ప్రభుత్వం నుంచి తమ భూములను కాపాడుకోవడానికి మండలంలోని మొండిగౌరెల్లి గ్రామ రైతులు సంఘటితమయ్యారు. పచ్చని పొలాల్లో పరిశ్రమల ఏర్పాటు వద్దేవద్దు అంటూ నినదించారు. ప్రభుత్వానికి సెంటు భూమి కూడా ఇచ్చేదిలేదని తేల్చి చెప్పారు. ఇకపై రైతుల భూముల జోలికొస్తే ఊరుకునేదిలేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. భూములను కాపాడుకోవడం కోసం ఎంతటి పోరాటానికైనా వెనుకాడబోమని గ్రామస్తులు, రైతులు, యువకులు ప్రతినబూనారు. లగచర్ల మాదిరిగా గ్రామంలో ఉద్యమం చేయడానికి సిద్ధం కావాలని మూకుమ్మడిగా తీర్మానించారు. గ్రామంలో నాయకులు తాండ్ర రవీందర్, బండిమీది కృష్ణ, అంజయ్యయాదవ్, మేకల యాదగిరిరెడ్డి తదితరుల ఆధ్వర్యంలో మంగళవారం రైతులంతా ఒకచోట సమావేశమయ్యారు. ఫ్యూచర్ సిటీలో భాగంగా గ్రామంలోని 19, 68, 127 సర్వే నంబర్లలో ఉన్న అసైన్డ్‌తో పాటు మరికొంత పట్టా భూమి కలిపి మొత్తం 821.11 ఎకరాల భూమిలో పారిశ్రామికవాడను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. రైతుల ఆమోదం లేకుండానే పచ్చని పంట పొలాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయడం ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. సాగు భూములను ప్రభుత్వం తీసుకోవడాన్ని రైతులు తప్పుపడుతున్నారు. ప్రభుత్వ తీరును గ్రామస్తులు, రైతులు తీవ్రంగా ఖండిస్తున్నారు.
– యాచారం/ఇబ్రహీంపట్నం, మార్చి 18
గ్రామస్తులు, మహిళలు, రైతులు, యువకులు భూసేకరణకు వ్యతిరేకంగా ఉద్యమం లేవదీశారు. గ్రామం నుంచి డీసీఎంతో పాటు, కార్లు, ద్విచక్రవాహనాలపై పెద్దఎత్తున ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ను ముట్టడించారు. తమ భూములను పరిశ్రమలకు తీసుకోవద్దని, భూసేకరణ కోసం విడుదల చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. అనంతరం రైతుల సమస్యలను పరిష్కరించాలని ఆర్డీవో అనంతరెడ్డికి రైతులు, పలు పార్టీల నాయకులు వినతిపత్రాన్ని అందజేశారు. రాళ్లు, గుట్టలతో కూడిన బీడు భూములను ప్రభుత్వానికి ఇవ్వాలని ఆర్డీవో సూచించగా.. బీడు భూములు కావని, సాగుతో కూడిన భూములని రైతులు ఆయనకు విన్నవించారు. రెండు రోజుల్లో గ్రామాన్ని సందర్శించి భూములను పరిశీలించనున్నట్లు రైతులకు తెలిపారు.
అనంతరం మండల తహసీల్దార్ కార్యాలయాన్ని సైతం ముట్టడించారు. కొద్దిసేపు కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. అనంతరం తహసీల్దార్ అయ్యప్పకు రైతులు వినతిపత్రం అందజేశారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని తహసీల్దార్ రైతులకు తెలిపారు. రాజకీయాలకతీతంగా గ్రామస్తులమంతా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కలెక్టర్ కార్యాలయం, సెక్రటేరియట్లను కూడా ముట్టడిస్తామన్నారు. తమ గ్రామాన్ని ఫ్యూచర్ సిటీలో కలపాలని వినతిపత్రాలు ఇస్తే.. గ్రామంలో ఉన్న రైతుల భూములను లాక్కునేందుకు రేవంత్ సర్కారు ప్రయత్నాలు చేస్తున్నదని.. వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని హెచ్చరించారు. ఏది ఏమైనా గ్రామంలో సెంటు భూమిని కూడా ఇచ్చేదిలేదని వారు తేల్చి చెప్పారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులే తగిన బుద్ధి చెబుతారని వారు పేర్కొన్నారు.
