రంగారెడ్డి, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డిజిల్లాలో అన్యాక్రాంతమైన భూదాన్ భూముల లెక్కలు తేలడంలేదు. ఈ భూముల క్రయవిక్రయాలపై నిషేధం ఉన్నప్పటికీ జిల్లాలో వేలాది ఎకరాల భూములు చేతులు మారాయి. సర్వోదయ ఉద్యమంలో భాగంగా చేపట్టిన భూదాన్ ఉద్యమంలో జిల్లా నుంచి పెద్దఎత్తున భూస్వాములు ముందుకొచ్చి భూములను దానం చేశారు. కాని, ఆ భూములు అటు పేదలకు చెందకుండా, ఇటు బోర్డు ఆధీనంలో లేకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కొంతమంది పెద్దల చేతుల్లో ఉన్నాయి.
ఈ భూములు పెద్దఎత్తున అన్యాక్రాంతమయ్యాయని, ఇటీవల పలువురు కోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు సీరియస్‌గా తీసుకుని జిల్లాలోని భూదాన్ భూముల లెక్కలు తేల్చాలని, అలాగే, ఆ భూములు ఎవరి ఆధీనంలో ఉన్నాయో తేల్చాలని ఇప్పటికే పలుమార్లు జిల్లా కలెక్టర్‌ను ఆదేశించాయి. అయినప్పటికీ కొంతమంది రాజకీయ నేతల ఒత్తిళ్లు, ఇతరత్రా కారణాలతో ఆ భూములు వెలుగులోకి రావడంలేదు. తాజాగా, హైకోర్టు మరోసారి భూదాన్ భూముల లెక్కలు తేల్చాలని ఆదేశించడంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.
గతంలో ప్రభుత్వం భూదాన్ భూముల వివరాలను పూర్తిగా సేకరించి క్రయవిక్రయాలపై నిషేధిత జాబితాలో చేర్చింది. ముఖ్యంగా జిల్లాలోని హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఉన్న మండలాల్లో భూదాన్ భూములు పెద్దఎత్తున ఉన్నాయి. ఈ భూముల ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. ఈ నేపథ్యంలో ఈ భూములను కాజేయాలని ప్రయత్నాలు సాగుతున్నాయి. జిల్లా పరిధిలోని ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్‌మెట్, మహేశ్వరం, కందుకూరు, శంషాబాద్, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి తదితర మండలాల్లో భూదాన్ భూములను కబ్జా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్లాట్లుగా మార్చారు. చేవెళ్ల, షాద్‌నగర్ నియోజకవర్గాల్లో కూడా ఈ భూములు చేతులు మారాయి. వెంటనే ఈ భూములను లెక్కతేల్చి ప్రభుత్వపరం చేసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
రాజకీయ ఒత్తిళ్లతో ముందుకు సాగని గుర్తింపు
వేలాది ఎకరాల భూములు రాజకీయ నాయకులు, పలువురు ఉన్నతాధికారుల ఆధీనంలో ఉన్నాయి. ఈ భూములను బయటకు తీయకుండా అధికారుల ఒత్తిళ్లు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా ఈ భూములను గుర్తించేందుకు అధికారులు సాహసించడంలేదని ఆరోపణలొస్తున్నాయి. కాని, కోర్టులు మాత్రం పదేపదే భూదాన్ భూముల లెక్కలు తేల్చాలని ఆదేశిస్తున్నాయి. దీంతో ఈ భూముల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
మిగిలిన భూములపై కూడా కన్నేసిన అధికార పార్టీ నేతలు
