బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం వైద్య రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తూ పేదలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యాన్ని అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నది. ఇందుకుగాను అధిక మొత్తంలో నిధులను కేటాయిస్తూ, సర్కారు దవాఖానల రూపురేఖలను మార్చుతున్నది. గత తొమ్మిదేండ్లలో ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతానికి సర్కారు చేపట్టిన చర్యలతో ప్రజలు దవాఖానలకు క్యూ కడుతున్నారు. జ్వరం మొదలుకొని ప్రసవాల వరకు ఉచిత వైద్య సేవలను అందిస్తున్నది.
గతంలో కిడ్నీ డయాలసిస్ సేవలకు కొందరు ఉన్న ఆస్తులు అమ్ముకోవడం, ఆస్తులు లేనివారు ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిన దయనీయ పరిస్థితులు ఉండేవి. దీన్ని గమనించిన బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు ఉచితంగా డయాలసిస్ సేవలందించేందుకు సర్కారు దవాఖానల్లో డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నది. వికారాబాద్ జిల్లాలోని వికారాబాద్ ఏరియా ఆసుపత్రి, తాండూరులోని జిల్లా దవాఖాన, కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇప్పటికే ఉచిత డయాలసిస్ సేవలందుతున్నాయి.
త్వరలో పరిగి దవాఖానలోనూ అందుబాటులోకి రానున్నాయి. వికారాబాద్‌లో 5 డయాలసిస్ యంత్రాలుండగా ఐదు పడకలు., తాండూరులో 8 డయాలసిస్ యంత్రాలు, 8 పడకలు., కొడంగల్‌లో 3 డయాలసిస్ యంత్రాలు, మూడు పడకల ద్వారా డయాలసిస్ సేవలందుతున్నాయి. జిల్లావ్యాప్తంగా రోజుకు 120 మంది పేదలకు సేవలందిస్తున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లే వ్యయప్రయాసలు తప్పడమే కాకుండా పైసా ఖర్చు లేకుండా చికిత్స అందుతున్నదని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వికారాబాద్, జూలై 5, (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ ప్రభుత్వం సామాన్య ప్రజానీకానికి కూడా నాణ్యమైన వైద్యాన్ని అందించే విధంగా చర్యలను ముమ్మరం చేసింది. ఇప్పటికే పల్లె దవాఖానలు, బస్తీ దవాఖానలను, అవసరమైన వైద్యుల భర్తీ, సరిపోను మందులను పంపిణీ చేయడం వంటి చర్యలు చేపట్టిన ప్రభుత్వం ఖర్చుతో కూడుకున్న మరిన్ని వైద్య సేవలనూ ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చింది.
ప్రభుత్వాసుపత్రులను కార్పొరేట్ దవాఖానలకు దీటుగా అభివృద్ధిలోకి తీసుకురావడంతోపాటు అదే స్థాయిలో వైద్య సేవలను అందించేందుకు కృషి చేస్తున్నది. గతంలో ప్రభుత్వాసుపత్రులను పూర్తిగా విస్మరించడంతో ప్రజలు అటువైపు చూసేవారు కాదు, కానీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం వైద్యరంగానికి అధిక ప్రాధాన్యతనిస్తూ పేదలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యాన్ని అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నది. ఇందుకుగాను అధిక మొత్తంలో నిధులను కేటాయిస్తూ, ప్రభుత్వాసుపత్రుల రూపురేఖలను మార్చింది.
ముఖ్యంగా గత తొమ్మిదేండ్లలో ప్రభుత్వాసుపత్రుల్లో సకల సౌకర్యాలు సమకూరడంతో పాటు నాణ్యమైన వైద్యం అందుతుండడంతో జనం క్యూ కడుతున్నారు. సాధారణ జ్వరం మొదలు ప్రసవాలు, డయాలసిస్ సేవల వరకు సర్కారు దవాఖానల్లో సేవలందుతున్నాయి. కిడ్నీ రోగులు రోజురోజుకూ పెరుగుతుండడం, ప్రైవేటు దవాఖానల్లో డయాలసిస్ ప్రక్రియ రూ.లక్షల్లో ఖర్చు కానున్న దృష్ట్యా పేదలకు ఉచితంగా సేవలందించేందుకుగాను సర్కారు దవాఖానల్లో డయాలసిస్ కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చింది.
హైదరాబాద్‌కు రావాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే డయాలసిస్ సేవలందుతున్నాయి. కిడ్నీ రోగులకు వారానికి ఒకట్రెండు సార్లు డయాలసిస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి దానికి అనుగుణంగా డయాలసిస్ కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. గతంలో డయాలసిస్ సేవలకుగాను కొందరు పేదలు ఉన్న ఆస్తులు అమ్ముకోవడం, ఆస్తులు లేని వారు ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిన దయనీయ పరిస్థితులు ఉండేవి. జిల్లాలో వికారాబాద్ ఏరియా దవాఖాన, తాండూరులోని జిల్లా ఆసుపత్రి, కొడంగల్ ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు డయాలసిస్ సేవలందిస్తున్నారు.
వికారాబాద్‌లో 5 డయాలసిస్ యంత్రాలుండగా ఐదు పడకలు, తాండూరు జిల్లా ఆసుపత్రిలోని డయాలసిస్ కేంద్రంలో 8 డయాలసిస్ యంత్రాలుండగా 8 పడకలు ఉన్నాయి. కొడంగల్‌లో మూడు డయాలసిస్ యంత్రాలు, మూడు పడకల ద్వారా డయాలసిస్ సేవలందుతున్నాయి. జిల్లావ్యాప్తంగా డయాలసిస్ కేంద్రాల ద్వారా రోజుకు 120 మంది పేదలకు ఉచితంగా డయాలసిస్ సేవలందిస్తున్నారు. ఒక్కో కిడ్నీ వ్యాధిగ్రస్తుడికి డయాలసిస్ ప్రక్రియ చేసేందుకుగాను 4 గంటలపాటు 24 గంటల్లో డయాలసిస్ ప్రక్రియను నిర్వహిస్తున్నారు.
