రంగారెడ్డి, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ)/ ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నది. వైస్ చైర్పర్సన్ పదవి బీజేపీ అభ్యర్థి ముత్యాల శ్యామలను వరించగా.. సుమారు 50 రోజుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ పీఠం ఎట్టకేలకు బీఆర్ఎస్ వశమైంది. చైర్మన్‌గా బీఆర్ఎస్కు చెందిన ఏడోవార్డు కౌన్సిలర్ టేకుల సుదర్శన్‌రెడ్డి, పొత్తులో భాగంగా వైస్ చైర్‌పర్సన్‌గా ఒకటో వార్డుకు చెందిన బీజేపీ అభ్యర్థి ముత్యాల శ్యామల ఎన్నికయ్యారు. మున్సిపాలిటీలో బీఆర్ఎస్కు పూ ర్తి మెజార్టీ ఉన్నా అధికారపార్టీ అనేక కుట్ర లు చేసి రెండుసార్లు మున్సిపల్ ఎన్నికను వాయిదా వేయించింది.
అయినా బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా సమిష్టిగా సుమారు 50 రోజుల పా టు క్యాంపులో ఉన్నారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లను ఆ క్యాంపు నుంచి రప్పించేందుకు అధికార పార్టీ అనేక కుట్రలు చేసినా వారి ఆటలు సాగలేదు. చివరకు చైర్మన్ పీఠంపై ఆశలు సన్నగిల్లి కాంగ్రెస్ చేతులెత్తేసింది. ఇబ్రహీంపట్నం మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవాలని బీఆర్ఎస్ పార్టీ మొదటినుంచి వ్యూహాత్మకంగా పావులు కదిపింది. మున్సిపల్ పీఠాన్ని దక్కించుకునేందుకు బీఆర్ఎస్ కు సరిపడా సంఖ్యాబలం 13 మంది ఉన్నా .. స్వతంత్ర అభ్యర్థితోపాటు బీజేపీ అభ్యర్థిని కూడా తమకు అనుకూలంగా మలుచుకోవడం తో ఆ సంఖ్య 15కు చేరింది. అయితే, ఆకుల యాదగిరి బీఆర్ఎస్ను విభేదించి కాంగ్రెస్‌కు మద్దతు పలికినా మెజార్టీ మాత్రం తగ్గలేదు. అనుకున్నట్లుగానే ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని బీఆర్ఎస్, వైస్‌చైర్మన్‌ను బీజేపీ దక్కించుకున్నాయి.
ఫలించిన మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మంత్రాంగం..
ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికలో బీఆర్ఎస్కు పూర్తి మెజార్టీ లభించగా.. కాంగ్రెస్‌పార్టీ నుంచి 8 మంది కౌన్సిలర్లే గెలుపొందారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన కౌన్సిలర్లను తమ వైపు తిప్పుకొని చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవాలని ఎమ్మెల్యే యత్నించారు. ఈ కుట్రను పసిగట్టిన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఆయన తనయుడు మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి తమ కౌన్సిలర్లు చేజారకుండా వారిని క్యాంపునకు తరలించారు. వీరంతా క్యాంపులో ఉండగానే బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన ఆకుల యాదగిరి తనకు చైర్మన్ పీఠం కావాలని కుంపటి లేపారు.
గ్రహించిన మంచిరెడ్డి ఆయన్ను చైర్మన్ ఎన్నికకు తీసుకురాకుండా మిగతా కౌన్సిలర్లతో హాజరయ్యారు. దీంతో ఆకుల యాదగిరి కుటుంబసభ్యులు హైకోర్టును ఆశ్రయించడంతో ఎన్నికను వాయిదా వేసింది. రెండోసారి జరిగిన ఎన్నికలోనూ బీఆర్ఎస్ కౌన్సిలందరూ సుదర్శన్‌రెడ్డిని చైర్మన్‌గా ఎన్నుకున్నారు. ఈ లోగానే హైకోర్టు ఈ ఎన్నికను నిలిపేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. సుమారు యాభై రోజులపాటు కౌన్సిలర్లు క్యాంపులోనే ఉన్నారు. వారిని తమ వైపు తిప్పుకొనేందుకు అధికారపార్టీ అనేక ప్రలోభాలకు పాల్పడినా ఫలితంలేదు.
బలం లేకున్నా బరిలోకి దిగి..భంగపడి..
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో కాంగ్రెస్‌కు బలం లేకున్నా చైర్మ న్ పీఠాన్ని దక్కించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేసి..చివరకు భంగపడింది. ఈ ఎన్నికలో కాంగ్రెస్ నుంచి ఎనిమిది మంది మాత్రమే కౌన్సిలర్లు గెలువగా.. బీజేపీ నుంచి గెలిచిన మరో అభ్య ర్థి వారికి మద్దతు ఇవ్వగా.. ఎమ్మెల్యే ఓటుతో కాంగ్రెస్ బలం 10కి చేరింది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఆకుల యాదగిరి కూడా ఆ పార్టీ కి మద్దతు తెలపడంతో వారి బలం 11కు చేరింది. మరో ఇద్దరిని తమవైపు తిప్పుకొని మున్సిపల్ పీఠాన్ని అధిరోహించాలని ఎమ్మె ల్యే మల్రెడ్డి రంగారెడ్డితోపాటు కాంగ్రెస్ నాయకులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కాగా, ఈ ఎన్నికకు పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. సుమారు 400మంది పోలీసుల తో మున్సిపల్ కార్యాలయం చుట్టూ కట్టుదిట్టమైన భద్రత ఏర్పా ట్లు చేశారు. గతంలో ఉన్న ఇబ్రహీంపట్నం ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆర్డీవోను మార్చి జిల్లా పరిషత్ సీఈఓ కృష్ణారెడ్డిని ఎన్నికల అధికారిగా ఏర్పాటు చేసి ఈ ఎన్నికను చాలా పకడ్బందీగా నిర్వహించారు.
కౌన్సిలర్లు చేజారకుండా..
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అనేక కుట్రలకు పాల్పడగా వాటిని ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ కౌన్సిలర్లు చేజార కుండా కాపాడారు మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి. చైర్మన్ ఎన్నిక రెండుసార్లు వాయిదా పడినా కౌన్సిలర్లను విడిచిపెట్టకుండా సుమారు 50 రోజులపాటు వారిని క్యాంపు లో ఉంచారు. కాంగ్రెస్ నాయకు లకు ఒక్క అవకాశమూ ఇవ్వకుం డా పట్టుదలతో ఉండి ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని బీఆర్ఎస్కు అందించారు.
ఎమ్మెల్యే రంగారెడ్డికి ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదు..
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి ప్రజాస్వామ్యంపై ఏ మాత్రం నమ్మకంలేదు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రజలిచ్చిన తీర్పును అపహాస్యం చేశారు. ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడింది. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు 13 మందిని బీఆర్ఎస్కు చెందిన కౌన్సిలర్లను గెలిపించారు.కేవలం 8 మందికే పరిమితమైన కాంగ్రెస్ అడ్డదారిలో అధికారాన్ని దక్కించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేసి భంగపడింది. బీఆర్ఎస్ కౌన్సిలర్లు యాభై రోజుల పాటు దీక్ష, పట్టుదలతో ఉండి ఇబ్రహీంపట్నంలో పార్టీని గెలిపించారు. వారందకీ కృతజ్ఞతలు. భవిష్యత్తు బీఆర్ఎస్దే.. కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయం.
-మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు