ధారూరు, ఏప్రిల్ 18 : మొక్కజొన్న కొనుగోలు కేంద్రా ల ఏర్పాటులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడంతో రైతులు దళారుల చేతుల్లో తీవ్రంగా నష్టపోతున్నారని.. సర్కార్ ప్రతి గింజనూ కొనాల్సిందేనని స్పష్టం చేశారు. శనివారం ఆమె మండలంలోని నాగుసాన్పల్లి, తరిగోపుల గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్, బీఆర్ఎస్ నాయకులతో కలిసి పర్యటించి పరిశీలించా రు. నాగుసాన్‌పల్లిలో సీసీ రోడ్డుపై ఆరబెట్టిన మొక్కజొన్న రైతులతో ఆమె మాట్లాడగా.. ప్రస్తుతం 20 శా తం మాత్రమే పంటను తీసుకొచ్చామని.. మిగతా 80 శాతం పంట పొలాల్లోనే ఉందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సబితారెడ్డి మాట్లాడుతూ.. మట్టిని నమ్ముకుని బతికే రైతన్నకు కేసీఆర్ హయాంలో ఎంతో భరో సా ఉండేదని గుర్తు చేశారు. రేవంత్ సర్కార్ వచ్చి 28 నెలలు దాటినా అన్నదాతల అవస్థలు మాత్రం తీర్చడంలేదని ఆరోపించారు. ప్రభుత్వం మొక్కజొన్న కొనుగో లు కేంద్రాలను ఇంకా ప్రారంభించకపోవడంతో రైతు లు దళారుల చేతుల్లో తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు అలవి కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చి.. నేడు రైతులు పండించిన మొక్కజొన్నకు కనీస మద్దతు ధర కూడా దిక్కులేదని దుయ్యబట్టారు.
పంటను అమ్ముకునేందుకు కేంద్రాలు లేకపోవడంతో అన్నదాతలు రోడ్లపై.. ఆరుబయట వాటిని ఆరబోస్తూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ప్రభుత్వం మొద్దునిద్రను వీడి వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలన్నారు. కాగా, జిల్లా కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడగా.. ఇంకా ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేవని.. రెండు రోజుల్లో కేంద్రాలు ప్రారంభిస్తామని తెలిపారన్నారు. ఇంతలోనే ధారూరులో కొనుగోలు కేంద్రం ప్రారంభం అని వాట్సాప్‌లో న్యూస్ రావడంతో ప్రభుత్వం ఆడుతున్న డ్రామాగా ఆమె మండిపడ్డారు.
అనంతరం బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షు డు డాక్టర్ మెతుకు ఆనంద్ మాట్లాడుతూ.. ధారూరు మండలంలోనే మొక్కజొన్న, జొన్న పంటలను దాదాపుగా 5 వేల ఎకరాల్లో రైతులు సాగు చేస్తారన్నారు. ఎన్నికల ముందు రైతు డిక్లరేషన్‌లో ప్రతి పంటకూ బోనస్ ఇస్తామన్న కాం గ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు బోన స్ ఎగ్గొట్టి ఆ మాటను బోగస్ చేసిందని ఎద్దేవా చేశారు. అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పం టను నిల్వ చేసుకునే వసతి లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతులు దళారులకు తక్కువ ధరకు విక్రయించిన తర్వాత కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తే ఏమి ఉపయోగమని అధికారులను ప్రశ్నించారు.
కార్యక్రమంలో టీఎస్ఈడబ్ల్ల్యూఐడీసీ మాజీ చైర్మన్ నాగేందర్‌గౌడ్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్ పటేల్, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ విజయ్‌కుమార్, బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, నాయకులు వేణుగోపాల్‌రెడ్డి, రాము లు, లక్ష్మయ్య, బాల్‌రాజ్ నాయ క్, నర్సిములు, ప్రభాకర్‌రెడ్డి, గోపాల్, దేవేందర్ నాయక్, వెంకటయ్య, శ్రీశైలం, మహేశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ధారూరులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం..
బీఆర్ఎస్ నాయకులు రైతులను కలుస్తున్నారనే విషయం తెలుసుకుని మండల కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయంలో శనివారం అధికారులు హడావుడిగా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్ మాట్లాడుతూ.. వికారాబాద్ జిల్లాలోని ఐదు మండలాల్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని.. అందులో ధారూరు ఒకటని తెలిపారు. కార్యక్రమంలో వికారాబాద్ ఆర్డీవో వాసుచంద్ర, జిల్లా వ్యవసాయశాఖ అధికారి రాజారత్నం, ధారూరు ఎంపీడీవో నర్సిములు, తహసీల్దార్ సాజిదాబేగం, ఎంపీవో షఫిఉల్లాఖాన్, మండల వ్యవసాయశాఖ అధికారి సూర్యప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.