రంగారెడ్డి, జూలై 30 (నమస్తే తెలంగాణ): అర్హులైన ప్రతి రైతుకూ రుణమాఫీ అందేలా చర్యలు చేపట్టాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక అధికారులకు సూచించారు. రంగారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మంగళవారం కలెక్టర్ కె.శశాంక ప్రజాప్రతినిధులు, వ్యవసాయ అధికారులు, రైతుల ఆధ్వర్యంలో రుణమాఫీ రెండో విడుత నిధుల విడుదల కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొదటి, రెండో విడుతల రుణమాఫీ కార్యక్రమాలను రైతులు పండుగగా భావిస్తున్నారని పేర్కొన్నారు. జిల్లాలో మొదటి విడుతగా సుమారు 49,700 మంది రైతులకుగాను రూ.258.18 కోట్లు ప్రభుత్వం కేటాయించగా, రెండో విడుతలో సుమారు 22,915 మంది రైతులకు రూ.218.12 కోట్లు కేటాయించిందన్నారు. రెండు విడుతలు కలిపి సుమారు 72,615 మంది రైతులకు రూ.476.30 కోట్లు రుణమాఫీ పథకం ద్వారా ప్రభుత్వం జిల్లాకు వెచ్చించిందన్నారు.
ఇప్పటి వరకు జరిగిన రుణమాఫీలో సాంకేతిక కారణాలతో ఏ రైతుకైనా రుణమాఫీ అందకపోతే.. వారందరికీ మాఫీ వర్తించేలా వ్యవసాయ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు రుణమాఫీ అందకపోవడానికి గల కారణాలు తెలుసుకోవడానికి ఆధార్‌కార్డ్‌తో మండలాల్లో వ్యవసాయ అధికారులను సంప్రదించి తెలుసుకోవచ్చని సూచించారు.
జిల్లాస్థాయిలో, మండల వ్యవసాయ శాఖ స్థాయిల్లో రైతులకు గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు గ్రీవెన్స్‌లో పదకొండు వందల అప్లికేషన్స్ వచ్చాయని, వాటిని పరిష్కరించడానికి సంబంధిత అధికారులు చర్యలు చేపడుతున్నారని తెలిపారు. అర్హులైన ప్రతి రైతుకూ లబ్ది జరిగేలా వ్యవసాయ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.
బ్యాంక్ అధికారులనుద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రూ.లక్ష, లక్షన్నర లోపు రుణమాఫీకి అర్హులుగా ఉన్న రైతులకు తిరిగి మళ్లీ పంట రుణాలు ఇచ్చే విధంగా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గీతారెడ్డి, ప్రాథమిక సహకార సంఘం చైర్మన్లు, డైరెక్టర్లు, రైతుసంఘాల అధ్యక్షులు, బ్యాంకు అధికారులు, సంబంధిత అధికారులు, రైతులు పాల్గొన్నారు.