బోర్డు ఆధీనంలో ఉన్న భూములను కూడా కాజేసేందుకు పలువురు రాజకీయపార్టీల నాయకులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. మాడ్గుల మండలంలోని ముద్విన్ గ్రామంలో ఉన్న భూమిని కాజేసేందుకు పెద్దఎత్తున ప్రయత్నాలు సాగుతున్నాయి. వివిధ గ్రామాల్లో మిగిలి ఉన్న భూములను ఎలాగైనా కైవసం చేసుకునేందుకు అధికార పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. ఈ భూములను పరిరక్షించడం కోసం వివిధ కోర్టుల్లో సుమారు 200 వరకు కేసులు కొనసాగుతున్నాయి. కాని, ఈ కేసుల్లో ప్రభుత్వం తమ వాదనలు వినిపించడం లేదనే ఆరోపణలొస్తున్నాయి. మరోవైపు గతంలో బోర్డులో పనిచేసిన పలువురు నేటికీ భూదాన్ భూములపై ఎన్ఓసీలు ఇస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ ఎన్ఓసీల ఆధారంగా రికార్డుల్లో తమ పేర్లను చేర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
జిల్లాలో 25వేల నుంచి 30వేల ఎకరాలు
రంగారెడ్డిజిల్లాలో 25వేల నుంచి 30వేల ఎకరాల వరకు భూదాన్ భూములున్నట్లు అధికారుల రికార్డుల్లో ఉన్నాయి. కాని, ప్రస్తుతం బోర్డు ఆధీనంలో 5వేల ఎకరాలు కూడా లేదు. ఈ భూములు అత్యధికంగా రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లో ఉన్నాయి. మహేశ్వరం మండలంలోని నాగారం గ్రామంలో సర్వే నం.181, 182లలో 50 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఉన్నది. ఈ భూమిని గతంలో ఓ ప్రజాప్రతినిధి, ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే కొనుగోలు చేసి ఈపీఐఎల్ కంపెనీకి ధారాదత్తం చేశారు. ఈ సంస్థ పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ఈ భూములను విక్రయించింది. ఈ భూములు భూదాన్ భూములకు చెందినవని పలువురు కోర్టుల్లో కేసులు వేశారు. దీంతో ఈ వివాదం రోజురోజుకూ తీవ్రమై అధికారుల మెడకు చుట్టుకుంటున్నది.
ఈ భూముల వ్యవహారంలో తలదూర్చుదామంటే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఉండటం వలన అధికారులు వెనుకంజ వేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. మహేశ్వరం మండలంలోని ఓ ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ చేతుల్లో మరో 50 ఎకరాల భూమి ఉన్నది. ఈ భూమిని మరో రియల్ ఎస్టేట్ వారు ప్లాట్లు చేసి విల్లాల నిర్మాణం చేపడుతున్నారు. అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని పిగ్లీపూర్ గ్రామంలో 70 ఎకరాల భూదాన్ భూములున్నాయి. ఈ భూములను కూడా గతంలో ఓ రియల్ ఎస్టేట్ సంస్థ ప్లాట్లుగా మార్చి విక్రయించింది. ఇదే మండలంలోని కుంట్లూరు గ్రామంలో మరో వంద ఎకరాల భూదాన్ భూమి ఉన్నది.
ఈ భూమి కూడా చేతులు మారింది. తారామతిపేటలో కూడా 70 ఎకరాల భూదాన్ భూమికి సంబంధించి ఉండగా, ఈ భూమి కూడా రియల్ ఎస్టేట్ సంస్థ చేతిలో ఉంది.యాచారం మండలంలోని తాటిపర్తి గ్రామంలో కూడా 250 ఎకరాల భూమిని కొంతమంది తమ పేర్లపై మార్చుకుని ఫార్మాసిటీలో పరిహారం పొందారు. కందుకూరు మండలంలో కూడా సుమారు 20 ఎకరాల భూమిని అధికార పార్టీకి చెందిన ఓ మంత్రి బంధువులు కొనుగోలు చేశారు. ఇబ్రహీంపట్నం మండలంలో కూడా ఇప్పటికే సుమారు 2వేల పైచిలుకు ఎకరాలు ప్రభుత్వం రక్షణ రంగ సంస్థలకు కేటాయించగా, మరో 100 ఎకరాలు ఓ స్వచ్ఛంద సంస్థకు 99 సంవత్సరాలకు లీజుకు ఇచ్చారు.