రంగారెడ్డి, జనవరి 5 (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లా వేదికగా రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించిన సీఎం అల్పాహార పథకం జిల్లాలో విజయవంతంగా సాగుతున్నది. అక్టోబర్ 6న ప్రారంభించిన ఈ పథకం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఓ వరంగా మారింది. దశలవారీగా ఈ పథకాన్ని విస్తరిస్తూ వస్తుండగా.. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో 365 పాఠశాలల్లో దిగ్విజయంగా అమలవుతున్నది.
ఇప్పటివరకు ఆయా పాఠశాలలకు చెందిన 7,60,938 మంది విద్యార్థులు బ్రేక్ఫాస్ట్ పథకాన్ని సద్వినియోగం చేసుకున్నారు. గతంతో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం గణనీయంగా పెరిగిందని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. పస్తుల నుంచి విముక్తి కల్పించిన పథకంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఖుషీగా ఉన్నారు.
ఈ ఏడాది అక్టోబర్ 6న మహేశ్వరం నియోజకవర్గంలోని రావిర్యాల జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో బ్రేక్ఫాస్ట్ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఆ రోజు నుంచి నేటి వరకు ఈ పథకం సక్సెస్ఫుల్గా అమలవుతున్నది. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనాన్ని అందిస్తున్నారు.
విద్యార్థుల కడుపు నింపి వారి మేధస్సు చురుకుగా పనిచేసేందుకు గత ప్రభుత్వ హయాంలోనే రాగి జావ, కోడిగుడ్డు, అరటి పండుతోపాటు సన్నబియ్యంతో మధ్యాహ్న భోజన పథకాన్ని అందించారు. అల్పాహారంతో మరింత పౌష్టికాహారాన్ని అందించవచ్చన్న ఉద్దేశంతో అల్పాహార పథకాన్ని కేసీఆర్ అమలు చేశారు. అల్పాహారంగా కిచిడీ, పొంగల్, ఉప్మా వంటి వాటిని విద్యార్థులకు అందిస్తున్నారు. ఇది విద్యార్థుల శారీరక, మానసిక ఎదుగుదలకు దోహదపడనుండడంతోపాటు బడిపిల్లల హాజరు శాతం పెరిగి డ్రాపౌట్స్ గణనీయంగా తగ్గాయని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు.
జిల్లాలో 881 ప్రాథమిక పాఠశాలల్లో 63వేల మంది, 181 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 15,500., 248 హైస్కూళ్లలో 65వేల మంది విద్యనభ్యసిస్తున్నారు. ప్రస్తుతం 365 పాఠశాలల్లో బ్రేక్ఫాస్ట్ పథకం అమలవుతుండగా.. ఇప్పటి వరకు 7,60,938 మంది విద్యార్థులు ఈ పథకంతో లబ్ధిపొందారు. రాత్రి భోజనం మినహా విద్యార్థులకు కడుపు నిండా ఆహారం ప్రభుత్వ పాఠశాలల్లోనే అందుతున్నది. ఒకప్పుడు పస్తులతో విద్యార్థులు పాఠశాలలకు హాజరయ్యేవారు. ఈ పథకంతో విద్యార్థులకు పస్తుల నుంచి విముక్తి కల్పించింది.

Untitled 1