గ్రామంలోని పచ్చని పంట పొలాలను పారిశ్రామిక పార్కుల పేరుతో లాక్కుంటామని చూస్తే ఊరుకునేది లేదు. మా గ్రామంలో 100 మందికి పైగా రైతులందరం సమావేశం ఏర్పాటు చేసుకుని తహసీల్దార్, ఆర్డీవోలకు వినతిపత్రాలు సమర్పించాం. మా భూముల కోసం అవసరమైతే మా ప్రాణాలైనా తీసుకుంటాం. కన్నతల్లిలాంటి మా భూములను మాత్రం ఇచ్చేదిలేదు.
– బొరిగ యాదయ్య, రైతు, మొండిగౌరెల్లి
రైతుల భూముల్లో బలవంతంగా భూసేకరణ ప్రక్రియను కొనసాగిస్తే మొండిగౌరెల్లిలో మరో లగచర్ల ఘటన పునరావృతం అవుతుంది. అధికారులు భూసేకరణ, సర్వేల కోసం గ్రామానికి వచ్చే అధికారులను గ్రామం నుంచి తరిమితరిమి కొడతాం. అధికారులు, ప్రభుత్వం రైతులపై ఎంత ఒత్తిడి చేసినా భూములను వదులుకోవడానికి సిద్ధంగా లేం. బలవంతంగా భూములు లాక్కుంటే గ్రామంలో తీవ్ర పరిణామాలు చవి చూడాల్సి వస్తుంది. సాగు భూములు వదులుకొని ఎలా జీవించాలి. లగచర్ల రైతుల స్ఫూర్తితో ఉద్యమాలను ఉధృతం చేస్తాం. రైతుల భూములను కాపాడుకుంటాం.
– గూడాల వెంకటేశ్, మొండిగౌరెల్లి
మా తాతల కాలం నుంచి భూమిని నమ్ముకుని జీవిస్తున్నాం. వ్యవసాయం చేసుకుని బతుకుతున్న మాలాంటి వారికి ఉన్న భూముల్లో అనవసరమైన కంపెనీలు ఏర్పాటు చేసి మా జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తామంటే సహించేదిలేదు. మా భూములు మా సొత్తు.. ఎవడు వచ్చినా ఉరికించికొడతాం.. భూములను కాపాడుకుంటాం.
– మండల బాలకృష్ణ, మొండిగౌరెల్లి
గ్రామంలో పరిశ్రమల ఏర్పాటు కోసం అక్రమంగా భూసేకరణ చేస్తే ఊరుకునేదిలేదు. పారిశ్రామికవాడకు సెంటు భూమిని కూడా ఇవ్వం. పోలీసుల కేసులు, అధికారుల బెదిరింపులకు భయపడేదిలేదు. రైతులతో కలిసి ఎంతటి ఉద్యమానికైనా వెనుకాడేదిలేదు. సాగు చేసుకునే భూములను వదులుకునే ప్రసక్తేలేదు. ప్రభుత్వం వెంటనే భూసేకరణను ఉపసంహరించుకోవాలి. లేదంటే ఆందోళనలు తప్పవు. రైతులతో పెట్టుకుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా నష్టపోతుంది. రేవంత్‌రెడ్డి సర్కారుకు త్వరలో రైతులే తగిన బుద్ధి చెప్పడం ఖాయం. తక్షణమే భూసేకరణ నోటిఫికేషన్‌ను రద్దు చేసుకోవాలి.
– తాండ్ర లక్ష్మమ్మ ఎంపీటీసీ, మొండిగౌరెల్లి