మేడిపల్లి గ్రామంలో ఫార్మాసిటీ ఏర్పాటు కోసం గతంలో సేకరించిన భూముల్లో శుక్రవారం అధికారులు రైతులను అటు వైపు రానీయకుండానే సర్వే చేసి.. జేసీబీలతో కందకాలు తీసి, హద్దులను గుర్తించి, ఫెన్సింగ్ పనులు చేపట్టా రు. కాగా, ముందురోజే సర్వే చేసే భూముల వద్దకు సమ్మతి తెలిపిన రైతులు రావొద్దని అధికారులు చాటింపు చేయించారు. దీంతో చాలామంది రైతులు కేసుల భయంతో ఇండ్లకే పరిమితమయ్యారు. ఇచ్చిన మాట ప్రకారం ప్లాట్లను తమకు కేటాయించకపోతే సర్వేను అడ్డుకుంటామని, వేసిన కంచెను తొలగిస్తామని రైతులు హెచ్చరించారు. తమ భూముల జోలికి రాకపోవడంతో కోర్టు స్టే ఉన్న భూములకు చెందిన రైతులు శాంతించారు.
యాచారం, ఏప్రిల్ 4 : మండలంలోని మేడిపల్లి గ్రామంలో ఫార్మాసిటీ ఏర్పాటు కోసం గతంలో సేకరించిన భూములకు భారీ బందోబస్తు మధ్య అధికారులు శుక్రవారం ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. మహేశ్వరం అదనపు డీసీపీ వెంకటసత్యనారాయణ, ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు, ఫార్మాసిటీ సీఐ కృష్ణంరాజుల సమక్షంలో భారీ పోలీస్ బందోబస్తు మధ్య రెవెన్యూ, టీజీఐఐసీ అధికారులు ఫార్మా భూముల్లో సర్వే చేసి.. జేసీబీలతో కందకాలు తీసి, హద్దులను గుర్తించి, ఐరన్ పిల్లర్లు పాతి, ఫెన్సింగ్ పనులు చేపట్టారు. ముఖ్యంగా కొత్తపల్లి సరిహద్దు ప్రాంతంలో ఏసీపీ రాజు జేసీబీ వద్దనే ఉండి ఫెన్సింగ్ పనులను దగ్గరుండి చేయించారు. సర్వే పనుల వద్దకు రైతులు, గ్రామస్తులు, ఆందోళనకారులు రాకుండా సీఐలు, ఎస్ఐల ఆధ్వర్యం లో సివిల్, స్పెషల్ పోలీసులతో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. మేడిపల్లి నుంచి చరికొండ వెళ్లే రోడ్డులో పోలీస్ పికెటింగ్తోపాటు బారికేడ్లను ఏర్పాటు చేశారు. రోడ్డుపై రాకపోకలు సాగించే వాహనాలను ఆపి ఎక్కడికి వెళ్తున్నారంటూ వివరాలు అడిగి మరీ పంపించారు. రైతులు, ప్రజలు కేసులు పెడతారనే భయంతో భూములను సర్వే చేస్తున్న ప్రాంతాలకు వెళ్లకుండా ఇండ్లలోనే ఉన్నారు. కోర్టు స్టే ఉన్న భూములను వదిలిపెట్టి, గతంలో పరిహారం పొందిన భూములను మాత్రమే అధికారులు సర్వేచేసి ఫెన్సింగ్ పనులను ముమ్మరంగా చేపట్టారు. తమ భూ ముల జోలికి రాకపోవడంతో కోర్టు స్టే ఉన్న భూములకు చెందిన రైతులు శాంతించారు. పరిహారం పొందిన రైతులకు వారం రోజుల్లోగా లాటరీ పద్ధతిలో ప్లాట్లను ఇవ్వనున్నట్లు ఆర్డీవో అనంతరెడ్డి, డీసీపీ సునీతారెడ్డి స్పష్టం చేయడంతో ఆ రైతులు సైతం సర్వేకు అంగీకరించారు. ఇచ్చిన మాట ప్రకా రం ప్లాట్లను ఇవ్వకపోతే సర్వేను అడ్డుకుంటామని, వేసిన కంచెను తొలగిస్తామని రైతులు హెచ్చరించారు. దీంతో పోలీసులు,అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
మేడిపల్లిలో ఫార్మాసిటీ ఏర్పాటు కోసం గతంలో సేకరించిన భూముల్లో సర్వే చేస్తున్న విషయం తెలుసుకున్న మండలంలోని తాటిపర్తి గ్రామానికి చెందిన ఫార్మా బాధిత రైతులు శుక్రవారం సమావేశమయ్యారు. నిషేధిత జాబితా నుంచి తమ భూములను తొలగించి ఆన్లైన్లో టీజీఐఐసీ పేరును తొలగించి రైతుల పేర్లను నమోదు చేసిన తర్వాతే తమ గ్రామంలో సర్వే చేపట్టాలని..లేకుంటే సర్వేను అడ్డుకుంటామని వారు హెచ్చరించారు. ఈ సందర్భంగా ఫార్మా వ్యతిరేక పోరాట సమితి సభ్యుడు సామ నిరంజన్ మాట్లాడుతూ.. పోలీసుల బందోబస్తు, బెదిరింపులకు భయపడేదిలేదన్నారు. రైతు సమస్యలను పరిష్కరించాకే భూముల వద్దకు రావాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్నారు.
ఫార్మాకోసం భూములిస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు. ఫార్మాలో భూమిని కోల్పోయా. నేను బీఈడీ చేసి నిరుద్యోగిగా ఉన్నా. ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. ముందుగా ఇచ్చిన మాట ప్రకారం ఫార్మా కోసం భూములిచ్చిన ప్రతి రైతు కుటుంబంలో ఒకరికీ కచ్చితంగా ఉద్యోగం ఇవ్వాలి. లేదంటే మా భూమిని ఫార్మాకు ఇచ్చేది లేదు. అవసరమైతే సర్వే, ఫెన్సింగ్ పనులను అడ్డుకుంటాం.
-మక్కపల్లి సుధాకర్, నిరుద్యోగి మేడిపల్లి
కోర్టు స్టే ఉన్న భూముల జోలికి వస్తే ఊరుకునేది లేదు. ఆ భూములను వదిలిపెట్టి సర్వే చేయాలి. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ముందుగా రైతుల పేర్లను ఆన్ లైన్లో ఎక్కించి.. ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలి. లేదంటే ఫార్మా వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో రైతులందరం కలిసి ఉద్య మిస్తాం.
-బొడ్డు సందీప్‌రెడ్డి, మేడిపల్లి
ఫార్మాసిటీ కోసం భూములిచ్చిన రైతులకు ముందుగా ప్లాట్లను పంపిణీ చేయాలి. వారం రోజుల్లోగా లాటరీ పద్ధతిలో రైతులకు ప్లాట్ల కబ్జా ఇవ్వాలి. ప్రభుత్వమే ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయించాలి. అధికారులు ఇచ్చిన మాట తప్పి వారంలోగా ప్లాట్లు పంపిణీ చేయకపోతే మళ్లీ ఆందోళనలు చేస్తాం. గ్రామంలో కొనసాగుతున్న సర్వే, ఫెన్సింగ్ పనులను అడ్డుకుంటాం.
-పాచ్ఛ భాష, మాజీ సర్పంచ్ మేడిపల్లి