేయడంతోపాటు ఆయా పరీక్షా కేంద్రాలకు తరలించేందుకు 10 స్టోర్ పాయింట్లను ఏర్పాటు చేశారు. వీటిలో తాండూరు, వికారాబాద్, పరిగి, మర్పల్లి, కులకచర్ల, దోమ, నవాబుపేట, మోమిన్‌పేట, కొడంగల్, పెద్దేముల్ ఉన్నాయి. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక ఇన్విజిలెటర్ చొప్పున.. లెక్చరర్, రెవెన్యూ, పోలీస్ శాఖతోపాటు ముగ్గురు సభ్యులతో కూడిన ఫ్లైయింగ్ స్కాడ్ బృందం, నలుగురు సభ్యులతో కూడిన రెండు సిట్టింగ్ బృందాలను నియమించారు.
మెరుగైన ఫలితాలు సాధించేందుకు జిల్లా ఇంటర్ బోర్డు అధికారులు జిల్లాలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో కాలేజీ ప్రారంభం నుంచి ప్రత్యేక తరగతులను చేపట్టారు. ఉదయం 9 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 3.30 నుంచి 4.30 గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహించారు. రోజుకొక సబ్జెక్టుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. అధిక శాతం విద్యార్థులు ఫెయిల్ అయ్యే ఫిజిక్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులపైనే ఈ ఏడాది కూడా ఇంటర్మీడియట్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. సంబంధిత సబ్జెక్టుల్లో ప్రతి విద్యార్థి ఉత్తీర్ణులయ్యేలా తీర్చిదిద్దారు. 80 శాతానికిపైగా ఉత్తీర్ణత సాధించేలా ఎప్పటికప్పుడు విద్యార్థులకు ఆయా పరీక్షలు నిర్వహించారు. ప్రతిరోజూ సబ్జెక్టు బోధన పూర్తయిన వెంటనే పదిహేను నిమిషాల పాటు స్టడీ అవర్ కూడా ఉండేలా చర్యలు చేపట్టారు. జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో యూనిట్ టెస్ట్‌లతోపాటు అర్ధ సంవత్సర పరీక్షలు, పది స్లిప్ టెస్ట్‌లు, ప్రీ ఫైనల్ పరీక్షలను కూడా నిర్వహించారు. కాలేజీల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ విధానాన్ని అమలుచేస్తుండడంతో అధ్యాపకులు, విద్యార్థులు క్రమం తప్పకుండా హాజరవుతున్నారు.
శంకర్‌నాయక్, జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి
ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. జిల్లాలో అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాం. పరీక్షా కేంద్రాల్లో బెంచీలతోపాటు ప్రతి పరీక్షా కేంద్రానికి ఒక ఏఎన్ఎంను నియమించాం. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఈ ఏడాది గతేడాదికి మించి ఫలితాలు వస్తాయి.
రంగారెడ్డి, మార్చి 8 (నమస్తే తెలంగాణ) : ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 4 వరకు జరుగనున్న ఇంటర్ పరీక్షలకు సంబంధించి కలెక్టర్ హరీశ్ ఆధ్వర్యంలో డీఐఈవో వెంక్యానాయక్ ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇంటర్ పరీక్షలు, ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో ఇప్పటికే జిల్లా అదనపు కలెక్టర్ తిరుపతిరావు, ఇంటర్మీడియెట్ విద్యా శాఖ అధికారి కో ఆర్డినేషన్ సమావేశం నిర్వహించి ఆయా పనులపై సమీక్ష చేపట్టారు. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 3 వరకు, రెండో సంవత్సరం పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 4 వరకు జరుగనున్నాయి. జిల్లాలో 1,27,656 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. ప్రస్తుతం వెల్లడించిన పరీక్షల తేదీలు, జనరల్, ఒకేషనల్ కోర్సులకు కూడా వర్తిస్తాయని ఇంటర్ బోర్డు ప్రకటించింది. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు సరిపడా బెంచీలు, తాగునీరు, విద్యుత్ సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇన్విజిలేటర్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, చీఫ్ సూపరింటెండెంట్లకు డ్యూటీలు కేటాయిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
జిల్లాలో 182 పరీక్షా కేంద్రాల ద్వారా 71,773 మంది విద్యార్థులు మొదటి సంవత్సరం, 55,883 మంది విద్యార్థులు రెండో సంవత్సరం పరీక్షలకు హాజరవుతున్నారు. సీసీ కెమెరాల నిఘాలో ఈ పరీక్షలు పకడ్బందీగా జరుగనున్నాయి. 31 ప్రశ్నాపత్రాల స్టోరేజ్ పాయింట్లు ఉండగా, నాలుగు ఫ్లయింగ్ స్క్వాడ్ టీములు, నాలుగు సిట్టింగ్ స్క్వాడ్ టీములను ఏర్పాటు చేశారు. బోర్డు టీమ్స్ కూడా ఈ పరీక్షలపై ఒక కన్ను వేయనున్నాయి. పోలీసు శాఖ వారు పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. పోస్టల్ శాఖ వారు జవాబుపత్రాలను సరిగా రిసీవ్ చేసుకునేలా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. పరీక్షా సమయంలో కేంద్రానికి సమీపంలో ఉన్న జిరాక్స్ సెంటర్లన్నీ మూసివేసేలా అధికారులు జాగ్రత్తపడుతున్నారు.
విద్యార్థులు గంట ముందే పరీక్షా కేంద్రాలకు హాజరు కావాలని, కొంచెం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి ఆహ్వానించబోమని అధికారులు విద్యార్థులను హెచ్చరిస్తున్నారు. పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు సకాలంలో హాజరయ్యేలా ఆర్టీసీ అధికారులు ప్రత్యేకంగా బస్సులను నడిపేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ఫస్ట్ ఎయిడ్ కిట్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మందులతో మెడికల్ పాయింట్ ఏర్పాటు చేసి ఒక ఏఎన్ఎంను పరీక్షా కేంద్రాల వద్ద అందుబాటులో ఉంచుతూ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
వెంక్యానాయక్, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి
విద్యార్థులు వారికి సంబంధించిన పరీక్షా కేంద్రాలకు ఒక గంట ముందే రావాలి. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభం కానుంటే, విద్యార్థులు 8 గంటల వరకల్లా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ సమయం దాటి వస్తే అనుమతించే ప్రసక్తే లేదు. ఆయా పరీక్షా కేంద్రాలకు సంబంధించిన వివరాలను, కేంద్రాలను ఒకరోజు ముందుగానే చూసుకోవాలి. అనవసరమైన ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దు. ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకురావొద్దు. విద్యార్థులు అన్ని రకాలుగా పరీక్షకు సిద్ధమై రావాలి.