కొడంగల్, డిసెంబర్ 25 ; లగచర్ల ఘటనలో జైలుకు వెళ్లిన అనంతరం మొదటిసారిగా నియోజకవర్గానికి విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డికి బీఆర్ఎస్ నాయకులు, రైతులు, అభిమానులు, మహిళలు పెద్దఎత్తున స్వాగతం పలికారు. కోర్టు ఆదేశాల ప్రకారం బుధవారం మాజీ ఎమ్మెల్యే బొంరాస్‌పేట పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా అభిమానులు, రైతులు మాజీ ఎమ్మెల్యేకు వీర తిలకం దిద్ది, మంగళహారతులతో స్వాగతం పలికారు. ఎల్లప్పుడూ ప్రజా సంక్షేమాన్ని కోరుకునే నాయకుడిని జైల్లో పెట్టారని కన్నీటిపర్యంతమయ్యారు. న్యాయం ఎప్పటికీ గెలుస్తుందని, రైతుల పక్షాన పోరాడిన మాజీ ఎమ్మెల్యే వెంటే ఉంటామని జనం జేజేలు పలికారు. రాజకీయ కక్షతో కేసులో ఇరికించారని ఇలాంటి నాయకుడిని దూరం చేసుకోబోమన్నారు. గతంలో బీఆర్ఎస్ పాలనలో ఎటువంటి కష్టం లేకుండా వ్యవసాయం చేసుకున్నామని రైతులు తెలిపారు. కానీ కాంగ్రెస్ పాలనలో సంవత్సర కాలంలోనే రైతులే కాకుండా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురైనట్లు ఆవేదన వ్యక్తం చేశారు.
లగచర్ల దాడికి కారణం..కాంగ్రెస్ సర్కార్ వైఫల్యమే..
లగచర్ల దాడికి కారణం సీఎం రేవంత్‌రెడ్డి, ప్రభుత్వం, పోలీసులు, నిఘా వైఫల్యమేనని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం బొంరాస్‌పేట పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రమ కేసులు పెట్టి ప్రశ్నించే గొంతుకలను నొక్కాలని రేవంత్‌రెడ్డి సర్కార్ చూస్తున్నదన్నారు. కాంగ్రెస్ పార్టీ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందన్నారు. ఆరు గ్యారెంటీలంటూ కల్లబొల్లి మాటలు చెప్పిన రేవంత్ సర్కార్ తూతూమంత్రంగా రైతుల రుణమాఫీ చేసి చేతులు దులుపుకొన్నదన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడం చేతకాకపోతే సీఎం పదవి నుంచి తప్పుకోవాలన్నారు. ఎకరానికి రూ.15వేల రైతుభరోసా ఇస్తామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం.. అమలు చేయడంలో విస్మరించిందన్నారు. పింఛన్లు పెంచుతామని, కల్యాణలక్ష్మి కింద తులం బంగారం ఇస్తామన్న హామీ ఎక్కడికెళ్లాయని ప్రశ్నించారు. రూ.500లకే సిలిండర్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ సర్కార్… ఎక్కడిస్తున్నారో చెప్పాలన్నారు. రేవంత్ సర్కార్ తీరును ప్రజలు, రైతులు గమనిస్తున్నారని, రాబోవు రోజుల్లో తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు.