వికారాబాద్, డిసెంబర్ 19 : వికారాబాద్ జిల్లాలోని పలు మండలాలు, గ్రామాలకు చెందిన రైతులు తమ ఆకు, కాయ కూరగాయలను విక్రయించేందుకు సరైన స్థలం లేక ఇబ్బంది పడడంతో.. గత కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్(వెజ్, నాన్వెజ్)ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 2021లో రైతుబజార్ సమీపంలో 105 సర్వేనంబర్ లో రెండెకరాల స్థలాన్ని మార్కెట్ నిర్మాణానికి కేటాయించి ..రూ.7.20 కోట్ల నిధులనూ మంజూరు చేసింది. దీంతో తమ పంట ఉత్పత్తులను అమ్ముకునేందుకు ఇబ్బందులు తప్పుతాయని రైతులు భావించారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను 108 స్టాళ్లతో ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదనలూ రెడీ చేశారు.

హైదరాబాద్కు చెందిన కాంట్రాక్టర్కు ఆ పనులను అప్పగించగా అతడు భవనం పనులను బేస్మెంట్ వరకు నిర్మించాడు. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు రావడం.. పవర్లోకి రేవంత్ సర్కార్ రావ డంతో ఆ పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. దీంతో కూరగాయలు అమ్ముకునేందుకు వచ్చిన రైతులు వానకు తడుస్తూ.. ఎండకు ఎండుతూ… అవస్థలు పడుతున్నారు. రేవంత్ సర్కార్ స్పందించి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులను త్వరగా ప్రారంభించి పూర్తి చేయాలని కోరుతున్నారు.