శంషాబాద్ రూరల్/షాద్నగర్, జూన్ 5 : గింజ గింజను ఎంతో జాగ్రతగా పండించే రైతులను దృష్టిలో పెట్టుకుని నకిలీ విత్తనాల సరఫరా జరుగకుండా చూడాలని సీఎం కేసీఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకు సైబరాబాద్ పోలీసులు నకిలీ విత్తనాల విక్రయదారులపై కొరడా ఝులిపిస్తున్నారు. ఇప్పటికే పలు చోట్ల నకిలీ విత్తనాలను పట్టుకున్న పోలీసులు తాజాగా షాద్నగర్ పరిసరాల్లో నకిలీ పత్తి విత్తనాలను విక్రయిస్తున్న ఒక అంతర్రాష్ట్ర నేరస్తుడిని శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి రూ.40లక్షల విలువైన 1.5టన్నుల నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ మేరకు సోమవారం శంషాబాద్ జోన్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ నారాయణరెడ్డి, శంషాబాద్ ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ సత్యనారాయణతో కలిసి కేసు వివరాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బీమవరం ప్రాం తానికి చెందిన తోటకూర రంగారావు పదేండ్ల నుం చి కర్నూల్ జిల్లాలోని వెంకటరమణ కాలనీలో నివాసముంటూ అక్కడే తనకు ఉన్న భూమిలో వ్యవసాయం ముసుగులో నిషేధిత బీజీ-3/హెచ్టీ విత్తనాలను సాగు చేస్తున్నాడు. ఇలా సాగుచేసిన నకిలీ విత్తనాలను కర్ణాటకలో గిన్నింగ్ చేయించి, రసాయనాలు, రంగులు అద్ది రైతులకు సరఫరా చేస్తాడు. నిందితుడు గత కొంత కాలంగా తెలంగాణ, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ర్టాల్లోని రైతులకు నిషేధిత నకిలీ పత్తి విత్తనాలను సరఫరా చేస్తూ మోసగిస్తున్నాడు.
గతంలోనూ పట్టుబడి….
నకిలీ విత్తనాలు విక్రయిస్తూ గతంలోనూ రంగారావు పలు మార్లు పోలీసులకు పట్టుబడ్డాడు. అందులో భాగంగా నిందితుడిపై ఆదిలాబాద్ జిల్లాలోని బీమీని, తాండూరు పోలీస్స్టేషన్లలో కేసులు నమోదు కూడా నమోదయ్యాయి. అయి నా తీరు మార్చుకోని నిందితుడు అధిక లాభాల కోసం నకిలీ విత్తనాలను విక్రయిస్తూ అమాయక రైతులను మోసగిస్తున్నాడు. ఈ క్రమంలోనే కర్నూల్లో పండించిన నకిలీ పత్తి విత్తనాలను ఆదివారం షాద్నగర్ మీదుగా హైదరాబాద్ వైపు తరలిస్తుండగా విశ్వసనీయ సమాచారం అందుకున్న శంషాబాద్ ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర ఆదేశాల మేరకు శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి పర్యవేక్షణలో షాద్నగర్ పోలీసులు, వ్యవసాయ అధికారులతో కలిసి సంయుక్తంగా దాడులు జరిపారు. ఈ దాడుల్లో నిందితుడు తోటకూర రంగారావును అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.40లక్షల విలువ చేసే 1.5టన్నుల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.