కులకచర్ల, జూలై 8 : కులకచర్ల మండల పరిధిలోని పుట్టపహాడ్, అంతారం, అనంతసాగర్ గ్రామాల్లో కులకచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో టిబి ముక్త అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా క్షయ వ్యాధి, రక్తపోటు, హెచ్ఐవీ, ధూమపానము, మధుమేహము తదితర వ్యాధులపై అవగాహన కల్పించారు. అవసరమైన వారికి మెడిసిన్స్ ఇవ్వడం జరిగిందని, ఎక్స్ రే పరీక్షకు 15 మందిని పంపించినట్లు జిల్లా టిబి అధికారి డాక్టర్ రవీంద్ర యాదవ్ తెలిపారు.
టీబీ బారిన పడిన వారికి పౌష్టికాహారం కొరకు ప్రతి టిబి పేషెంటుకు రూ. 1000 ప్రతి నెల వారి బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నట్లు తెలిపారు. వీరికి 6 నెలలు మందులు ఉచితంగా అందిస్తామన్నారు. హెచ్ఐవితో ఉన్న ప్రతి ఒక్కరూ తెమడ పరీక్ష చేయించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ కిరణ్ కుమార్ గౌడ్, పల్లె దవాఖాన డాక్టర్ మనీష్ రెడ్డి, గోపాల్, టిబి హెల్త్ విజిటర్ రాజు నాయక్, ఏఎన్ఎం వెంకటమ్మ, ఆశలు, ప్రజలు పాల్గొన్నారు.