రంగారెడ్డి, సెప్టెంబర్ 17(నమస్తే తెలంగాణ): రంగారెడ్డి, వికారాబాద్ కలెక్టరేట్లలో ఘనంగా తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం.. జాతీయ పతాకాలను ఆవిష్కరించిన మంత్రులు స్వరాష్ట్రంలో అనతికాలంలోనే రంగారెడ్డి జిల్లా అద్భుతంగా అభివృద్ధి చెందిందని, మనమంతా సమైక్యత స్ఫూర్తిని చాటి.. కలిసికట్టుగా బంగారు తెలంగాణ కలను సాకారం చేసుకుందామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంత్రి కొంగర కలాన్‌లోని రంగారెడ్డి కలెక్టరేట్ ఆవరణలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వేలాది మంది ప్రాణ త్యాగాల ఫలితమే నేటి స్వేచ్ఛ తెలంగాణ అని అన్నారు.
సీఎం కేసీఆర్ మొక్కవోని దీక్షతో చేపట్టిన ఉద్యమ ఫలితంగా స్వరాష్ట్రం ఏర్పడిందన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ అమలు చేయని రీతిలో రైతుబంధు, రైతుబీమా, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, గృహలక్ష్మి, దళితబంధు, బీసీ, మైనార్టీలకు రూ.లక్ష చొప్పున సాయం వంటి అనేక సంక్షేమ పథకాలు తెలంగాణ ప్రజలకు అందుతున్నాయన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా వికారాబాద్ కలెక్టరేట్ ఆవరణలో రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖల మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు టీఎస్-ఐపాస్ ద్వారా 611 పరిశ్రమలు ఏర్పాటుకాగా రూ.1676 కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. వికారాబాద్ పట్టణంలో రోడ్డు ఓవర్ బ్రిడ్జిని నిర్మించేందుకు రూ.96 కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించిందన్నారు. తాండూరు పట్టణంలో రోడ్డు ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.74 కోట్లు, తాండూరు పట్టణ సుందరీకరణకుగాను రూ.25 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు.
సమైక్య స్ఫూర్తిని చాటి బంగారు తెలంగాణ కలను సాకారం చేసుకుందామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ ఫలాలు అర్హులైన వారికి అందేలా చూడడంతోపాటు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తూ ముందుకు సాగుదామన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదివారం కొంగరకలాన్‌లోని రంగారెడ్డి కలెక్టరేట్ ఆవరణలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె తెలంగాణ నేలపై జరిగిన అనేక పోరాటాలు, అనతికాలంలోనే జిల్లాలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమంపై సుదీర్ఘంగా ప్రసంగించారు.
వీరయోధుల త్యాగ ఫలితమే స్వేచ్ఛ తెలంగాణ
భారత్‌లో హైదరాబాద్ అంతర్భాగమైన రోజును జాతీయ సమైక్యతా దినోత్సవంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్నదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఆనాటి ప్రజాపోరాట ఘట్టాలు, సామాన్యులు అసమాన్యులై చేసిన త్యాగాలు జాతి తలపుల్లో నిత్యం ప్రకాశిస్తూనే ఉంటాయన్నారు. వేలాది మంది ప్రాణ త్యాగ ఫలితమే నేటి స్వేచ్ఛ తెలంగాణ అని అన్నారు. స్వామి రామానంద తీర్థ, సర్దార్ జమలాపురం కేశవరావు, వట్టికోట ఆళ్వార్, దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, కుమురం భీం, రావి నారాయణరెడ్డి, భీంరెడ్డి నర్సింహారెడ్డి, నల్లా నర్సింహులు, ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, దేవులపల్లి వేంకటేశ్వరరావులకు ఈ సందర్భంగా ఘన నివాళులర్పిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. రచనలతో ఉత్తేజాన్ని, ఉద్వేగాన్ని నింపిన సురవరం ప్రతాపరెడ్డి, కాళోజీ, మగ్ధూం మొహియొద్దీన్, షోయబుల్లాఖాన్, బండి యాదగిరి, దాశరథి కృష్ణమాచార్య, సుద్దాల హనుమంతుల స్ఫూర్తిదాయక కృషిని స్మరించుకుందామన్నారు. మహాత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ వంటి నేతలు మతాలకు అతీతంగా నెలకొల్పిన దేశభక్తితో భారతదేశం ఏకీకృతమైందన్నారు.
