రంగారెడ్డి, జూన్ 15 (నమస్తే తెలంగాణ) : ఫ్యూచర్‌సిటీలో హెల్త్ యూనివర్సిటీని నిర్మిస్తామంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. అందులో భాగమైన మీర్ఖాన్పేటలో గత ప్రభుత్వంలో శ్రీకా రం చుట్టిన మెడికల్ కళాశాల, 400 పడకల ఆస్పత్రి నిర్మాణంపై శీతకన్ను విధించడం చర్చనీయాంశంగా మారింది. మెడికల్ కళాశాల, 400 పడకల ఆస్పత్రి నిర్మాణానికి నిధులున్నా ఎందుకు నిర్మించడంలేదని ఈ ప్రాంతవాసులు ప్రశ్నిస్తున్నారు. గత కేసీఆర్ హయాంలో కందుకూరు మండలంలోని మీర్ఖాన్పేట వద్ద 40 ఎకరాల విస్తీర్ణంలో రూ.176 కోట్లతో మెడికల్ కళాశాల, 400 పడకల ఆస్పత్రి నిర్మాణానికి అప్పటి వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు, మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు.
ఎంబీబీఎస్ మొదటి ఏడాది పూర్తయ్యేలోపు మెడికల్ కళాశాల నిర్మాణం పూర్తి చేయాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భా గంగానే మెడికల్ కళాశాలను ఇబ్రహీంపట్నం సమీపంలోని భారత్ ఇంజినీరింగ్ కళాశాలలోని అద్దె భవనం ప్రారంభించారు. 2023లో శంకుస్థాపన చేసినా ఇప్పటికీ మహేశ్వరం మెడికల్ కళాశాల నిర్మాణంపై రేవంత్ ప్రభుత్వం మౌనంగానే ఉన్నది. కాగా, ప్రభుత్వం ఇక్కడ నిర్మాణం చేపట్టకపోగా మెడికల్ కళాశాల, ఆస్పత్రిని ఎల్బీనగర్లో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి మారుస్తామని.. మరోవైపు కొడంగల్‌కు తరలిస్తామని ఇటీవల ప్రకటనలు చేస్తున్నది. దీంతో మహేశ్వ రం మెడికల్ కళాశాల, ఆస్పత్రి నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి.
ఫ్యూచర్‌సిటీని కాదని.. మరో ప్రాంతానికా?
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే.. కందుకూరు మండలంలో ఫ్యూచర్‌సిటీ నిర్మాణానికి శంకుస్థాపన చేసింది. మెడికల్ కళాశాలకు శంకుస్థాపన చేసిన మీర్ఖాన్పేట కూడా ఫ్యూచర్‌సిటీలో అంతర్భాగమే.
ఫ్యూచర్‌సిటీలో హెల్త్ యూనివర్సిటీనీ నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ, హెల్త్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న మెడికల్ కళాశాల, 400 పడకల ఆస్పత్రిని ఫ్యూచర్‌సిటీలో కాకుండా మరో ప్రాంతం లో నిర్మిస్తామని పూటకో మాట మాట్లాడుతుండడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్ని ప్రాంతాల వారికి అనువుగా ఉన్న మీర్ఖాన్పేటలో నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఫ్యూచర్‌సిటీపై ప్రేముంటే మీర్ఖాన్‌పేటలోనే నిర్మించాలి..
ఫ్యూచర్‌సిటీ నిర్మాణంపై ప్రభుత్వానికి ప్రేముంటే మీర్ఖాన్‌పేటలోనే మహేశ్వరం మెడికల్ కళాశాల, 400పడకల ఆస్పత్రిని నిర్మించాలి. గత కేసీఆర్ ప్రభుత్వం ఫార్మాసిటీలో భాగంగానే మెడికల్ కళాశాలను నిర్మించాలని నిర్ణయించింది. ప్రభుత్వం ఫ్యూచర్‌సిటీలో హెల్త్ యూనివర్సిటీ నిర్మిస్తామని చెబుతున్నా.. హెల్త్ యూనివర్సిటీలో భాగమైన మెడికల్ కళాశాల, 400 పడకల ఆస్పత్రిని ఎందుకు ఇతర ప్రాంతానికి తరలించాలనుకుంటుందో సమాధానం చెప్పాలి. మెడికల్ కళాశాలను కందుకూరు మండలంలో నిర్మిస్తే జిల్లాలోనే మిగతా నియోజకవర్గాలకు కూడా అనువుగా ఉం టుంది. కానీ, కాంగ్రెస్ సర్కార్ మెడికల్ కళాశాల ఆస్పత్రి నిర్మాణాలపై పూటకో మాట మాట్లాడు తున్నది.
-సబితాఇంద్రారెడ్డి, మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే

మూడేండ్లుగా సాగని పనులు..
జిల్లాకు కేటాయించిన మెడికల్ కళాశాల, 400 పడకల ఆస్పత్రిని జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు అనువుగా ఉన్న మీర్ఖాన్పేట వద్ద 2023లో గత కేసీఆర్ ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. టెండర్లూ పూర్తయ్యాయి. పనులు ప్రారంభించే సమయంలోనే అసెంబ్లీ ఎన్నికలొచ్చి.. అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రావడంతో ఆస్పత్రి నిర్మాణానికి గడ్డుకాలం వచ్చింది. రేవంత్ సర్కార్ గత కేసీఆర్ ప్రభు త్వం చేపట్టిన పనులను కావాలనే పక్కన పెడుతుండడం తో మహేశ్వరం మెడికల్ కళాశాల నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి. అంతేకాకుండా గత మూడేండ్లుగా అరకొర వసతులతో అద్దె భవనంలో కొనసాగుతుండడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల అద్దె చెల్లించకపోవటంతో యాజమాన్యం కళాశాలకు తాళం కూడా వేసింది.