వికారాబాద్/మర్పల్లి, సెప్టెంబర్ 24 : పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఏ ఒక్కరిపైనా కేసుల్లేవని.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో దళితులు, అమాయకులపై కేసులు పెట్టి వేధిస్తున్నారని బీఆర్ఎస్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మె తుకు ఆనంద్ మండిపడ్డారు. మంగళవారం ఉదయం పట్లూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రవీణ్, నవీన్‌లను ఓ కేసు విషయంలో మర్పల్లి పోలీసులు అరెస్టు చేయడంపై బీఆర్ఎస్ నాయకులు ఠాణా ఎదుట ఆందోళన చేశారు.
దళితులు, బీఆర్ఎస్ నాయకులపై పోలీసులు అక్రమంగా కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారని మండి పడ్డారు. పోలీసుల జులుం నశించాలని నినాదాలు చేశారు. కాగా మాజీ ఎమ్మెల్యే ఆనంద్ పోలీసులతో మాట్లాడేందుకు ఠాణాలోకెళ్లగా.. కాంగ్రెస్ నాయకులు అతడి ని ఎందుకు లోనికి పంపించారని ఆందోళన చేపట్టడంతో కొద్దిసేపు ఘర్షణ వాతావ రణం ఏర్పడింది. పోలీసులు ఇరు పార్టీల వారిని సముదాయించి బయటికి పంపించారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఆనంద్ విలేకరులతో మాట్లాడుతూ మర్పల్లి ఎస్ఐ సురేశ్ గత మూడు నెలలుగా కక్షపూరితంగా బీఆర్ఎస్ కార్యకర్తలపై కేసులు పెట్టి చిత్రహింసలకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ అధికారంలో ఉన్నదని అడ్డగో లుగా బీఆర్ఎస్ నాయకులపై కేసులు పెట్టించడం మంచిది కాదని కాంగ్రెస్ నాయకులకు సూచించారు. ఎవ్వరికీ అధికారం శాశ్వతం కాదన్నారు.
మర్పల్లిలో రోడ్డు దారుణంగా ఉన్నదని.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు దాటినా ఇంకా రోడ్డుకు వికారాబాద్ ఎమ్మెల్యే, స్పీకర్ ప్రసాద్‌కుమార్ మరమ్మతులు చేయించలేదని ఆరోపించారు. మర్పల్లి ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు.. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ మధుకర్, మాజీ వైస్ ఎంపీపీ మోహన్‌రెడ్డి, అశోక్, రాచయ్య, మధుకర్, మిత్ర, గౌస్, గఫార్, సొసైటీ డైరెక్టర్ యాదయ్య, దయాకర్ తదితరులు పాల్గొన్నారు.