సమైక్య రాష్ట్రంలో వివక్ష ..
రాష్ర్టాల పునర్విభజన ప్రక్రియలో భాగంగా తెలంగాణ ప్రజల మనోభిష్టానికి వ్యతిరేకంగా తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌లను కలిపి తెలంగాణ ప్రాంతానికి తీరని అన్యాయం చేశారని మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటైన దశాబ్దకాలంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఉద్యమం ఎగిసిపడిందన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి స్వయంగా సారథ్యం వహించి పద్నాలుగేండ్లు పోరాటాన్ని నిర్వహించారని కొనియాడారు. మొక్కవోని దీక్షతో చేపట్టిన ఉద్యమ ఫలితంగా తెలంగాణ స్వరాష్ట్రం సాకారమైందన్నారు.
అనతికాలంలోనే సమగ్ర అభివృద్ధి
మన ఊరు- మన బడి కార్యక్రమంలో జిల్లాలో 464 పాఠశాలలు ఎంపికకాగా..448 పాఠశాలలను రూ.97.88కోట్ల అంచనా వ్యయంతో మౌలిక వసతుల కల్పనకు అనుమతులు ఇవ్వడం జరిగిందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఇప్పటివరకు 65 పాఠశాలల్లో పనులను పూర్తి చేసి ప్రారంభించామన్నారు. అక్టోబర్ 24 నుంచి బడి పిల్లలకు ‘ముఖ్యమంత్రి అల్పాహార పథకం’ అందుబాటులోకి రానుందన్నారు. టీఎస్ ఐపాస్ ద్వారా 1,747 పరిశ్రమలకు రూ.78,798కోట్ల ప్రతిపాదిత పెట్టుబడులతో అనుమతులు లభించగా 1,358 పరిశ్రమలను రూ.62,952కోట్ల పెట్టుబడులతో స్థాపించి 7.25లక్షల మందికి ఉపాధి కల్పించామన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించి సీఎం కేసీఆర్ ఈ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నాన్ని సాకారం చేశారని మంత్రి పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు కింద రంగారెడ్డి జిల్లాలో 20 మండలాల పరిధిలోని 330 గ్రామాలకు చెందిన 3,59,047 ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందుతుందని, తాగు నీటి గోస కూడా తీరుతుందని మంత్రి పేర్కొన్నారు. వేడుకల్లో ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్, జడ్పీ చైర్ పర్సన్ అనితాహరినాథ్‌రెడ్డి, కలెక్టర్హరీశ్, అదనపు కలెక్టర్ భూపాల్‌రెడ్డి, మహేశ్వరం డీసీపీ సీహెచ్ శ్రీనివాస్, ఏసీపీ శ్రీనివాస్, జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, కలెక్టరేట్ ఏవో ప్రమీల రాణి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు
అన్ని రంగాల్లో సంక్షేమ, అభివృద్ధి పరంగా రంగారెడ్డి జిల్లా దూసుకుపోతున్నదని మంత్రి సబితారెడ్డి అన్నారు. 2022-23 వానకాలం, యాసంగి కలిపి 3,04,617 మంది రైతులకు రూ.680కోట్లు రైతుల ఖాతాల్లో జమచేసినట్లు తెలిపారు. 2023-24 వానకాలంలో 3,22,010 మందికి రూ.345కోట్ల సాయం అందించినట్లు పేర్కొన్నారు. 872 మందికి రైతు బీమా పథకం కింద రూ.43.60కోట్ల సాయం అందించి ఆదుకున్నట్లు చెప్పారు. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జిల్లాలో 66 బస్తీ దవాఖానలు, 158 పల్లె దవాఖానలు, 25 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నట్లు వివరించారు. పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో మొదటి విడుతలో 11,685 గొర్రెల యూనిట్లను సుమార రూ.146.17కోట్ల వ్యయంతో పంపిణీ చేశామన్నారు.