సిటీబ్యూరో, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): గుంతే కదా అని వదిలేస్తే.. 19 మంది ప్రాణాలు తీసింది.. రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చడంలో ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో అంతర్గత, రాష్ట్ర, జాతీయ రహదారులపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. చేవెళ్లలో సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి ప్రధాన కారణం రహదారిపై ఉన్న గుంతేనని పోలీసులు, స్థానికులు చెబుతున్నారు. కంకర ఓవర్‌లోడ్‌తో వెళ్తున్న టిప్పర్ గుంతను తప్పించబోయి..ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొన్నది. ఈ ప్రమాదంలో అటు టిప్పర్, ఇటు బస్సు కూడా ఓవర్ లోడ్‌తో వెళ్లడంతోనే భారీ నష్టం జరిగిందని పోలీసుల విచారణలో తేలింది. గతేడాది డిసెంబర్లో వికారాబాద్, చేవెళ్ల రోడ్డుపై ప్రమాదం జరిగింది.
ఆలూరుగేట్ వద్ద కూరగాయలు విక్రయించే రైతులపైకి లారీ వెళ్లడంతో ఐదుగురు మృత్యువాతపడ్డారు. అప్పుడూ రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు హడావుడి చేసి వదిలేశా రు. హైదరాబాద్-బీజాపూర్ హైవేపై తరచూ ప్రమాదాలు జరుగుతుండడంతో డబుల్ నుంచి నాలుగు లేన్లుగా విస్తరించాలని స్థానికులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నా పాలకులు పట్టించుకోవడంలేదు. గత కేసీఆర్ ప్రభుత్వం ఈ హైవే విస్తరణకు సుమారుగా రూ.1,000 కోట్ల నిధులను విడుదల చేసినా.. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోడ్డు విస్తరించకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ..19 మంది మృతి చెందారని స్థానికులు, వాహనచోదకులు రేవంత్ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.