మహేశ్వరం, జూన్ 23: పురాతన కాలం నాటి, పాడుబడ్డ మెట్ల బావులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధునీకరించడానికి శ్రీకారం చుడుతుంది. గత ప్రభుత్వాలలో నిరాదరణకు గురైన పురాతన కోనేరు, మెట్లబావులను ప్రభుత్వం భావితరాలకు అందించేందుకు సమాయత్తం అవుతున్నది. అందులో భాగంగానే మహేశ్వరంలో రూ.90 లక్షలను వెచ్చించి కోనేరు మెట్లబావి నిర్మాణ పనులను చేపట్టడానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రత్యేక చొరవను తీసుకుంటున్నారు. మహేశ్వరంలోని గడికోట ప్రక్కనే ఉన్న మెట్లబావి పనులను యుద్ధ ప్రాతిపాదికన పూర్తి చేయడానికి మంత్రి ఆదేశాలను ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం కనుమరుగవుతున్న అలనాటి కట్టడాలను, మెట్ల బావులను తెలంగాణ ప్రజలకు అందించేందుకు గాను వాటి ప్రాధాన్యతను రేపటి పౌరులకు చెప్పేందుకు గాను కోట్ల రూపాయలను ఆయా కళా ఖండాల పునరుద్ధరణకు కేటాయిస్తున్నారు.
నేడు మహేశ్వరం దినదినాభివృద్ధి చెందుతున్న రోజుల్లో మెట్లబావిని ప్రభుత్వం బాగు చేయడానికి ప్రణాళికలను రూపొందిస్తున్నది. మహేశ్వరంలో ప్రసిద్ధి గాంచిన గడికోట మైదానం, శ్రీరాజరాజేశ్వర దేవాలయం, సేవాలాల్ దేవాలయం, కేసీ తండాలో 30 అడుగుల మహాశివుని విగ్రహంతో పాటు మెట్ల బావిని పునరుద్ధరిస్తే ఈ ప్రాంతం మరింత పర్యాటకులకు ఎంతో ప్రాధాన్యతను సంతరించుకోనున్నదని ఈ ప్రాంత ప్రజలు అంటున్నారు. 3 నెలల్లో పనులను పూర్తి చేయాలని సంబంధిత పురావస్తు శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రత్యేక చొరవతో మహేశ్వరం మండలానికి కావాల్సిన నిధులను తీసుకొచ్చి మండలాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తుండడంతో ప్రజలు హర్షం వ్యక్తం పరుస్తున్నారు.
ప్రాచీన కళలు, సంప్రదాయాలను తెలియజెప్పేందుకే కసరత్తు : మంత్రి సబితారెడ్డి
రూ.90 లక్షలతో మెట్ల బావి పనులు
బన్సీలాల్పేట్లో మెట్ల బావిని పునరుద్ధరించి ఐటీ శాఖ మంత్రి భావితరాలకు అంకితం చేశారు. ఆ ప్రాంతానికి పర్యాటకుల తాకిడి పెరిగింది. ఇపుడు మహేశ్వరంలో రూ.90 లక్షలతో మెట్లబావి పనులను చేపడుతున్నాము. మరో మూడు నెలల్లో పనులను పూర్తి చేయాలని ఇప్పటికే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రాచీన కాలం నాటి కళలు, సంప్రదాయాలను ప్రజలకు తెలియజేయడానికి ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసింది. తెలంగాణ సమాజానికి పురాతన, కట్టడాలు వాటి ప్రాముఖ్యతను తెలియజేందుకు తెలంగాణ ప్రభుత్వం నడుం బిగించింది. మహేశ్వరంలో ఉన్న మెట్ల బావి నిర్మాణానికి నిధులను కేటాయించిన సీఎం కేసీఆర్కు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు.
– సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి
ఈ ప్రాంతానికి మంచి పేరు వస్తుంది
మంత్రి సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరంలో ఉన్న పురాతన కోనేరు మెట్లబావిని పునరుద్ధరించడం ఇక్కడి ప్రజల అదృష్టం. ఈ ప్రాంతం ఇప్పుడిప్పుడే అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుంది. ఇప్పటికే ప్రసిద్ధి గాంచిన శ్రీరాజరాజేశ్వర స్వామి దేవాలయం, అక్కన్న మాదన్నల కాలం నాటి గడీకోట ప్రాంగణం, సేవాలాల్ దేవాలయం, కేసీ తండాలో 30 అడుగుల శివుని విగ్రహంతో పాటు మెట్ల బావి పనులు పూర్తి అయితే మహేశ్వరానికి పర్యాటకుల తాకిడి పెరిగే అవకాశం ఉంటుంది. గ్రామాలకు అధిక నిధులను వెచ్చించి గ్రామాలను ప్రగతి పథంలో నడిపిస్తున్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం మండలంతో పాటు నియోజక వర్గాన్ని ప్రణాళికా బద్ధంగా అభివృద్ధి పరుస్తున్నారు.
– కరోళ్ల ప్రియాంక రాజేశ్, మహేశ్వరం సర్పంచ్