వికారాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): జిల్లాలోని తాండూరు, వికారాబాద్, కొడంగల్, పరిగి నియోజకవర్గాల్లో అక్రమ మైనింగ్ జరుగుతున్నా జిల్లా గనుల శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అక్రమమని తెలిసినా అనుమతులిస్తూ మామూళ్ల మత్తులో జోగుతున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా అక్రమ మైనింగ్ కార్యకలాపాలపై ఫిర్యాదు చేస్తే తమకు సం బంధంలేదంటూ మైనింగ్, రెవెన్యూ అధికారులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారని మండిపడుతున్నారు. తాండూరులో ఎప్పుడో లీజు పొంది, దాని గడువు ముగిసినా ఇంకా గనుల తవ్వకాలు జరుపుతున్న వారికి అధికారులు వత్తాసు పలుకుతున్నారని సమాచారం. అధికారులు కేవలం మైనింగ్ దందాకు అనుమతులివ్వడం తప్ప.. వారు చేసే ది అక్రమమా..? లేదా..?అనే దానిపై కనీస విచారణ కూడా చేపట్టడంలేదని పలువురు ఆరోపిస్తున్నారు.
మా మూళ్లు ఇవ్వకపోతేనే తనిఖీలు చేస్తారని.. వారు అడిగినంత చెల్లిస్తే తనిఖీల ఊసే ఎత్తరని మైనింగ్ అధికారుల తీరుపై జిల్లాప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సుద్ద గనులు, ఎర్రమట్టి, కంకర దం దాలను అక్రమంగా నడిపించే వారు ఓవర్ లోడ్‌తో వాహనాలను తరలిస్తున్నా మైనింగ్, రవాణా, రెవెన్యూ శాఖ ల అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. ఇటీవల మీర్జాగూడ వద్ద ఓ వర్ లోడ్ కంకరతో వెళ్తున్న లారీ ఆర్టీసీ బస్సును ఢీకొట్టగా.. కంకర బస్సులోని ప్రయాణికులపై పడి 19 మంది మృతి చెందిన ఘోర రోడ్డు ప్రమాదం అనంతరం ప్రజల నుంచి ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం కావడంతో.. గత రెండు, మూడు రోజులుగా ఓవర్‌లోడ్‌తో వాహనాలు వెళ్లకుండా రెవెన్యూ, రవాణా శాఖ అధికారులు జాగ్రత్త పడుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది.
జిల్లాలోని కొడంగల్ సెగ్మెంట్, దుద్యాల మండలంలోని గౌ రారం రిజర్వ్ ఫారెస్ట్‌లో అధికారుల నిర్లక్ష్యంతో అక్రమ గనుల తవ్వకాలు జోరుగా సాగుతున్నాయన్న ఆరోపణలున్నాయి. గౌరారంలోని 2,000 ఎకరాలను ప్రభుత్వం రిజర్వ్ ఫారెస్ట్‌గా ప్రతిపాదించింది. అయితే ఆ భూములను కాపాడడంలో అట వీశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆ పొలాలను రెవెన్యూ అధికారులు పేదలకు పట్టాలిస్తూ పోయారు. గతంలో 2,000 ఎకరాలుగా ప్రతిపాదించిన గౌరారం ఫారెస్ట్ ప్రస్తుతం 180 ఎకరాలకు కుంచించుకుపోయింది. కాగా, అవి పట్టా భూములంటూ కొందరు కోర్టుకెళ్లడం, పట్టా భూమి కాదు అటవీ భూములంటూ అటవీ శాఖ అధికారులు కౌంటర్ దాఖలు చేశారు.
మైనింగ్ నిర్వాహకులు పట్టా భూములంటూ కోర్టుకెళ్లడంతో గౌరారం అటవీ భూములకు సంబంధించిన ఫైళ్లను పరిశీలించగా అసలు విషయం బయటపడిం ది. తదనంతరం గౌరారం రిజర్వ్ ఫారెస్ట్‌లో జరుగుతున్న అక్రమ గనుల తవ్వకాలను అధికారులు నిలిపేశారు. లీజు గడువు ముగిసినా రెన్యువల్‌కు మైనింగ్ నిర్వాహకులు దరఖాస్తు చేసుకోగా.. గనుల శాఖ అధికారులు లీజును రెన్యువల్ చేశారు. అటవీ భూములని తెలిసీ లీజును రెన్యువల్ చేయడం పై జిల్లా అటవీ శాఖ అధికారులు మైనింగ్ అధికారులకు ఇటీవల నోటీసులిచ్చారు. కోర్టులో స్టే ఉన్న సమయంలో మైనింగ్‌కు సంబంధించి రెన్యువల్ చేయడంపై మైనింగ్ అధికారుల పై విమర్శలున్నాయి. లీజు రెన్యువల్‌కు రూ. లక్షల్లో మైనింగ్ అధికారులు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి.
జిల్లాలో ఇసుక, ఎర్రమట్టి దందాను రెవెన్యూ, పోలీసు శాఖలకు చెందిన కొందరు అధికారులు దగ్గరుండి నడిపిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కో ఇసుక ట్రాక్టర్‌కు, ఒక్కో ఎర్రమట్టి లారీకి ఇంత చెల్లించాలని రేటు ఫిక్స్ చేసి మరీ వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. వికారాబాద్, పరిగి నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాల్లో ఎర్రమట్టి దందా రెవెన్యూ, పోలీసు అధికారుల కనుసన్నుల్లోనే జరుగుతున్నట్లు ఆరోపణలు పెద్ద ఎత్తున ఉన్నాయి.
ప్రభుత్వ, అసైన్డ్ భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండానే ఎర్రమట్టిని తరలిస్తున్నా వారు మామూళ్ల మత్తులో జోగుతూ పట్టించుకోవడంలేదనే ఆరోపణలున్నాయి. వికారాబాద్ సెగ్మెంట్లోని ఓ మండలంలో పనిచేసే ఓ రెవెన్యూ ఉద్యోగి ఉదయం తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తూ.. రాత్రయితే అక్రమ ఎర్రమట్టి తరలింపు జరిగే ప్రాంతాల్లో ఉంటూ దగ్గరుండి నడిపిస్తున్నారనే ప్రచారం జరుగుతున్నది.
ఈ విషయం సదరు తహసీల్దార్‌కు తెలిసినా పట్టించుకోవడంలేదని.. ఈ వసూళ్లలో ఆయనకు వాటా ఉన్నదనే ప్రచారంలో ఉన్నది. ఇటీవల పరిగి సెగ్మెంట్లోని ఓ మండలంలో అక్రమంగా ఎర్రమట్టి దందా నడిపిస్తుండగా టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేయగా టాస్క్‌ఫోర్స్ పోలీసులతో అక్రమ దందా చేసే నిర్వాహకుడు వాగ్వాదానికి దిగినట్లు తెలిసింది. స్థానిక ప్రజాప్రతినిధి టాస్క్‌ఫోర్స్ పోలీసులకు ఫోన్ చేసి బెదిరించగా.. అంతే దీటుగా టాస్క్‌ఫోర్స్ అధికారి సమాధానమిచ్చినట్లు జిల్లాలో జోరుగా చర్చ జరుగుతున్నది.