గత ఫిర్యాదుల మాటేమిటి?
రంగారెడ్డి జిల్లాలో మొదటి విడుతలో 49,471 మందికి రూ.257.19కోట్ల రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. రెండో విడుతలో 22,915 మంది రైతులకు సంబంధించిన రూ.218.13 కోట్లను, మూడో విడుతలో 15,226 మంది రైతులకు రూ.185.40కోట్ల రుణాలను మాఫీ చేసినట్లు ప్రభుత్వం చెబుతున్నది. మూడు విడుతల్లో కలిసి జిల్లాలో 87,612 మందికి రూ.660.72 కోట్లను మాఫీ చేసింది. అర్హులు లక్షల్లో ఉండగా.. కేవలం వేలల్లోనే రుణమాఫీ చేసి ప్రభుత్వం చేతులు దులుపుకొన్నది.
రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా చాలామంది రైతులు అర్హులైనా… రుణం మాఫీ కాలేదు. రేషన్ కార్డు, ఇతర సాంకేతిక కారణాలతో బ్యాంకులు, వ్యవసాయాధికారుల చుట్టూ తిరుగుతున్నారు. రైతు వేదికలతోపాటు నిర్దేశించిన కార్యాలయాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నోడల్ అధికారులు ఫిర్యాదులను తీసుకుంటున్నారు. గతంలో వ్యవసాయ శాఖ కార్యాలయాల్లో, కలెక్టరేట్లో గ్రీవెన్స్ సెల్‌ను ఏర్పాటు చేయగా రైతుల నుంచి వెల్లువలా ఫిర్యాదులు వచ్చాయి. ప్రభుత్వం చెబుతున్న ప్రకారం.. ప్రతిసారీ రైతులు అధికారులకు దరఖాస్తులు ఇస్తూ వస్తున్నారు.
సుమారుగా 16 వేలకు పైగానే దరఖాస్తులు అధికారులకు అందినట్లు తెలిసింది. కానీ.. రోజుల తరబడిగా వాటికి పరిష్కారం మాత్రం లభించడం లేదు. తాజాగా ప్రభుత్వం ఇంటింటి సర్వే చేస్తామని చెబుతుండడంతో గతంలో ఇచ్చిన ఫిర్యాదుల మాటేమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. అవన్ని బుట్టదాఖలేనా!. అన్న సందేహాలను అన్నదాతలు వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో మొతలుకాని సర్వే..
రుణమాఫీ సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక యాప్‌ను రూపొందించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. రుణమాఫీ వర్తించని వారి ఇండ్ల వద్దకు వెళ్లి క్షేత్రస్థాయి సమాచారం తెలుసుకుని యాప్‌లో వివరాలను నమోదు చేయడం వల్ల మాఫీని వర్తింపజేస్తామని ప్రభుత్వం చెప్పింది. ఇందులో భాగంగా కుటుంబ యజమానితో ధ్రువీకరణ పత్రాన్ని అధికారులు తీసుకోనున్నారు.
రుణ ఖాతా, బ్యాంకు బ్రాంచి వివరాలతోపాటు, మాఫీ కోసం కుటుంబ సభ్యుల వివరాలను ఇష్టపూర్వకంగా ఇస్తున్నట్లు పేర్కొంటూ సంతకం చేసి కుటుంబ యజమాని ఇవ్వాల్సి ఉంటుంది. దీన్ని ధ్రువీకరిస్తూ గ్రామ కార్యదర్శి సంతకం చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ మంగవారం నుంచి ప్రారంభమవుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే జిల్లాలో ఈ ప్రక్రియ ఆచరణలోకి రాలేదు. యాప్ రాలేదని, తొందరలోనే దీనిపై ఓ స్పష్టత వస్తుందని జిల్లా అధికారులు తెలిపారు.
గతంలో రైతుల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిష్కరించకుండా ఇంటింటి సర్వే చేస్తామని ప్రకటించడం.. తీరా యాప్ రాలేదంటూ సర్వేను సైతం మొదలు పెట్టకపోవడంతో రైతులు అసహనం చేస్తున్నారు. నిత్యం బ్యాంకులు, వ్యవసాయ అధికారుల చుట్టూ తిరిగి విసుగు చెందుతున్నామని జిల్లా యంత్రాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. ఇప్పటికే పలుమార్లు వ్యవసాయ అధికారులకు దరఖాస్తులు చేశామని రైతులు ఆవేదన చెందుతున్నారు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వానికి మాఫీ చేసే ఆలోచన ఉందా ? లేదా ! అని మండిపడుతున్నారు. రోజుకోమాట చెప్పి రుణమాఫీని ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తే సహించేది లేదని హెచ్చరిస్తున్నారు.