మంచాల, మార్చి 12 : మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న పల్లెప్రకృతి వనాలు నందనవనాన్ని తలపిస్తున్నాయి. సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో ఏర్పాటు చేసిన పల్లెప్రకృతి వనాలతో గ్రామాలకు సరికొత్త శోభ వచ్చింది. తీరొక్క మొక్కలతో ఏర్పాటైన ఈ వనాలు ప్రజలకు ఆహ్లాదంతోపాటు స్వచ్ఛమైన గాలిని ఇస్తున్నాయి. మండలంలోని ఆగపల్లిలో ఎకరా ఇరవై గుంటల్లో దాదాపుగా మూడు వేలు మొక్కలు, మంచాలలో ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన వనంలో వివిధ రకాల పూలు, పండ్లు, నీడనిచ్చే ఐదు వేల మొక్కలను నాటారు. రెండు వనాల్లో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి చిట్టడవిని తలపిస్తున్నాయి. ప్రకృతి వనాల్లోకి పశువులు, వ్యక్తులు వెళ్లకుండా చుట్టూ గ్రామ పంచాయతీ నిధులతో ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేశారు. పల్లెప్రకృతివనాల్లో ఉదయం, సాయంత్రం సమయాల్లో పెద్దలు, పిల్లలు వాకింగ్ చేసేందుకు అనువుగా ఉండేందుకు వాకింగ్ ట్రాక్‌ను కూడా ఏర్పాటు చేశారు. మొ క్క ల సంరక్షణపై అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. మొక్కలకు ఉదయం, సాయంత్రం సమయాల్లో నీటిని అందించేందుకు ప్రత్యేకంగా వనసేవకులను కూడా నియమించారు. ఎండలు పెరుగుతుండటంతో మొక్కలకు ప్రతిరోజూ గ్రామ పంచాయతీ ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నారు. తెలంగాణకు హరితహరంలో భాగంగా మంచాల, ఆగపల్లి గ్రామాల్లో రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కలు ఏపుగా పెరిగి వాహనదారులకు ఆహ్లాదాన్ని ఇస్తున్నాయి. మంచాలలో ఐదు ఎకరాల విస్తీర్ణంలో పల్లెప్రకృతివనాన్ని ఏర్పాటు చేసి ఐదు వేల మొక్కలను నాటారు. అందులోని దాదాపుగా అన్ని చెట్లు ఏపుగా పెరిగి చిట్టడవిని తలపిస్తున్నది. ఉదయం, సాయంత్రం సమయాల్లో స్థానికులు, చిన్నారులు వాకింగ్ చేయడంతోపాటు వృద్ధులు సేదతీరుతున్నారు. ఈ వనంలోకి వచ్చే వారికి ఇబ్బందుల్లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. తాగునీటితో ఇతర వసతులను ఏర్పాటు చేశారు.
ఆగపల్లి పల్లెప్రకృతివనంలో మూడు వేల వరకు వివిధ రకాల మొక్కలను నాటగా.. అవి ఏపుగా పెరిగి సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. ఆ మొక్కలకు ప్రతిరోజూ నీటిని అం దిం చేందుకు వీలుగా ప్రత్యేకంగా బోరును తవ్వించాం, వన సంరక్షుడు ఆ బోరు నీటిని మొక్కలకు ఉదయం, సాయంత్రం సమయాల్లో అందిస్తున్నాడు. అంతేకాకుండా గ్రామ పంచాయతీ సిబ్బంది గ్రామంలోని రోడ్డుకు ఇరువైపులా నాటిని మొక్కలకు ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నారు. గ్రామాభివృద్ధికి స్థానికులు, అధికారులు, వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు ఎంతో సహకరిస్తున్నారు.
– జంగయ్య యాదవ్, సర్పంచ్ ఆగపల్లి
మంచాల పల్లెప్రకృతి వనంలో తీరొక్క మొక్కలను నాటగా అవి ఏపుగా పెరిగి సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. దాదాపుగా ఐదు వేల వరకు వివిధ రకాల మొక్కలను నాటి.. వాటి సంరక్షణకు వన సేవకుడిని కూడా నియమించడం జరిగింది. ఉదయం, సాయంత్రం సమయాల్లో అతడు నీటిని అందిస్తున్నాడు. స్థానికులు వాకింగ్ చేసేందుకు వీలుగా అందులో వాకింగ్ ట్రాక్‌ను కూడా ఏర్పాటు చేశాం. గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తా.
-జగన్‌రెడ్డి, సర్పంచ్ మంచాల