కొడంగల్, నవంబర్ 5 : చెవిలో పూలు పెట్టుకొని కేడీపీ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం కొడంగల్‌లో వినూత్న నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేడీపీ జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కొడంగల్ తన స్వస్థలమని, రాజకీయంగా భవిష్యత్తును అందించిన ప్రాంతంగా సీఎం చెప్పుకోవడానికి మాత్రమే సరిపోతుంది కానీ అభివృద్ధికి సహకరించే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని అప్పాయిపల్లిలో మంజూరైన మెడికల్ కళాశాలను లగచెర్లకు తరలించడంలో సీఎం ఆంతర్యమేమిటో వివరించడం లేదన్నారు. మెడికల్ కళాశాలతో కొడంగల్ దశ మారుతుందని అనుకుంటే పూర్తిగా మటుమాయం చేసే పరిస్థితి గోచరిస్తున్నదని వాపోయారు.
సీఎం రేవంత్‌రెడ్డి బాధ్యత తీసుకోవాలని, విద్యాలయాల తరలింపు ప్రక్రియను వెంటనే నిలిపివేసి, కొడంగల్‌ను అభివృద్ధి చేసేలా సహకరించాలని కోరారు. ఇప్పటికైనా సీఎం కొడంగల్ ప్రజల మనోభావాన్ని గుర్తించి కొడంగల్ అభివృద్ధి సాధ్యపడే విద్యాలయాలను మంజూరు చేసిన ప్రాంతాల్లోనే ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కొడంగల్ అభివృద్ధిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లేందుకు తరలుతున్న కేడీపీ జేఏసీ నాయకులను మధ్యలోనే అరెస్టు చేయడం రాజ్యాంగవిరుద్ధంగా పేర్కొన్నారు. అరెస్టులు చేసి ఉద్యమాన్ని ఆపలేరని, ప్రజా సంక్షేమ దిశగా ప్రభుత్వం పాటుపడాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో కేడీపీ జేఏసీ కో కన్వీనర్ సుకేష్కుమార్ పాల్గొన్నారు.