రంగారెడ్డి, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): జిల్లా రైతులకు రుణమాఫీ ఫికర్ పట్టుకున్నది. రుణమాఫీ ప్రక్రియ నేటికీ కొనసా గుతూనే ఉన్నది. అర్హులందరికీ పంట రుణాలను మాఫీ చేస్తామన్న కాంగ్రెస్ సర్కా రు మూడు విడతల్లో సగం మందికే మాఫీ చేసింది. కేవలం రేషన్ కార్డులేక మాఫీ కాని రైతులే జిల్లాలో 20,445 మంది వరకు ఉన్నారు. ఇందుకు సంబంధించిన కుటుంబ నిర్ధారణ సర్వే నత్తనడకన సాగుతున్నది. కాలయాపన తప్పితే..మాఫీ అవుతుందన్న నమ్మకం జిల్లా రైతులకు కలగడం లేదు. మాఫీ కాక..కొత్తగా రుణా లు అందక..ఖరీఫ్ సీజన్ అప్పులతోనే భారంగా సాగింది.
అన్నదాతల అయోమయం..
రూ.2 లక్షల్లోపు పంట రుణాలను మాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించడంతో రైతులంతా సంబురపడ్డారు. అయితే అధికారంలోకి వచ్చాక సర్కారు రకరకాల కొర్రీలు పెట్టడంతో చాలామంది నిరాశ చెందారు. ప్రభుత్వం ఇప్పటివరకు మూడు విడతల్లో జిల్లాలోని 87,612 మంది రైతులకు రూ. 660. 72 కోట్ల రుణాలు మాత్రమే మాఫీ అయ్యాయి. అర్హత ఉన్నా చాలామందికి రుణ మాఫీ కాలేదు. రేషన్ కార్డులేకపోవడం, ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతాల్లో పేర్లలో పొరపాట్లు ఉండడం తదితర కారణాలతో వేలాది మందికి లబ్ధి చేకూరలేదు.
మాఫీ కాని వారు వ్యవసాయ శాఖ కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ ఇంకా ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. వానకాలం సాగుకు రైతు భరోసా వస్తుందని ఎదురు చూసిన రైతులకు ఆశాభంగమే కలిగింది. కనీసం రుణమాఫీ అయినా..కొత్త రుణా లు తీసుకోవచ్చని భావించినా అడియాశే అయింది. రుణం మాఫీ కాక..కొత్తగా రుణాలు అందకపోవడంతో ప్రైవేట్ వ్యక్తుల వద్ద అధిక వడ్డీలకు అప్పు తెచ్చి సేద్యం చేశారు. ఖరీఫ్ సాగు గతంతో పోలిస్తే కాస్త తగ్గేందుకు కారణం ఇదేనని రైతులు చెబుతున్నారు.
నత్తనడకన కుటుంబ సర్వే..
32 రకాల కారణాలతో చాలామందికి రుణమాఫీ వర్తించలేదు. ఆయా సమస్యలను పరిష్కరించి అర్హులకు రుణమాఫీ అయ్యేలా చూస్తామని సర్కారు హామీ ఇచ్చింది. సాంకేతిక సమస్యల పరిష్కారానికి అధికారులు జిల్లా స్థాయిలో గ్రీవెన్స్ సెల్ ఏ ర్పాటు చేసి ఫిర్యాదులు స్వీకరించారు. రేషన్ కార్డులేని వారికోసం కుటుంబ నిర్ధా రణ సర్వేను ప్రారంభించారు. జిల్లావ్యాప్తంగా జరిపిన ఈ సర్వేలో రేషన్ కార్డులేని 20,445 మంది రైతులను వ్యవసాయ అధికారులు గుర్తించి వివరాలు సేకరిస్తున్నా రు. ఇంటింటికెళ్లి వివరాలు తెలుసుకుని యాప్‌లో ఎంట్రీ చేస్తున్నారు. కుటుంబ యజమానితో ధ్రువీకరణ పత్రాన్ని తీసుకుంటున్నారు.
వారంలోగా సర్వే పూర్తి చేసి రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తామని అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. కానీ.. రెండు నెలలు దాటినా సర్వే పూర్తి కాలేదు. ఇప్పటివరకు 16,613 మంది రైతులకు సంబంధించి సర్వే పూర్తి చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఇంకా సర్వే కొన సాగుతూనే ఉన్నది. నెలల గడుస్తున్నా రుణమాఫీపై స్పష్టత రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇక బ్యాంకుల్లో రూ.2 లక్షలకు పైగా రుణాలు తీసుకున్న వారి విషయంలోనూ ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదు. రూ.2 లక్షలకు పైగా ఉన్న మొత్తాన్ని చెల్లిస్తేనే మిగతాది మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ..ఆ మొత్తం చెల్లించాక మాఫీ అవుతుందా? లేదా? అనే మీమాసం రైతులను వెంటాడుతున్నది.
రేషన్ కార్డులేక రుణమాఫీకాని వారి వివరాలు మండలాల వారీగా..
మండలం : రైతులు
అబ్దుల్లాపూర్‌మెట్ : 488
ఆమనగల్లు : 822
బాలాపూర్ : 126
చేవెళ్ల : 1,176
ఫరూఖ్‌నగర్ : 1,239
గండిపేట: 46
హయత్ నగర్ : 12
ఇబ్రహీంపట్నం : 1,787
చౌదరిగూడెం : 510
కడ్తాల్ : 777
కందుకూరు : 1,700
కేశంపేట : 1,163
కొందుర్గు : 673
కొత్తూరు : 324
మాడ్గుల : 1,560
మహేశ్వరం : 793
మంచాల : 1,240
మొయినాబాద్ : 647
నందిగామ : 367
సరూర్ నగర్ : 04
శేరిలింగంపల్లి : 18
షాబాద్ : 729
శంషాబాద్ : 516
శంకర్పల్లి : 666
తలకొండపల్లి : 1,604
యాచారం : 1,458
మొత్తం : 20,445