వికారాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ) : ఎండల తీవ్రత ఎక్కువ కావడంతో జిల్లా అంతటా భూగర్భజలాలు పూర్తిగా తగ్గుముఖం పడుతున్నాయి. గత నెలతో పోలిస్తే సుమారు రెండు మీటర్ల మేర నీటి నిల్వలు అడుగంటిపోయాయి. గత వారం, పది రోజులుగా ఎండలు 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో నీటి నిల్వలు రోజురోజుకూ తగ్గిపోతున్నాయి. ఈ నెల చివరి వరకు భూగర్భజలాలు ప్రమాదకరస్థాయిలో తగ్గే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని మెజార్టీ చెరువుల్లో నీటి నిల్వలు 70 శాతం మేర తగ్గిపోయాయి. చెరువులతోపాటు ప్రాజెక్టుల్లోనూ నీటి నిల్వలు క్రమంగా తగ్గుముఖం పడుతుండటం చూస్తే ఈ నెలాఖరు నాటికి జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులైన కోట్‌పల్లి, లక్నాపూర్, జుంటుపల్లి, శివసాగర్, కాకరవేణి, అల్లాపూర్, నందివాగు, సర్పన్‌పల్లి ప్రాజెక్టుల్లోనూ నీటి నిల్వలు పూర్తిగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి.
భూగర్భజలాలను పెంపొందించేందుకు ప్రతి గ్రామపంచాయతీలోనూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంకుడు గుంతలను నిర్మిస్తే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదిగా ఇంకుడు గుంతల నిర్వహణను పూర్తిగా విస్మరించింది. జిల్లాలో మార్చి చివరి నాటికి 13.72 మీటర్ల లోతుకు అడుగంటిపోగా, ఏప్రిల్ చివరి నాటికి రెండు మీటర్ల మేర నీటి నిల్వలు తగ్గి 15.09 మీటర్లకు నీటి నిల్వలు తగ్గడం గమనార్హం. గతేడాది ఏప్రిల్‌తో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్ చివరి నాటికి కూడా నీటి నిల్వలు కొంతమేర పర్వాలేదనిపించినా, నీటి నిల్వలు క్రమంగా తగ్గుతుండటం ఆందోళన కలిగిస్తున్నది.
జిల్లాలో భూగర్భజలాలు అడుగంటిపోతున్న దృష్ట్యా తాగునీటి సమస్యలు తలెత్తకుండా జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. ప్రతి ఏటా ఎక్కడైతే తాగునీటి సమస్య ఏర్పడుతుందో సంబంధిత ప్రాంతాల్లో ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేశాం. సమ్మర్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా జిల్లావ్యాప్తంగా పైప్‌లైన్ లీకేజీలు, బోర్‌వెల్స్, బోరు బావులు పాడైన 24 గంటల్లో బాగు చేసేలా చర్యలు చేపట్టాం. అవసరమైన ప్రాంతాల్లో కొత్త బోర్లు వేసేందుకు చర్యలు చేపట్టాం. అత్యవసర పరిస్థితుల్లో ట్యాంకర్ల ద్వారా కూడా తాగునీటిని సరఫరా చేసేందుకు సంబంధిత యంత్రాంగాన్ని సిద్ధం చేశాం.
– వికారాబాద్ కలెక్టర్ దీపక్ తివారీ
