రంగారెడ్డి, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపులార్) అలైన్‌మెంట్‌ను తక్షణమే మార్చాలని.. పాత అలైన్‌మెంట్‌నే కొనసాగించాలని కోరుతూ కందుకూరు ఆర్డీవో కార్యాలయం ఎదుట సోమవారం భూబాధితులు ఆందోళనకు దిగారు. వందల ఎకరాలున్న భూస్వాముల భూములను కాపాడేందుకే పేద, సన్న, చిన్న కారు రైతుల భూములను ట్రిపులార్‌కు బలిస్తారని అని పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఈ ధర్నాకు తలకొండపల్లి, మాడ్గుల, కేశంపేట తదితర గ్రామాలకు చెందిన రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు రాంచందర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉద్దేశపూర్వకంగానే ట్రిపులార్ పేరుతో పేదల పొట్ట కొట్టేందుకు.. వారి భూములను ఆక్రమించాలని చూస్తున్నారని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తమ బంధువులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేల భూములను కాపాడేందుకే పాత అలైన్‌మెంట్‌ను మార్చిందన్నారు.
ప్రభుత్వం స్పందించి 2013 భూసేకరణ చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా మొదట ప్రతిపాదించిన అలైన్మెంట్ ప్రకారమే ట్రిపులార్‌ను చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతుసంఘం ఆధ్వర్యం లో భూబాధితులను ఏకంచేసి రాను న్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను చేపడుతామని హెచ్చ రించారు.
మాడ్గుల, ఆమనగల్లు, తలకొండపల్లి, కేశంపేట, కొందుర్గు, ఫరూఖ్‌నగర్ మండలాల్లో అలైన్‌మెంట్‌ను మార్చడంతో వ్యవసాయాన్ని నమ్ముకుని జీవిస్తున్న వేలాది రైతులు భూములు కోల్పోయి రోడ్డున పడ్డే ప్రమాదం ఉన్నదన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కానుగుల వెంకటయ్య, ప్రజా సంఘాల నాయకులు కుమ్మరయ్య, శంకరయ్య, జంగారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ వెంకటస్వామి, గర్విపల్లి మాజీ ఎంపీటీసీ లక్ష్మయ్య, చెన్నంపల్లి మాజీ సర్పంచ్ శ్రీనివాస్, పలువురు భూ నిర్వాసితులు పాల్గొన్నారు.
Rr2
ఆర్డీవోకు తొమ్మిదిరేకుల రైతుల వినతి
కేశంపేట : తమ గ్రామంలోని వ్యవసాయ పొలాల మీదుగా నిర్మించ తలపెట్టిన ట్రిపులార్ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని కోరుతూ షాద్‌నగర్ ఆర్డీవో సరితకు మండలంలోని తొమ్మిదిరేకుల రైతులు వినతిపత్రం అందజేశారు. సోమవారం గ్రామం నుంచి పెద్ద సంఖ్యలో బయలుదేరిన రైతులు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఆర్డీవోకు అందజేసి మాట్లాడారు.
గ్రామంలోని పేదలు, చిన్న, సన్నకారు రైతులంతా వ్యవసాయాన్ని నమ్ముకొని జీవిస్తున్నామని.. తమ పచ్చని పొలాల మీదుగా ట్రిపులార్‌ను నిర్మిస్తే తమ పిల్లల భవిష్యత్తు ఏమిటని ప్రశ్నించా రు. గతంలో మూడుమార్లు అలైన్‌మెంట్‌ను మార్చారన్నారు. నిరుపేద కుటుంబాలకు చెందిన తమపై ప్రభుత్వం జాలి చూపి మా గ్రామాన్ని వదిలి గతంలో ప్రతిపాదించిన విధంగానే రోడ్డును నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. కాగా, స్పందించిన ఆమె వినతిపత్రాలను ఉన్నతాధికారులకు అందజేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ రంగయ్య, జంగయ్య, కృష్ణారెడ్డి, మహాలింగం, శ్రీనివాస్‌రెడ్డి, భీమయ్య, గోవర్ధన్‌గౌడ్, దేవానాయక్, వెంకట్‌రెడ్డి, బుచ్చిరెడ్డి పాల్గొన్నారు.
భూములిచ్చేందుకు రైతులు సిద్ధంగా లేరు
రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్‌పటేల్
నవాబుపేట/వికారాబాద్ : తమ భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్ఆర్ఆర్కు ఇవ్వబోమని నవాబుపేట మండలంలో భూములు కోల్పోతున్న రైతులు సోమవారం తేల్చిచెప్పారు. అనంతరం వారు వికారాబాద్ ఆర్డీవో వాసుచంద్రకు వినతిపత్రాన్ని అందజేశారు. ట్రిపులార్ బాధితులు పెద్ద సంఖ్యలో వికారాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట ధర్నా చేసి, అనంతరం ఆర్డీవో కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్‌పటేల్ మాట్లాడుతూ.. ఏ రైతు కూడా తమ భూములను ట్రిపులార్‌కు ఇచ్చేందుకు సుముఖంగా లేడని..ప్రభుత్వం మొండిగా వ్యవహరించి భూములను తీసుకోవాలని చూస్తే ఎంతడి పోరాటానికైనా సిద్ధమని తేల్చి చెప్పారు. ప్రభుత్వం పునరాలోచించి పాత అలైన్మెంట్ ప్రకారమే ట్రిపులార్‌ను నిర్మించాలన్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ చొరవ తీసుకుని రైతులకు న్యాయం చేయాలన్నారు. కార్యక్రమంలో వడ్ల నందు, చిట్టిగిద్ద, చంచల్పేట, దాదాపూర్, యావాపూర్ , పూడూరు మండలంలోని పలు గ్రామాల రైతులు పాల్గొన్నారు.