మండలంలోని కాకునూరు-లేమామిడి గ్రామాల మధ్య ఉన్న వంతెన నిర్మాణానికి గ్రహణం వీడడం లేదు. దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న లేమామిడి, కాకునూరు, నిర్దవెల్లి గ్రామాల ప్రజలకు.. పాలకుల తీరుతో అడి ఆశగానే మారుతున్నది. బిల్లులు రాలేదని కాం ట్రాక్టర్ పనులను మధ్యలోనే నిలిపేయడంతో వంతెన నిర్మాణానికి మోక్షమెప్పుడో? అంటూ నిట్టూరుస్తున్నారు. కేవలం మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామానికి వర్షం వచ్చి వాగు పారిందంటే 12 కిలోమీటర్లు అదనంగా ప్రయాణించాల్సి వస్తున్నదని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి పనుల్లో వేగం పెంచాలని కోరుతున్నారు. -కేశంపేట, జూన్ 7
మండలంలోని లేమామిడి, కాకునూరు గ్రామాల మధ్య ఉన్న వంతెన నిర్మాణానికి ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథ కం ద్వారా గత కేసీఆర్ ప్రభుత్వం రూ. 5.33 కోట్ల నిధులను మంజూరు చేయడంతో.. హైదరాబాద్కు చెందిన కాంట్రాక్టర్ కోటేశ్వర్రెడ్డి ఆ పనులను దక్కించుకున్నాడు. బీఆర్ఎస్ హయాంలో పనులు వేగంగా జరుగగా.. అప్పుడే ఎన్నికల కోడ్ రావడం.. తదనంతరం ప్రభుత్వం మారడంతో ఆ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయా యి. పెద్ద మొత్తంలో డబ్బులను పెట్టి పనులను చేపట్టినా బిల్లులు రాకపోవడంతో ఆ కాంట్రాక్టర్ మధ్యలోనే నిలిపివేసినట్లు ప్రచారం జరుగుతున్నది.
వాగు పారితే రాకపోకలు బంద్..
వర్షాకాలంలో వానలు పడి వాగు పారితే లేమామిడి-కాకునూరు, నిర్దవెల్లి-కాకునూరు గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిస్థాయిలో నిలిచిపోతాయి. నిర్దవెల్లి నుంచి కాకునూరుకు వెళ్లాలంటే కేవలం 4 కిలోమీటర్ల దూరం ఉంటుంది. వాగు పారుతున్న సమయంలో నిర్దవెల్లి నుంచి కాకునూరుకు వెళ్లాలంటే లేమామిడి, కేశంపేట, వయా కాకునూరుకు వెళ్లాల్సి ఉంటుందని.. తద్వారా 12 కిలోమీటర్లు అదనంగా ప్రయాణించాల్సి వస్తున్నదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వంతెనను నిర్మిస్తే కాకునూరు, కొండారెడ్డిపల్లి, పోమాల్పల్లి, ఇప్పలపల్లి వయా షాద్నగర్ రాకపోకలకు ఈ మార్గం మరింత సులభతరంగా ఉంటుందని ప్రజలు చెబుతున్నారు.
కాంట్రాక్టర్ మధ్యలోనే ఆపేశాడు..
బీఆర్ఎస్ హయాంలో వంతెన నిర్మాణ పనులు ప్రారం భం కావడంతో ఎంతో సంతోషించాం. అయితే, ఆ తర్వాత ఏమి జరిగిందో తెలియదు కానీ, ఆ పనులను మధ్యలోనే కాంట్రాక్టర్ నిలిపేశాడు. మా గ్రామం నుంచి కాకునూరుకు నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుంది. వాగు పారుతున్న సమయంలో 12 కిలోమీటర్ల వరకు అదనంగా వెళ్లాల్సి వస్తున్నది. అధికారులు స్పందించి వంతెన నిర్మాణ పనులను త్వరగా పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలి.
– శ్రీనివాస్, కాకునూరు
పాలకులు మారితే పనులను ఆపుతారా..?
గత కేసీఆర్ పాలనలో వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అప్పట్లో పనుల్లో వేగం పుంజుకున్నా ప్రభుత్వం మారడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. వాగు పై వంతెన నిర్మించకపోవడంతో పవిత్రమైన మహాలింగేశ్వరస్వామి ఆలయానికి వచ్చే భక్తులకు కూడా ఇబ్బందులు తప్పడంలేదు. పాలకులు మారితే పనులను ఆపడం సరికా దు. ప్రభుత్వం స్పందించి వెంటనే ఆ పనులను ప్రారంభించాలి.
– కోటేశ్వర్, మాజీ ఎంపీటీసీ, కాకునూరు
నోటీసులు అందజేశాం..
వంతెన పనులను చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం. పనులను నిలిపేసిన సంబంధిత కాంట్రాక్టర్కు నోటీసులు అందజేశాం. పూర్తిస్థాయిలో నిధులు రాకపోవడంతోనే పనులను నిలిపివేసినట్లు కాంట్రాక్టర్ చెప్పారు. ఈ విషయమై సంబంధిత అధికారులతో మాట్లాడి నిధుల మంజూరుకు చర్యలు తీసుకున్నాం.
– హేమంత్, ఇన్చార్జి డీఈ, షాద్నగర్