ఆదిబట్ల, అక్టోబర్ 28 : తన పేరుపై ఉన్న భూమి తనకు తెలియకుండానే వేరొకరి పేరుపై రిజిస్ట్రేషన్ కావడంతో బాధిత మహిళా రైతు సోమవారం జరిగిన ప్రజావాణిలో కలెక్టర్‌ను కలిసి తనకు న్యాయం చేయాలని వేడుకున్నది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచాల మండలం బండలేమూర్ గ్రామానికి చెందిన కొట్టం యాదమ్మ (భర్త సాయిలు)కు సర్వే నం.903లో 2ఎకరాల26గుంటలు, 906లో 6ఎకరాల14గుంటలు మొత్తం 9 ఎకరాల భూమి ఆన్లైన్లో నమోదై ఉన్నది. 1962 నుంచి కబ్జాలో ఉంటూ సాగు చేసుకుంటున్నారు. ఇప్పటివరకు ప్రతి పహణీ, రికార్డుల్లో యాదమ్మ పేరు వస్తున్నది. కానీ గత వారం రోజుల క్రితం వరకు ఆన్లైన్లో ఆమె పేరుతో ఉన్న భూమి సర్వే నం.903 నుంచి 2ఎకరాల8గుంటలు, సర్వే నం.906లో ఒక ఎకరా21 గుంటలు మొత్తం కలిపి 3ఎకరాల29 గుంటల భూమి ఆమెకు తెలియకుండానే వేరొకరి పేరుపై పట్టామార్పిడి జరిగింది.
మంచాల తహసీల్ధార్ కార్యాలయంలో సిబ్బంది చేతివాటంతో ఆన్లైన్లో ఉన్న రైతులకు తెలియకుండానే తొలగించి వేరొక్కరి పేర్లపై భూములు మారుస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై మంచాల తహసీల్దార్‌ను సంప్రదించినా పొంతన లేని మాటలు చెప్పి తప్పించుకుంటున్నారని వారు తెలిపారు. దీంతో యాదమ్మ తదితరులు సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ దృష్టికి తీసుకుపోయారు. ఈ విషయమై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని కలెక్టర్ ఇబ్రహీంపట్నం ఆర్డీవోను ఆదేశించారు.
ప్రజావాణి అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా వాటిని వెంటనే పరిష్కరించాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి కలెక్టర్ శశాంక జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, జిల్లా రెవెన్యూ అధికారి సంగీతతో కలిసి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలు అందించే వినతులకు సంబంధిత శాఖల అధికారులు తక్షణమే స్పందిస్తూ వెంటనే పరిష్కరించాలన్నారు. అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి అర్జీని ఆయా శాఖల అధికారులు పరిశీలించి పరిష్కారం కోసం కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రజావాణికి 60 అర్జీలు రాగా.. రెవెన్యూశాఖకు సంబంధించి 42, ఇతర శాఖలకు 18 వచ్చాయని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ అధికారులు, తహసీల్దార్లు, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు ఉన్నారు.