కడ్తాల్, సెప్టెంబర్ 30: ఆటల పోటీల్లో క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తున్నదని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా-67జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కడ్తాల్, ఇబ్రహీంపట్నం, సరూర్‌నగర్, షాద్‌నగర్, రాజేంద్రనగర్, శంకర్పల్లి, శేరిలింగంపల్లి, మహేశ్వరం జోన్లకు చెందిన విద్యార్థులు పాల్గొనగా.. ఈ పోటీలను ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ జ్యోతి వెలిగించి ప్రారంభించి, క్రీడాకారుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పా టు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. క్రీడలు మానసిక, శారీరక వికాసానికి ఎంతో దోహదం చేస్తాయన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు క్రీడల్లో రాణించేందుకు ప్రభుత్వం పీఈటీలతో ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నట్లు వివరించారు. విద్యార్థులు చిన్నప్పటి నుంచే తమకు ఇష్టమైన రంగాన్ని ఎంచుకుని ఉన్నత శిఖరాలకు చేరాలని ఆకాంక్షించారు. ఇలాంటి టోర్నీలతో విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభ తెలుస్తుందన్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమంతో నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వసతులను కల్పిస్తున్నట్లు చెప్పారు. అనంతరం వాలీబాల్ పోటీల నిర్వహణకు ఎమ్మెల్యే వ్యక్తిగతంగా రూ.50 వేలను నిర్వాహకులకు అందజేశారు. సాయంత్రం వరకు జరిగిన పోటీల్లో బాలుర అండర్-17 విభాగంలో మొదటి స్థానంలో ఇబ్రహీంపట్నం, రెండోస్థానంలో మహేశ్వరం, అండర్-14 విభాగంలో తొలి స్థా నం లో కడ్తాల్, రెండోస్థానంలో షాద్‌నగర్ జట్లు నిలిచాయి. బాలికల అండర్-17 విభాగంలో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, అండర్-14 విభాగంలో తొలి, ద్వితీయ స్థానాల్లో కడ్తాల్, షాద్‌నగర్ జట్లు నిలిచినట్లు జోనల్ కార్యదర్శి భీముడునాయక్ వివరించారు. గెలుపొందిన జట్లకు ప్రజాప్రతినిధులు, అధికారులు ట్రోఫీలతోపాటు ప్రశంసా పత్రాలను అందజేశారు.
భక్తిభావాన్ని పెంచుకోవాలి
సమాజంలోని ప్రతి ఒక్కరూ భక్తిభావాన్ని పెంచుకోవాలని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. మండలంలోని అన్మాస్‌పల్లి గ్రామంలోని వీరాంజనేయస్వామి ఆలయంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నేనావత్ బిక్కూనాయక్, చిత్ర దంపతులు నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ కమ్లీమోత్యానాయక్, జడ్పీటీసీలు దశరథ్‌నాయక్, అనురాధ, విజితారెడ్డి, వైస్ ఎంపీపీ ఆనంద్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్‌గుప్తా, సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పరమేశ్, ఎంపీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, జోనల్ కార్యదర్శి భీముడునాయక్, రైతుబంధు సమితి మండల, గ్రామాధ్యక్షులు వీరయ్య, నర్సింహ, ఏఎంసీ డైరెక్టర్లు లాయక్‌అలీ, రమేశ్‌నాయక్, భిక్షపతి, గణేశ్‌గౌడ్, రాజేం దర్యాదవ్, రామచంద్రయ్య, తహసీల్దార్ షేక్ముంతాజ్, ఎంపీడీవో రామకృష్ణ, ఎంఈవో సర్దార్‌నాయక్, నోడల్ అధికారి జంగయ్య, పీడీలు భీముడు, చంద్రమోహన్, జ్యోత్స్న, జ్యోతి, సుధాకర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, బాబయ్య, సాబెర్, సుశీల, రాజు, నర్సింహారావు, రాధ, ప్రసాద్, విద్యార్థులు పాల్గొన్నారు.