తుర్కయాంజాల్, నవంబర్ 24 : రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చెరువుల్లో చేప పిల్లలను అత్తెసరుగా వదులుతున్నది. గత కేసీఆర్ ప్రభుత్వం మత్స్యకారుల అభ్యున్నతికి ఎంతో కృషి చేసింది. మత్స్యకారుల ఉపాధి కోసం ప్రతి ఏడాది తుర్కయాంజాల్ మాసబ్‌చెరువులో లక్షా40 వేల చేపలను ఉచితంగా వదిలింది. అంతేకాకుండా గంగపుత్రులకు వలలు, మోపెడ్ వాహనాలను సబ్సిడీపై అందించి ఆదుకున్నది. కానీ, రేవంత్ సర్కార్ తమకు ఈ ఏడాది కేవలం 60,000 చేప పిల్లలను మాత్రమే పంపిణీ చేస్తామని చెబుతున్నదని..
అది కూడా శేరిగూడకు వచ్చి వాటిని తీసుకెళ్లాలని అధికారులు పేర్కొంటున్నారని పలువురు మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ హయాంలో చెరువుల వద్దకే వచ్చి చేప పిల్లలను వదిలిన విషయాన్ని గుర్తు చేసుకుంటు న్నారు. కాగా ఆదివారం తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధి మాసబ్ చెరువులో ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్‌తో కలిసి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి చేప పిల్లలను చెరువులో వదులగా.. పలువురు మత్స్యకారులు 60,000 చేప పిల్లలను చెరువులో వదిలితే తమకు ఉపాధి ఎలా అని నిట్టూర్చారు.