మూడు నెలల కింద వ్యాధి సోకింది..
మూడు నెలల కింద వ్యాధి వచ్చింది. ప్రతి నెలా హైదరాబాద్‌కు వెళ్లి ప్రైవేటు దవాఖానలో డయాలసిస్ చేసుకోవాలా అనుకున్నా. కొడంగల్ ప్రభుత్వ దవాఖానలో డయాలసిస్ సెంటర్ ఉందని తెలియడంతో రెండు నెలల నుంచి ఇక్కడే చికిత్స చేయించుకొంటున్నా. ఎటువంటి ఖర్చు లేదు. దగ్గరలోనే సెంటర్ అందుబాటులో ఉండటం వల్ల కిడ్నీ సంబంధిత రోగులకు వెసులుబాటుగా ఉన్నది.
– హేమలత, ఏర్పుమళ్ల గ్రామం, దౌల్తాబాద్ మండలం
అందుబాటులోకి డయాలసిస్ సేవలు..
జిల్లాలోని నియోజకవర్గానికి ఒకటి చొప్పున రాష్ట్ర ప్రభుత్వం డయాలసిస్ కేంద్రాలను మంజూరు చేసింది. జిల్లాలోని వికారాబాద్ ఏరియా ఆసుపత్రి, తాండూరులోని జిల్లా ఆసుపత్రి, కొడంగల్ ప్రభుత్వాసుపత్రిలో ఉచిత డయాలసిస్ సేవలందిస్తున్నాం. త్వరలో పరిగి ప్రభుత్వాసుపత్రిలో కూడా డయాలసిస్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తాం. గతంలో ఖరీదైన డయాలసిస్ సేవలను పేదలకు ప్రభుత్వం ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చింది.
– పల్వన్‌కుమార్, డీఎంహెచ్‌వో
అప్పట్లో ఇబ్బందికరం..నేడు సౌకర్యం
కిడ్నీ సంబంధిత వ్యాధి వచ్చిందంటే నరకయాతన అనుభవించాల్సిందే.. ప్రతి నెలలో రెండు మూడు సార్లు చికిత్సలు నిర్వహించుకోవాలి వస్తుంది. ఐదేండ్లుగా ఈ వ్యాధితో బాధపడుతున్నా. పరిగిలో డయాలసిస్ సెంటర్ అందుబాటులో లేకపోవడంతో కొడంగల్‌కు వచ్చి చికిత్స చేసుకుంటున్నా. గతంలో హైదరాబాద్ ప్రైవేటు ఆసుపత్రుల్లో వేలకువేలు ఖర్చు చేయాల్సి వచ్చేది. ఇప్పడు కొడంగల్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ ప్రారంభం కావడం సంతోషకరం. నయా పైసా ఖర్చు లేకుండా చికిత్స జరుగుతున్నది.
-హర్యానాయక్, కిష్టాపూర్ గ్రామం, పరిగి
బతుకాలంటే డయాలసిస్ తప్పదు..
చిన్న వయస్సులోనే కిడ్నీ సంబంధిత వ్యాధి వచ్చింది. రెండేండ్లుగా చికిత్స చేయించుకుంటున్నా. మొదట్లో ప్రైవేటు ఆసుపత్రిలో పెద్ద మొత్తంలో ఖర్చు అయ్యింది. ఆ తరువాత తాండూరు పట్టణంలోని ప్రభుత్వ దవాఖానలో డయాలసిస్ సెంటర్ అందుబాటులోకి వచ్చింది. చికిత్స చేసుకోవాలంటే రావులపల్లి నుంచి తాండూరుకు 40 కిలోమీటర్ల దూరం ప్రైవేటు వాహనంలో వెళ్లి చికిత్స చేసుకునే వాడిని. ఇప్పుడు కొడంగల్ ప్రభుత్వ దవాఖానలోనే డయాలసిస్ సెంటర్ ఏర్పాటు కావడంతో వ్యయ ప్రయాసలు తప్పాయి.
-భీంరెడ్డి, రావులపల్లి గ్రామం, కొడంగల్
మూడేండ్లుగా చికిత్స చేయించుకుంటున్నా..
మూడేండ్ల కింద ఈ వ్యాధి వచ్చింది. ప్రతి నెలా డయాలసిస్ చేసుకుంటున్నా. తాండూరు, మహబూబ్‌నగర్, హైదరాబాద్ పట్టణాలకు వెళ్లి డయాలసిస్ చేసుకోవాల్సి వచ్చేది. చాలా కాలం ప్రైవేటులోనే డయాలసిస్ చేసుకున్నా. మాది పేద కుటుంబం.. ప్రతి నెలా వేలకు వేలు ఖర్చు చేయాలంటే బాధగా ఉండేది. అప్పట్లో వైద్యం కోసం దూర ప్రాంతాలకు వెళ్లాలంటే ఇబ్బంది పడేవాళ్లం. తాండూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సెంటర్ ఉండడంతో అక్కడ చేసుకుంటున్నా. ప్రస్తుతం కొడంగల్ పట్టణంలోనే డయాలసిస్ సెంటర్ ఏర్పాటు కావడంతో ఉపయోగంగా ఉన్నది.
– అమీన్బేగం, కౌడీడ్ గ్రామం, దౌల్తాబాద్ మండలం