బొంరాస్‌పేట, జూలై 24 : మన దేశంలో ఏటా పుట్టిన ప్రతి వంద మంది శిశువుల్లో ఆరు నుంచి ఏడుగురు వివిధ రకాల లోపాలతో జన్మిస్తున్నారు. ఇది పిల్లల శారీరక, మానసిక అభివృద్ధిని దెబ్బతీస్తుంది. ఇటువంటి సమస్యలను సకాలంలో గుర్తించకపోతే చిన్నారుల్లో వినికిడి, దృష్టి లోపంతోపాటు శాశ్వత వైకల్యానికి దారితీస్తుంది.
పిల్లల్లో పుట్టుకతో వచ్చే లోపాలను ముందుగానే గుర్తించేందుకు.. రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం(ఆర్బీఎస్కే) పేరుతో చిన్నారులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తుంటారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి వారిలో ఉన్న లోపాలను గుర్తించి చికిత్స కోసం దవాఖానలకు రెఫర్ చేస్తుంటారు.
సాధారణంగా ఆర్బీఎస్కే మొబైల్ బృందాలు ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను మాత్రమే సందర్శించి వాటిలో ఉన్న విద్యార్థులను మాత్రమే పరీక్షిస్తుంటారు. మిగతా వారు ఇలాంటి వైద్య పరీక్షలకు దూరంగా ఉంటారు. ఫలితంగా వారిలో పుట్టుకతో వచ్చే లోపాలున్నా తల్లిదండ్రులు గుర్తించక వాటిని నిర్లక్ష్యం చేస్తుంటారు.
దానిని నివారించేందుకు వికారాబాద్ జిల్లాలోని బొంరాస్‌పేట మండలాన్ని ఆర్బీఎస్కే పైలట్ ప్రాజెక్టుగా కలెక్టర్ ప్రతీక్‌జైన్ ఎంపిక చేశారు. ఆరేండ్లలోపే ఇలాంటి లోపాలను గుర్తించి వారికి చికిత్స అందిస్తే మామూలు స్థితికి తీసుకురావచ్చన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ సర్వేను చేపట్టింది.
మండలంలోని 0-6 ఏండ్లలోపు పిల్లలకు..
పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైన బొంరాస్‌పేట మండలంలో ని అన్ని గ్రామాల్లో అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు ఇం టింటికెళ్లి సర్వే నిర్వహిస్తారు. అంగన్వాడీలు, పాఠశాలలకెళ్లే వారితోపాటు వలస వెళ్లిన వారి పిల్లలు, ఇండ్ల వద్ద ఉండే చిన్నారులు, సంచార జాతుల పిల్లల తల్లిదండ్రులను కలిసి పిల్లల్లో పుట్టుకతో వచ్చిన లోపాలను అడిగి తెలుసుకుంటారు. ఇందుకోసం సర్వే చేసే వారికి 25 ప్ర శ్నలతో కూడిన పేపర్లను అందిస్తారు.
ఈ ప్రశ్నల్లో పిల్లలు పుట్టగానే ఏడ్చారా..? వినికిడి శక్తి ఉందా..? కంటి చూ పు బాగా ఉందా ..? లేదా అని పరిశీలిస్తారు. అదేవిధం గా పిల్లలు మూడు నుంచి నాలుగు నెలలు వచ్చే సరికి కొన్ని శబ్దాలు చేయాలి. అలా చేయకుంటే ఏదో లోపం ఉన్నట్లు గుర్తిస్తారు. కాళ్లు వంకర పోవడం, తల సైజు వం టి వాటిని పరిశీలిస్తారు.
పిల్లల అభివృద్ధికి సంబంధించి 3-5 నెలల చిన్నారులు మెడ నియంత్రణ, తిప్పడం, 5-6 నెలల్లో పాకడం, 6-8 నెలల్లో కూర్చోవడం, 9-11 నెలలకు నిలబడడం, 11-13 నెలలకు నడవడం లాంటివి చేస్తున్నారా లేదా అనేది సర్వే బృందాలు పరీక్షిస్తారు. ఇలా 25 ప్రశ్నలకు తల్లిదండ్రుల నుంచి సమాధానాలు రాబట్టి పిల్లలకు ఎలాంటి లోపం ఉందో గుర్తిస్తా రు. గుర్తించిన లోపాలకు సకాలంలో వైద్య చికిత్స అం దించి ఆరోగ్యవంతులుగా చేసేందుకు కృషి చేస్తారు.
అంగన్వాడీలు, ఆశలకు శిక్షణ
మండలంలోని అన్ని గ్రామాల్లో ఇంటింటికెళ్లి 0-6 ఏండ్లలోపు పిల్లలను పరీక్షించేందుకు అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలకు మం గళ, బుధవారాల్లో రెండు రోజులపాటు వైద్యారోగ్యశాఖ అధికారులు శిక్షణ ఇచ్చారు. ఆన్లైన్ లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పిల్లల్లో పుట్టుకతో వచ్చే లోపాలను ఎలా గుర్తించాలో.. 25 రకాల ప్రశ్నలకు ఎలా జవాబులు రాబట్టాలో కూడా శిక్షణలో వివరించారు. వచ్చే నెల నుంచే ఈ సర్వే ప్రారంభం కానున్నది.
మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు
ఎదుగుదలలో లోపాలు న్న చిన్నారులను గుర్తించేందుకు బొంరాస్‌పేట మండలాన్ని కలెక్టర్ పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. కార్యక్రమంలో భాగంగా మండలంలోని అన్ని గ్రా మాల్లో 0-6 ఏండ్లలోపు పిల్లల్లో పుట్టుకతో వచ్చే లోపాలను గుర్తిస్తారు. అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు ఇంటింటికెళ్లి తల్లిదండ్రులను కలిసి పిల్లల్లో ఉన్న లోపాలపై 25 ప్రశ్నలతో రూపొందించిన ఫార్మాట్లో జవాబులు రాబడ్తారు. లోపాలను గుర్తించిన పిల్లలను దవాఖానలకు రెఫర్ చేసి మంచి వైద్యం అందిస్తే భవిష్యత్తులో వారు ఆరోగ్యంగా ఉంటారు. ఇది మంచి కార్యక్రమం.
-డాక్టర్ హేమంత్, మండల వైద్యాధికారి