యాలాల, మే 1: మరోసారి కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోవద్దని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి ప్రజలకు సూచించారు. బుధవారం మండలంలోని కోకట్తో పాటు పలు ప్రాంతాల్లో స్టీట్ కార్నర్ మీటింగుల్లో మండల పార్టీ అధ్యక్షుడు రవీందర్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరు గ్యారెంటీలన్ని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని ఎప్పుడు అమలు చేస్తుందని ప్రశ్నించారు. రుణమాఫీ అని చెప్పి రైతులను ఆగం చేసిందని మండిపడ్డారు. రైతుల ఉసురు తగిలిన ప్రభుత్వం ఎంతోకాలం ఉండదని హెచ్చరించారు.
బీజేపీ, కాంగ్రెస్‌లతో ప్రజలకు ఒరిగేదేమీలేదన్నారు. కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి ఓటేస్తే వృథానేనని..ఎన్నికలప్పుడే తాండూరుకు వచ్చే రంజిత్‌రెడ్డి కి ప్రజల్లో ఆదరణ లేదన్నారు. బీఆర్ఎస్ సబ్బండ వర్ణాలకు పెద్దపీట వేసిన విషయాన్ని గుర్తించి.. బీసీబిడ్డ కాసాని జ్ఞానేశ్వర్‌కు ఓటేసి భారీ మెజారిటీ అందించి, మన గొంతును ఢిల్లీలో వినిపించాలన్నారు. తాండూరు నీటిని కొడంగల్‌కు తీసుకెళ్తుంటే స్థానిక ఎమ్మెల్యే చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ మాజీ జిల్లా చైర్మన్ రాజూగౌడ్, వైస్ ఎంపీపీ రమేశ్, తాండూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విఠల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.